అవును బిగ్ బాసూ… ఓ ప్రశ్న… నువ్వు పెట్టిన టాస్కుల్లో చెమటోడ్చి, పలుచోట్ల తన భుజబలంతో కూడా ఆడి, గెలిచి, ఫినాలే అస్త్ర గెలుచుకున్నాడు కదా… అంటే ఎలిమినేషన్ల నుంచి ఇమ్యూనిటీ వచ్చేసి, నేరుగా ఫినాలేకు వెళ్లిపోయినట్టే కదా అర్థం… మరి మళ్లీ ఎలిమినేషన్ల జాబితాలో ఉన్నట్టు చూపించడం దేనికి..? అంటే… ఫినాలే అస్త్ర చేతికి వచ్చినా సరే, ఎలిమినేషన్ కత్తి వేలాడుతుందా..? అదెలా..? నీ దుంపతెగ…
ఏమాటకామాట… ఈ సీజన్ నిజంగానే పేలవంగా సాగుతోంది… గత సీజన్‌కు దీటుగా విసుగెత్తిస్తోంది… దానికి ప్రధాన కారకుడు శివాజీ… అనవసరంగా తనను ఈ సీజన్‌లోకి తీసుకున్నారు… పోతా పోతా అంటాడు, ఆటలు ఆడడు, బెడ్డు వదలడు, పైగా చెయ్యి నొప్పి, మాట్లాడితే వెటకారాలు, నీతిబోధలు… ఈ పెదకామందుకు ఓ ఇద్దరు పాలేర్లు… వీళ్లకు ప్రతిగా మరో సీరియల్ బ్యాచ్… రెండు గ్యాంగుల నడుమ ఫైట్లు…
ఓ వినోదం లేదు, ఓ లవ్వు ట్రాక్ లేదు… వ్యూహాలకు ప్రతివ్యూహాలు లేవు… బిగ్ బాస్ మోస్తోంది శివాజీని, నాగార్జున మోస్తున్నాడు, బయట తను మాట్లాడి పెట్టుకున్న సోషల్ మీడియా బ్యాచ్ మోస్తోంది… బాగా శ్రమిస్తోంది… ఎదుటి గ్యాంగులోని శోభాశెట్టిని టార్గెట్ చేసి తిట్టిపోస్తోంది… ఐనాసరే శివాజీ ఆటతీరు మొత్తం సీజన్‌కే చిరాకుగా మారింది…
Ads
మొన్నటి నామినేషన్లలో నలుగురు కంటెస్టెంట్లు శివాజీని లెఫ్ట్ రైట్ తీసుకున్నారు… ప్రత్యేకించి ఏ అర్జున్ కోసమైతే శివాజీ అమర్‌దీప్‌కు ఇచ్చిన మాట తప్పాడో, అర్జున్‌కు కెప్టెన్సీ టాస్కులో సాయం చేశాడో, అదే అర్జున్ కూడా శివాజీని నామినేట్ చేశాడు… ఆ తరువాత శివాజీ బ్యాచ్ సోషల్ మీడియా అర్జున్‌ను టార్గెట్ చేయసాగారు… అర్జున్ పాయింట్ ఏమిటంటే… ‘‘నువ్వు నా భార్యకు ఏదో మాటిచ్చావని పదే పదే చెబుతూ, నాకేదో నువ్వు సాయం చేస్తేనే నేను ఆటలో ఉన్నట్టు చెబుతున్నావు కదా, అంటే నా మెరిట్ ఏమీ లేదా’’ అనేది అర్జున్ పాయింట్…
శివాజీకి ఇలా క్లాస్ పీకే సాహసం గతంలో హౌజ్‌మేట్లు పెద్దగా చేయలేదు… అర్జున్ మాత్రమే శివాజీ చుట్టూ అల్లుకున్న ఓ మాయను చేధించాడు… అంతేకాదు, ఫినాలే అస్త్ర పోటీలో తను సొంతంగా గెలిచాడు… ఒకవైపు అమర్‌దీప్‌కు శోభ, గౌతమ్ తమ పాయింట్లు ఇచ్చి సాయం చేస్తే… ఒక దశలో వెనుకబడిపోయినా అర్జున్ ఎవరి సాయమూ అక్కర్లేకుండానే చివరికి గెలిచాడు… అర్జున్ ఓటమిని చూడాలనుకున్న శివాజీ మొహం మాడిపోయింది…
కొన్ని పొరపొచ్చాలతో ప్రియాంక, శోభ, అమర్‌దీప్‌ల దోస్తీ ఒడిదొడుకుల్లో పడినట్టు కనిపించినా సరే, మళ్లీ ఒక్కటయ్యారు… అదీ అమర్‌దీప్ కోసమే ఈ విభేదాలు… అర్జున్ విషయానికొస్తే… తను మధ్యలో వచ్చాడు ఆటలోకి… ఐనాసరే, ఆటలో నిలబడ్డాడు, పైగా మొదటి నుంచీ ఆటలో, హౌజులో ఉన్న ఇతర కంటెస్టెంట్లకన్నా ముందే ఫినాలేలోకి దూసుకుపోయాడు… తెలివిగా, కూల్‌గా, స్థిరంగా ఆడటం అంటే అదే…!!
Share this Article