‘‘అర్జునుడు ఆ స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని చేధించలేక విఫలుడవుతాడు… తరువాత కృష్ణుడు దాన్ని చేధించి, వధువు చేత వరమాల వేయించుకుంటాడు…’’ నమ్మడం లేదు కదా… మరోసారి చదివారు కదా… ఏమిటీ పైత్యం అని కోపమొస్తున్నది కదా… కానీ ఆ వాక్యాలు నిజమే… భారతం, భాగవతాల్లో మనకు తెలియని, మనం స్పృశించని బోలెడు కథలున్నయ్, పాత్రలున్నయ్… సంఘటనలున్నయ్… ఎటొచ్చీ మనం ఆ వైపు వెళ్లడం లేదు అంతే…
మరి ఈ కృష్ణుడు ఏమిటి..? మత్స్యయంత్రం ఏమిటి..? స్వయంవరం ఏమిటి..? ఆశ్చర్యంగా ఉందా..? ఇది మహాభారతంలోని ద్రౌపది స్వయంవరం కాదు… ఇది భాగవతంలోని లక్షణ స్వయంవరం… ఈ కథేమిటో కాస్త తెలియాలంటే మనం మహాభాగవతంలోని దశమస్కంధంలోకి వెళ్లాలి ఓసారి… అక్కడే మనకు ఈ లక్షణ పరిణయం కథ గోచరిస్తుంది…
కృష్ణుడి ఎనిమిది భార్యల పేర్లు తెలుసా మీకు..? రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్రాదేవి, నాగ్నజితి, కాళింది, లక్షణ… అవును, ఆయన భార్యల్లో అష్టమ భార్య పేరు లక్షణ… మద్ర దేశాధిపతి పేరు బృహత్‌సేనుడు… తన బిడ్డ లక్షణ… చిన్నప్పటి నుంచీ కృష్ణుడి గుణగణాల్ని నారదుడి నోటి వెంట వినీ వినీ భక్తినీ, ప్రేమను, అనురక్తినీ పెంచుకుంటుంది… ఆ విషయాన్ని ఆ రాజు నారదుడికీ చెబుతాడు…
Ads
అది తప్పకుండా కృష్ణుడి చెవిన పడుతుందనీ, కృష్ణుడు వస్తాడనీ తెలిసి, రావడం కోసమే లక్షణ స్వయంవరం ఏర్పాటు చేస్తాడు… దానికి కర్ణుడు, దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు తదితరులతోపాటు కృష్ణుడు, అర్జునుడు కూడా వెళ్తారు… పైన ఎక్కడో కనిపించకుండా తిరుగుతున్న ఓ చేప, కింద ఓ కుండలో ఉన్న నీటిలో దాని ప్రతిబింబం ఆధారంగా ఉనికి కనిపెట్టి, బాణం విసిరి చేపను కిందకు పడగొట్టాలి… అదీ పరీక్ష…
కర్ణుడు, దుర్యోధనుడు తదితరులు కనీసం అక్కడ పెట్టబడిన వింటినారి బిగించలేరు… ఇంకొందరు రాజులు కూడా ప్రయత్నించి విఫలులవుతారు… అప్పుడు అర్జునుడు వింటినారిని బిగిస్తాడు, చేప ఉనికిని కనిపెడతాడు, బాణం వదులుతాడు… గురి సరైనదే, కానీ బాణంలో వేగం లేదు, శక్తి లేదు, చేపను తాకి కింద పడిపోతుంది… అర్జునుడు తలదించుకుంటాడు…
అప్పుడు కృష్ణుడు వెళ్లి వింటినారి బిగించి, ఒకే ప్రయత్నంలో చేపను బాణంతో పడగొడతాడు… లక్షణ కృష్ణుడి మెడలో వరమాల వేస్తుంది… ఒకసారి కృష్ణుడి అష్టభార్యలనూ చూడటానికి వచ్చిన ద్రౌపదికి లక్షణే ఈ కథంతా చెబుతుంది… మత్స్యయంత్రాన్ని చేధించి తనను గెలిచిన అర్జునుడు ఓ సందర్భంలో మత్స్యయంత్రాన్ని చేధించలేక విఫలుడయ్యాడనే సంగతి అప్పుడే ద్రౌపదికి తెలుస్తుంది…
ఇక్కడ కొన్ని ప్రశ్నలు… తన అనుంగు స్నేహితుడి కోసం ప్రాణం అయినా ఇవ్వడానికి సిద్ధపడే కర్ణుడు దుర్యోధనుడితోపాటు లక్షణతో పరిణయం కోసం ప్రయత్నించడం ఏమిటి..? అన్నింటికీ మించి కృష్ణుడు స్వయంవరానికి లక్షణను గెలుచుకోవడం కోసమే వచ్చాడనీ తెలిసీ అర్జునుడు తను ప్రయత్నించడం ఏమిటి..? తన దైవసమాన స్నేహితుడి కోరిక తెలిసీ, తనెందుకు ఆమె కోసం పోటీలో ఉన్నాడు..?
మరి అది క్షత్రియ ధర్మమని సమర్థించుకునే పక్షంలో ద్రౌపది స్వయంవరం వేళ కృష్ణుడు ఎందుకు పోటీలో లేడు..? దీనిపై పలు ప్రవచనాలు, విశ్లేషణలు, వివరణలూ ఎలా ఉన్నా… మీ పౌరాణిక జ్ఞానాన్ని బట్టి మీరే విశ్లేషించుకొండి… ఒక్కసారి గనుక భారతంలోకి దూకితే అనేకానేక ఉపకథలతో ఇక అంతూదరి దొరకదు…! (దుర్యోధనుడి బిడ్డ పేరు లక్ష్మణ… పొరబడకండి… ఆమె కథ మరింత ఆసక్తికరం… అది వేరు…)
Share this Article