గుణ శేఖర్ అభిరుచి ఉన్న దర్శకుడు కాబట్టి… మణిశర్మ బాణీలు బాగుంటాయి కాబట్టి… ఈ సినిమా ఓ భిన్నమైన ప్రేమ కథ కాబట్టి… ఇప్పటికీ మరుపురాని ఓ చారిత్రిక ఎపిసోడ్ కాబట్టి… రాబోయేది పాన్ ఇండియా యాక్షనేతర, ఫిక్షనేతర, ఫార్ములా మసాలాయేతర సినిమా కాబట్టి… భిన్న గాయకులతో మణిశర్మ పాడిస్తున్నాడు కాబట్టి… దర్శకుడు ఈ కథను హీరోయిన్ సెంట్రిక్‌గా మార్చాడు కాబట్టి… అనేక కాబట్టుల నడుమ శాకుంతలం పాటలపై కాస్త ఆసక్తి…
ఆ పాటల గుణవిశేషాలపై చెప్పుకోవడం… అంతే… ఇప్పటివరకూ మూడు పాటలు రిలీజ్ చేయగా, అన్నీ మెలోడియస్‌గా మణిశర్మ, గుణశేఖర్ టేస్టు కనిపించేలా ఉన్నాయి… మూడో పాట ‘మధుర గతమా’… నాయకుడు పాడే చరణం నాయిక పాడుతూ, ఎవరేం పాడుతున్నారో అంతుపట్టక కొంత గందరగోళం ఉంది కానీ స్థూలంగా పాట మంద్రంగా, ఆర్తిగా, మంచి మెలొడీతో ఆకట్టుకుంది… మధుర గతమా, కాదు, మధురగీతమా అన్నట్టుగా ఉంది…
ఎందుకో గానీ… గుణశేఖర్ సీరియస్‌గా చెప్పినందుకా..? నిర్మాతలు హిందీ మార్కెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలని గుర్తుచేసినందుకా..? సంగీత దర్శకుడు ఆలోచించిన భిన్నమైన పోకడా..? తెలియదు గానీ… ఈ పాటలు హిందీలో రాసుకుని, తెలుగులోకి అనువదించినట్టుగా ఉంటున్నాయి… మామూలుగా ఇతర భాషల్లోని పాటలను తెలుగులోకి అనువదించినప్పుడు… కొన్ని వ్యర్థపదాలు వచ్చి చేరతాయి, ట్యూన్‌లో ఒదగడానికి..! ఈ మధుర గతమా పాటలో కూడా చేజారావే వంచికా… రేడునే మూసెనా… అందమే ఎందునా… వంటివి కాస్త చికాకుగానే ఉన్నాయి… ఈ వంచిక పదం నేనయితే వినలేదు… లోతైన, గంభీర అర్థం ఏమైనా ఉందేమో తెలియదు… వంచిత, వంచకి పదాలు విన్నాం, కాకపోతే అవి ఇక్కడ వర్తించవు…
Ads
అఫ్‌కోర్స్, మౌనంగా కూసే శాకుంతలం… వంటి ఒకటీరెండు లిటరల్ మెరుపులు వినిపించినా సరే… స్థూలంగా కాళిదాసు గ్రంథాన్ని ఈనాడు తెలుగులోకి అనువదించుకుని చదివినట్టుగానే అనిపిస్తుంది శాకుంతలం పాటలు వింటుంటే… మెచ్చుకోదగిన అంశాలేమిటంటే… కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ కొత్తగా వినిపించాయి…. వీనులవిందుగా ఉన్నాయి కూడా… పాటగాడు అర్మాన్ మాలిక్ గొంతు మధురంగా ఉంది… మరీ ఎదురవకా… కలయికలే…. పదాల ఆలాపన వినసొంపుగా ఉంది… ఇక శ్రేయో ఘోషాల్ గొంతులోని మాధుర్యం, శ్రావ్యత గురించి కొత్తగా చెప్పుకునేదేముంది..?
ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి… సంగీతానికి భాషాభేదం లేదంటారు, కానీ పాటకు ఉంటుంది… ఎందుకంటే, ఒక్కో భాషలోని పదాల ఉచ్ఛరణకు ఓ సొగసు ఉంటుంది, వాటిని పట్టుకోవాలి… గాయకులు తమ మాతృభాష కాని ఇతర భాషల్లో పాడేటప్పుడు ఆ పదాల ఉచ్ఛరణ పట్ల జాగ్రత్తగా ఉండాలి… మనం సిధ్ శ్రీరాం గానపైత్యం గురించి ఆల్‌రెడీ చెప్పుకున్నాం… కానీ చిత్ర పాడుతుంటే చిన్న తప్పు వినిపించదు… ట్రాక్ శ్రద్ధగా విని, లేదా ఒకటికిరెండుసార్లు సంగీత దర్శకుడితో ఆయా పదాల అర్థాన్ని, ఉచ్ఛరణను అడిగి తెలుసుకుని, ఆ భావాన్ని తన గానంలో వ్యక్తీకరిస్తుంది ఆమె…
ఈ మధురగతమా పాటలో అర్మాన్ మాలిక్, శ్రేయాఘోషాల్ మనసుపెట్టి పాడారు… కానీ అప్పట్లో ఏదో కృష్ణవంశీ సినిమాపాటలో కావచ్చు, నడకలు నేర్పావూ అని పాడేచోట శ్రేయా తెలుగు ఎంత కృతకంగా ఉందో గుర్తొస్తుంటుంది ఆమె పేరు విన్నప్పుడల్లా… థాంక్ గాడ్, మధురగీతమా పాటలో ఆ పరీక్షలేమీ ఎదురుకాలేదు ఆమెకు… సరళమైన పదాలు కాబట్టి సాఫీగా సాగిపోయింది… మంచి మెలొడీ పాటే, కాకపోతే, కనెక్ట్ కావడానికి ఏదో తెలియని అడ్డంకి… బహుశా పదాల కూర్పులోనే ఏదో ఆర్టిఫిషియాలిటీ, యాంత్రికత ఉండటం వల్ల కావచ్చు…!!
Share this Article