.
ఆర్తి అగర్వాల్: అనతి కాలంలోనే అస్తమించిన ఒక వెండితెర తార! తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆర్తి అగర్వాల్ జీవితం ఎంతో మందికి జీర్ణించుకోలేని ఒక విషాద జ్ఞాపకం.
‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ అందాల తార, అతి తక్కువ కాలంలోనే శిఖరాగ్రానికి చేరుకుని, ఆ తర్వాత అంతే వేగంగా కనుమరుగైపోయారు. ఆమె కెరీర్ , వ్యక్తిగత జీవితంలో జరిగిన మలుపులపై ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Ads
రంగుల తెర మింగేసిన తారల కథలు మనకు తెలుసు… ఎగిసిపడిన కెరటాలు అనూహ్యంగా విరిగిపడ్డ కథలూ తెలుసు… మామూలుగా తారల అమ్మలు వాళ్లతోపాటు ప్రతిచోటకూ వస్తుంటారు, పెత్తనాలు చేస్తుంటారు… కానీ ఆర్తి అగర్వాల్ కథ డిఫరెంటు…
కెరీర్ ఆరంభమే అద్భుతం వెంకటేష్ సరసన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆర్తి, తొలి సినిమాతోనే తన నటనతో, అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోలందరితో నటించి టాప్ హీరోయిన్ రేసులో నిలిచారు. ‘ఇంద్ర’, ‘నేనున్నాను’, ‘అడవి రాముడు’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
కెరీర్ పతనానికి కారణం ఎవరు? ఆర్తి అగర్వాల్ కెరీర్ మసకబారడానికి నిర్మాత చంటి అడ్డాల ఒక కీలక కారణాన్ని విశ్లేషించారు. ఆయన మాట్లాడుతూ… తల్లిదండ్రుల అతి జోక్యం… ఆర్తి తన తల్లిదండ్రులపై వందకు రెండు వందల శాతం ఆధారపడేదని, వారు ఏది చెబితే అది చేసేదని ఆయన తెలిపారు.
తండ్రి నియంత్రణ: షూటింగ్ సెట్స్‌లో ఆర్తి తండ్రి ప్రతి విషయంలోనూ అడ్డుపడేవాడనీ, ఎప్పుడు షూటింగ్ మొదలవ్వాలి, ఎప్పుడు ప్యాకప్ చెప్పాలి అనే విషయాలను కూడా తనే నిర్ణయించేవాడట… తండ్రి పక్కన లేనప్పుడు ఆర్తి చాలా స్వేచ్ఛగా, అద్భుతమైన నటనను ప్రదర్శించేదని, కానీ అతను సెట్‌లో ఉన్నప్పుడు మాత్రం ఆమె తీవ్ర ఒత్తిడికి లోనయ్యేదట… ఈ మితిమీరిన నియంత్రణే ఆమె కెరీర్ దెబ్బతినడానికి ప్రధాన కారణమనేది తన విశ్లేషణ…
వృత్తిపరమైన ఎదురుదెబ్బలే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా ఆర్తి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది… హీరో తరుణ్‌తో ఆమె ప్రేమలో ఉందని అప్పట్లో భారీగా ప్రచారం జరిగింది. (ఇద్దరూ కలిసి ఏదో సినిమా కూడా చేశారు)… ఆ ప్రేమ విఫలమవ్వడం, దాని వల్ల ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందనే వార్తలు అప్పట్లో సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.
ఆ బాధల నుండి బయటపడే క్రమంలో ఉజ్వల్ కుమార్‌ను వివాహం చేసుకున్నప్పటికీ, ఆ బంధం రెండేళ్లకే విడాకులతో ముగిసింది. మళ్ళీ కెరీర్‌లో నిలదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా బరువు తగ్గించుకోవడానికి తీసుకున్న చికిత్స వికటించడంతో, 2015 జూన్ 6న కేవలం 31 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూసింది… దీనిపైనా రకరకాల గాసిప్స్ వినిపించాయి…
ఆర్తి అగర్వాల్ ప్రతిభకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అసాధారణం. ఆమె కెరీర్ ప్రయాణం, నిర్ణయాలు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఆమెను ఏ స్థాయికి తీసుకువెళ్లాయో, ఎంత త్వరగా ముగించాయో చూస్తుంటే ఆమెను అభిమానించిన ప్రేక్షకులకు ఎంతో బాధ… ఒక అందం అర్థంతరంగా తీరానికి చేరి మాయమైంది…!
Share this Article