Bharadwaja Rangavajhala……… కాబట్టి మిత్రులారా … ఇప్పుడు మనం దాట్ల వెంకట నరసరాజు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న ఆయన జయంతి. కె.వి.రెడ్డి విజయా బ్యానర్ లో పాతాళబైరవి తీసిన తర్వాత వాహినీకి పెద్దమనుషులు కమిట్ అయ్యారు. పింగళి విజయాలో రచయితగా జీతానికి చేరడంతో గత్యంతరం లేక చక్రపాణి అనుమతి కోరారు. ఆయన ఇవ్వలేదు.
మీరు రచయితను ఇవ్వకపోతే నేను సినిమా తీయలేనా అని బెజవాడ నుంచి ఓ కొత్త రచయితను తీసుకువచ్చారు. ఆయన పేరు డి.వి.నరసరాజు. ఈ నరసరాజుగారిని కె.వికి తగిలించింది గుడివాడ శరత్ టాకీసు యజమాని కాజ వెంకట్రామయ్య. ఇప్పుడు ఈ థియేటరు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఉందనుకోండి.
ఇప్పుడు విజయవాడలో కలసిపోయిన ముత్యాలంపాడు గ్రామంలో తొలి గ్రాడ్యుయేట్ దాట్ల వెంకట నరసరాజు. మొదటి నుంచి సృజనాత్మక కళల మీదే నరసరాజు దృష్టి. ఉద్యోగాలు చేయాల్సిన లంపటాలు లేకపోవడంతో బాగా ఆస్తి ఉండడంతోనూ బంధువుల దన్ను ఉండడంతోనూ …
Ads
నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించారు.
అంతర్వాణి, నాటకం లాంటి సూపర్ హిట్ నాటకాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అవి చూసే పెద్దమనుషులు చిత్రం కోసం కె.వి పికప్ చేశారు. కె.వి.నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు నరసరాజు. కె.వి.రెడ్డి ఒకానొక సందర్భంలో విజయాధినేతలతో పొసగక బైటకు వచ్చారు. సరిగ్గా అప్పుడే… దుక్కిపాటి మధుసూదనరావుగారు సినిమా చేయమని అడిగారు. అప్పుడు అన్నపూర్ణ కంపెనీకి కె.వి చేసిన సినిమా దొంగరాముడు. ఆ మూవీకీ డి.వి.నరసరాజునే రచయితగా తీసుకున్నారు.
అందులో కూడా డి.వి.మార్క్ డైలాగులు పేల్తాయి. ముఖ్యంగా హీరో జైలు నుంచి విడుదలై హోటల్ కి వెళ్లి పండితుల్ని బురిడీ కొట్టించే సీన్ లో అద్భుతంగా రాశారు. విజయా బ్యానర్ లో కె.వి.రెడ్డి డైరక్ట్ చేసిన చిత్రాలకు మాత్రమే పింగళి నాగేంద్రరావు మాటలు రాసేవారు. మిగిలిన చిత్రాలకు ఎక్కువగా బయట రచయితలే రాసేవారు. అలా గుండమ్మ కథకు డి.వి.నరసరాజుతో సంభాషణలు రాయించుకున్నారు చక్రపాణి.
స్క్రిప్ట్ వర్క్ ఎక్కువగా చక్రపాణే చేసుకునేవారు. స్కేప్ గోట్ అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా నరసరాజు రాసుకున్న స్క్రిప్ట్ చాలా కాలం ఏ నిర్మాతా తీసుకోలేదు. బెజవాడ లక్ష్మీ టాకీసు ఓనరు మిద్దే జగన్నాథం లాంటి వారైతే.. అది సక్సస్ కాదని నిరాశపరిచారు కూడా. అయితే విచిత్రంగా రామానాయుడు సురేష్ మూవీస్ ప్రారంభిస్తూ కథ కోసం నరసరాజును అప్రోచ్ అయ్యారు. అదీ నాగిరెడ్డి గారి అడ్వాయిజ్ తో…
నరసరాజు తన దగ్గరున్న డబుల్ యాక్షన్ కథ చెప్పారు. నాయుడుగారు ఓకే అన్నారు. అలా రూపొందిన రాముడు భీముడు సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మాస్ సినిమాకు ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. విజయావాహినీ కాంపౌండ్ రైటర్ కావడంతో నరసరాజుగారితో ఎన్టీఆర్ కు ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన సాంఘిక చిత్రాలకు ఎక్కువగా నరసరాజుకే స్క్రిప్ట్ బాధ్యతలు అప్పగించేవారు ఎన్టీఆర్. అలా రూపుదిద్దుకున్న చిత్రాల్లో కోడలు దిద్దిన కాపురం ఒకటి.
నరసరాజుగారు చాలా ఖచ్చితమైన మనిషి. స్క్రిప్ట్ చెప్పిన సమయానికి ఇచ్చేసేవారు. ఆత్రేయలా ఇబ్బందులు పెట్టేవారు కాదు. ఆత్రేయకు అడ్వాన్స్ ఇచ్చి ఆయన రాయకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న చాలా మంది నిర్మాతలకు నరసరాజు అభయం ఇచ్చి పని పూర్తి చేసేవారు. అలాంటి సినిమాల్లో బడిపంతులు ఒకటి. బడిపంతులు డైలాగ్స్ కోసం డబ్బులు తీసుకున్న ఆత్రేయ రాయలేదు. ఫైనల్ గా నరసరాజుగారే కంప్లీట్ చేయాల్సి వచ్చింది.
డైలాగులు రాయకపోయినా ఆ మొత్తానికి నీ నగుమోము అనే ఓ అజరామర గీతాన్ని రాసి ఇచ్చారు ఆత్రేయ. ఎవిఎమ్ చెట్టియార్ కు కూడా నరసరాజుగారి మీద విపరీతమైన నమ్మకం ఉండేది. భక్త ప్రహ్లాద సినిమా కోసం చిత్రపునారాయణమూర్తి ఎమిఎమ్ అధినేతను అప్రోచ్ అయ్యారు.
నరసరాజు స్క్రిప్ట్ రాస్తానంటే తీస్తాను అని చెట్టియార్ షరతు పెట్టారు.
చిత్రపు నారాయణమూర్తి అప్పుడు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. ఆయన పరిస్థితి చూసి సాధారణంగా పౌరాణికాలు పెద్దగా అంగీకరించని నరసరాజుగారు భక్త ప్రహ్లాదకు పనిచేశారు. ఎస్వీ రంగారావు కూడా డి.వి గారి మాటే వినేవాడు. చిత్రపు నారాయణమూర్తి ఫ్లాపుల్లో ఉండడం వల్ల ఆయన మాట లెక్కచేసేవారు కాదు ఎస్వీఆర్. క్లైమాక్స్ సీన్ సరిగా రాకపోయేసరికి ఎస్వీఆర్ ను మరో సారి సెట్స్ కు రమ్మనడానికి ధైర్యం చాలలేదు. అందుకని డి.వినే ఆశ్రయించారు.
నరసరాజు అనుకోకుండా అన్నట్టు ఎస్వీఆర్ ను కలసి ఆ క్లైమాక్స్ ఏమిటండీ అలా ఉందీ … నిన్న చూపించారు. మీరు బాగా డల్ గా ఉన్నట్టు అనిపించింది. నాకెందుకులే అని ఊరుకున్నా … మీరడిగితే రీషూట్ పెడతారు అన్జెప్పి వచ్చేశారు. పని అయిపోయింది. అంత లౌక్యంగా వ్యవహరించేవారు డి.వి.
ఒక రచయితను అంగీకరించాలంటే చాలా ఆలోచించే బి.ఎన్.రెడ్డికి కూడా డి.వి.నరసరాజు అంటే ఇష్టం. బి.ఎన్ కు ప్రయోగాల మీద పెద్దగా మోజు ఉండేది కాదు. అందుకే పింగళి నాగేంద్రరావు గారి రచన నచ్చేది కాదు. పింగళి గుణసుందరి కథకు రాసిన డైలాగులు బిఎన్ కు అస్సలు నచ్చలేదట. అయితే నరసరాజు మాత్రం బిఎన్ కు రంగులరాట్నం, రాజమకుటం లాంటి సినిమాలకు పనిచేశారు.
యమలోకపు గందరగోళంతో కూడిన బెంగాలీ సినిమా జీవాంతమానుష రీమేక్ హక్కులు కొన్నారు పల్లవీ ప్రొడక్షన్స్ వెంకటరత్నం. నేరుగా తనకు సాన్నిహిత్యం ఉన్న ముళ్లపూడి దగ్గరకెళ్లి తెలుగులో రాయమన్నారు. అయ్యా, అది పొలిటికల్ సెటైరికల్ డ్రామా… మనవల్ల కాదు… డి.వి.నరసరాజే దీనికి సమర్ధుడు అని చెప్పి రమణగారే పంపారు. కథ నరసరాజు చేతిలో పడడంతో హీరో కూడా మారాడు. శోభన్ ప్లేస్ లో ఎన్టీఆర్ వచ్చారు. యమగోల చేసి జనంతో ఈలలు కొట్టించుకున్నారు.
ఇక్కడ ఇంకో పిట్టకథ. నిజానికి వెంకటరత్నం ఎన్టీఆర్ దగ్గరకు పోయి ఇప్పుడు సినిమాలో ఉన్న ఎన్టీఆర్ కారక్టర్ ను బాలకృష్ణతోనూ యముడు కారక్టర్ ఎన్టీఆర్ తోనూ చేయించాలని తనకు ఉన్నట్టు చెప్పారు. అయితే ఎన్టీఆర్ దీనికి ఒప్పుకోలేదు. ఆ కారక్టర్ కు బాలయ్య సరిపోడు. అది నేనే చేస్తాను. యముడుగా సత్యనారాయణను తీసుకుందాం అని సలహా చెప్పారు. అలా సత్యనారాయణను యముడుగా ప్రమోట్ చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది.
యమగోలలో చాలా పొలిటికల్ డైలాగులు పేల్చారు నరసరాజు. అప్పట్లో ఏదన్నా సినిమాలో డైలాగులు హిట్టైతే చాలు వాటిని ఎల్పీ రికార్డులుగా విడుదల చేసేవారు. ముఖ్యంగా యమర్జన్సీ మీద కాంగ్రెస్ పార్టీ మీద చాలా సెటైర్లు పేల్చారు నరసరాజు. తెర మీద చెప్పేది ఎన్టీఆర్ కావడంతో ఆ డైలాగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
నాటకం అనే నాటకంతో రంగస్థలం మీద సంచలనం సృష్టించిన డి.వి.నరసరాజు తెర మీద కూడా రెండు సినిమాల్లో నటించారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. నరసరాజుగారికి ఈనాడు రామోజీరావుతో బాగా సాన్నిహిత్యం ఉండేది. ఓసారి రామోజీరావు మీకేమండీ ఎప్పుడూ తెల్లని మడత నలగని పంచె కట్టుకుని హాయిగా ఉంటారు … మా టెన్షన్లు ఏం చెప్పమంటారు అన్నాడట.
అయ్యా మీరేమో మోసే గాడిదలు … మేం మేసే గాడిదలం అదీ తేడా అనేశార్ట నరసరాజు. రామోజీరావు కూడా సినిమాలకు సంబంధించి ఏవన్నా అనుమానాలుంటే నరసరాజు సలహా తీసుకునేవాడు.
కారు దిద్దిన కాపురం సినిమా సరిగా రావడం లేదని నరసరాజుకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయన సినిమాను విజయతీరాలకు నడిపించారు. సినిమా పరిశ్రమలో నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎవరైనా ఉంటే అది నిస్సందేహంగా నరసరాజుగారే. ఆయన ఎన్ని సినిమాలకు రాసినా నరసరాజు అనగానే గుర్తొచ్చే సినిమా మాత్రం యమగోలే. కనుక ఆ క్లిప్పే దీనికి తగిలిస్తున్నా.. చూసి ఎంజాయ్ చేయండి. https://youtu.be/rQPXl_E20jU
Share this Article