వారాల వ్యాసాలబ్బాయిలు! ……. by పమిడికాల్వ మధుసూదన్
————————
కవిత్వమొచ్చినా, కక్కొచ్చినా ఆగదు. ఆగకూడదు. ఆపి ప్రయోజనం లేదు. ఆపితే అనర్థం కూడా. ఈ లిస్టులో కల్యాణం కూడా ఉంది. కల్యాణం తరువాత క ప్రాసలో కక్కు బాగున్నా, కల్యాణం పవిత్రతను కక్కు దెబ్బతీస్తోంది. లోకం అంగీకరించిన సామెతలను వాడుకోవాలేగానీ- వాటిని రిపేర్ చేయకూడదు.
Ads
కవిత్వం అన్నది స్థూలార్థం. అందులో రచన సూక్ష్మార్థం. “వాక్యం రసాత్మకం కావ్యం” అని గొప్ప ప్రమాణం ప్రకారం ఒకే ఒక మంచి వాక్యం కూడా ఒక మహాకావ్యంతో సమానం. అందుకే కొందరు తామురాసిన లక్షల వాక్యాలు లక్షల, కోట్ల కావ్యాలతో సమానం అని అనుకుంటూ ఉంటారు. అది వారి హక్కు. కాదనే హక్కు మనకు లేదు.
ఈమధ్య హిందీ, ఇంగ్లీషు, తెలుగు దినపత్రికల ఎడిట్ పేజీల్లో వారాలబ్బాయిల షెడ్యూల్ ప్రకారం సంపాదకీయ వ్యాసాలు అచ్చవుతున్నాయి. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారితో మొదలుపెట్టి, పార్టీ ఆఫీసుల్లో పనిచేసిన అటెండెంట్లదాకా అందరూ సంపాదకీయ వ్యాసాలు రాయగలుగుతున్నారు. ఫలానావారే వ్యాసాలు రాయాలని వ్యాసమహర్షి నియమాలేమీ పెట్టలేదు. పత్రిక యజమాని, సంపాదకుడు, రాసేవారి ఇష్టమే ప్రధానం తప్ప- ఇందులో పాఠకుడికి ఎలాంటి ఎంపిక స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు ఉండవు.
కొందరికి ఘోస్ట్ రైటర్లు రాసిపెడతారు; కొందరికి పత్రికలే రాసి పెడతాయి; కొందరు రాసింది అర్థంకాక పత్రికలు తిరగరాయిస్తాయి- అని లోకంలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి కానీ- ఇది అసూయవల్ల ఏర్పడిన అభిప్రాయంగానే భావించాలి.
కవిత్వమొచ్చినా, కక్కొచ్చినా…అన్న సామెత వల్ల ఇలా రాసి రంపాన పెడుతున్నారు తప్ప, అది వారి తప్పు కాదు. అయితే- వారాలబ్బాయిల వల్ల అసలు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లకు స్పేస్ లేకుండా పోయింది అని కొందరి వాదన. ఈ వాదన తర్కానికి నిలబడదు. సర్వజ్ఞసింగ సర్వశాత్ర భూపాలురుగా రూపాంతరం చెందిన వీరి సర్వజ్ఞత ముందు ఒకానొక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పరిజ్ఞానం దూదిపింజలా తేలిపోతుంది. ఒక మండలం కంట్రిబ్యూటర్ పద్నాలుగు భువనభాండాల్లోని విషయాలను తడుముకోకుండా రాయగలుగుతున్నప్పుడు గల్లీనుండి ఢిల్లీదాకా ఎన్నో విషయాలు తెలిసిన వీరు రాయడంలో ఎలాంటి అనౌచిత్యం ఉండదు.
ఊపిరి సలపని రాచకార్యాల్లో ఉంటూ ఇలా వారం వారం ఏళ్లతరబడి ఎలా రాయగలుగుతున్నారు అని జుట్లు పీక్కోవడంవల్ల మన జుట్టే పోతుంది కానీ- వారి జుట్టుకు వచ్చిన నష్టమేమీ లేదు. సరిగ్గా కర్త కర్మ క్రియ అన్వయంతో కూడిన నాలుగు అర్థవంతమయిన వాక్యాలు రాయడానికే గంట పడుతుంది. అలాంటిది రెండు, మూడు భాషల్లో వీరు సృష్టిస్తున్న వ్యాసరచన చిన్నవిషయం కాదు. ఇందులో సాహితీ విలువలు, సామాజిక పరివర్తన మీద లోతయిన దృక్కోణం, అజ్ఞాన తిమిరంలో కన్నుపొడుచుకున్నా కానరాని పాఠకుల గుడ్డికళ్ల ముందు కోటి అక్షరకాంతులు వెలిగిస్తున్న జ్ఞానభిక్ష కోణం…ఇలా ఎన్నో నిబిడీకృతమై ఉన్నాయి.
విషయపరంగా అన్నీ ఆవు వ్యాసాలే అన్నది మరొక పెదవి విరుపు. ఈ పెదవి విరుపు కూడా తర్కానికి నిలబడదు. ఆవు మనకు పవిత్రం. ఆవును పూజిస్తే ఎలా పుణ్యమొస్తుందో- ఈ ఆవు వ్యాసాలను చదివినా; చివరకు ఓరకంట చూసినా మనకు పుణ్యమొస్తుంది. పరమ పాఠక పాపులమయిన మనల్ను పునీతులను చేయాలన్న మహదాశయంతోనే పత్రికలు ఆస్థాన రాజకీయ వారాలబ్బాయిల గోవ్యాసరాజాలను మనకు అందిస్తున్నాయి.
ఆవు వ్యాసం…ఆవు వ్యాసం అని అరచి గీ పెట్టి తమను అవమానిస్తున్నారని ఈమధ్య దేశీ, విదేశీ, జెర్సీ, గంగి, కపిల, గిర్, పుంగనూరు ఆవులన్నీ తీవ్ర నిరసన, ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదో పత్రికలో వారి బంధువుల కంపెనీ వ్యాక్సిన్ వార్తలు ఆవు వ్యాసాలకంటే ఎక్కువగా వస్తున్నాయట. దాంతో ఇకపై “ఆవు వ్యాసం” ఎత్తిపొడుపును వాడితే ఒప్పుకోము అని ఆవులు భీష్మించుకుని కూర్చున్నాయట. వీధి కుక్కలు మూగగా, జాలిగా మొరిగితేనే అక్కినేని అమల వచ్చి వాలి వాటి బాగోగులు చూసేది. ఇకపై “ఆవు వ్యాసం” స్థానంలో ఎల్లలు లేకుండా అన్ని పేజీల్లో ఎల్లెడలా వ్యాపించిన “వ్యాక్సిన్ వ్యాసం” అని అనాలన్న ఆవుల డిమాండును అక్కినేని అమల వెంటనే పరిష్కరించాలి.
గోవ్యాస ముత్యాలు- వ్యాక్సిన్ వ్యాసరాజాలు నిజానికి కలవవు. కానీ విధి బలీయమయినది. ప్రకృతి విపత్తులు చెప్పి జరగవు. పాఠకుల పురాకృత పుణ్యవిశేష పాకం గట్టిపడినప్పుడు చెప్పి కూడా జరుగుతాయి. ఇప్పుడు ఈ అపూర్వ సమ్మేళనానికి
“గోవ్యాక్స్ వ్యాసాలు” అని పేరు పెట్టాలన్న పాఠకుల డిమాండులో సహేతుకతను ఎవరూ కాదనడానికి వీల్లేదు.
“ఏది చీకటి? ఏది వెలుతురు?
ఏది జీవితమేది మృత్యువు?
ఏది పుణ్యం? ఏది పాపం?
ఏది నరకం? ఏది నాకం?
ఏది సత్యం? ఏదసత్యం?
ఏదనిత్యం? ఏది నిత్యం?
ఏది ఏకం? ఏదనేకం?
ఏది కారణమేది కార్యం?
ఏది తెలుపు? ఏది నలుపు?
ఏది గానం? ఏది మౌనం?
ఏది నాది? ఏది నీది?
ఏది నీతి? ఏది నేతి?” అని ఎవరినడగాలో తెలియక శ్రీ శ్రీ ప్రశ్నల పరంపరను మహాత్ముడి ముందు ఉంచాడు. ఈ వారాల వ్యాసాలబ్బాయిలు అప్పుడు ఉండి ఉంటే- శ్రీ శ్రీ కి ఈ సందేహాలే వచ్చేవి కాదు. వచ్చినా అన్ని ప్రశ్నలకు వీరి వ్యాసాల్లో ఆవులు సమాధానమిచ్చి ఉండేవి!……
Share this Article