Artificial Auction: ఈమధ్య ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ కోకాపేట ఎకరా వందకోట్ల రూపాయలు పాట పాడుకుంది. ఆ భూమి తనకు తానుగా ఆ విలువ కట్టుకుని…మార్కెట్ వేలం సాహిత్యానికి ఆ రాగం రేటు స్వరాలు కట్టుకోలేదు. రియల్ఎస్టేట్ రారాజ నిలయ సంగీత విద్వాంసులు కృత్రిమంగా అలాంటి స్వరాలు కట్టి పాటలు పాడుకున్నారని…తరువాత శంకరపల్లి వేలం పాటల్లో పాడిన వంకరాభరణ రాగాల వల్ల తేలిపోయింది.
భారతదేశంలో బాంబే, ఢిల్లీతో పాటు ఎక్కడా లేనంత ఎక్కువ ధరకు భూములు అమ్ముడు పోతున్నాయని భ్రమ కలిగించడంలో సక్సస్ అయ్యామని రియల్ ఎస్టేట్ మాఫియా చేసుకుంటున్న విజయోత్సవాలు పూర్తికాకముందే…ఇదంతా హైప్ అని…ఒట్టి డొల్ల అని...ఒక పథకం ప్రకారం కొందరు ఒకటి లేదా రెండెకరాల రేటును అమాంతం పెంచి…ఆ రేట్లనే హైదరాబాద్ చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల వరకు స్థిరపరచిన…స్థిరాస్తి వ్యాపారుల రియల్ ఎత్తుగడ అని మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
Ads
ఆ కథనాల సాంకేతిక, ఆర్థిక అంశాల లోతుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. సులభంగా అర్థం కావడానికి అందులోనుండి ఒకటి రెండు విషయాలను పట్టుకుంటే చాలు.
కోకాపేట ఎకరా వంద కోట్ల లోకోత్తర వేలం పాట ఆస్కార్ అవార్డు తరువాత…శంకరపల్లి భూముల వేలం పాటల అంతర్జాతీయ అవార్డుల ప్రదానం జరిగింది. అంతదాకా గజం ముప్పయ్ వేల రూపాయల ధర ఉన్నది…ఈ ఈ-వేలం గాలిపాటల్లో లక్ష రూపాయలతో పల్లవి మొదలయ్యింది. రెండు చరణాలు పూర్తయ్యేసరికి శ్రోతల కాలికింద భూమి కదిలిపోయింది.
గజం లక్ష అంటే ఎకరా దాదాపు యాభై కోట్లు. మొన్నటిదాకా ఎకరా పదిహేను కోట్లు. వంద ప్లాట్లకు వేలం పాటలో పాల్గొని రేట్లు నాలుగయిదంతలు పెంచిన రియల్ఎస్టేట్ విలయవిద్వాంసులు తరువాత అడ్రస్ లేకుండా పోయారు. వేలం పాటలో పాల్గొనడానికి కట్టిన కనీస రుసుమే లక్షల్లో ఉంది. నిర్ణీత గడువులోగా అత్యంత ఎక్కువ ధర పాడినవారు వచ్చి…ఆ సొమ్ము చెల్లించకుంటే…ముందు కట్టిన ఆ రుసుము వెనక్కు రాదు. అలా నూటికి 95 మంది వదులుకున్న సొమ్మే హైదరాబాద్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ- హెచ్ఎండిఏకు కోట్లకు కోట్లు మిగిలిపోయింది.
దీనితో అరటిపండు ఒలిచిపెట్టినట్లు కోకాపేట వంద కోట్ల వెనుక ఉన్న కథ అందరికీ అర్థమయింది. వందల ఎకరాలు ఉన్నవారు ఒక ఎకరాను ఈ వేలంవెర్రి జూదంలో ఎర వేస్తారు. చుట్టూ మిగతా భూములకు ఆకాశం అంచులు తాకిన ధరనే నిర్ణయిస్తారు. కోకాపేటలో ఇళ్లు కొనాలనుకుని వెళ్లేవాడు పగలే చుక్కలు కనిపించి కళ్లు తిరిగి పడిపోతూ ఉంటాడు. అర ఎకరమో, పావు ఎకరమో ఉన్నవాడు ఈ క్యాలిక్యులెటర్లో సున్నాలు పట్టని వందల కోట్ల పగటి కలలు కంటూ…అమ్ముకోలేక పట్టపగలే చీకట్లలో పడి ఉంటాడు.
ప్రపంచ నగరానికి ఈ వందకోట్ల పాటే సిగ్నేచర్ ట్యూన్ అని అధికార పక్షం అంటుంది. అధికార పక్షం గూట్లో మనిషి పాడిన వందకోట్ల పాటలో అపస్వరాల రియల్ ఎస్టేట్ గతితప్పిన గమకాలను ప్రతిపక్షం ఎత్తిచూపుతుంది. ఈ మాఫియా లక్షల కోట్ల భూవ్యాపారాలు ఎలా చేస్తోందో మీడియా వైనవైనాలుగా చెబుతూ ఉంటుంది. సామాన్యుడు కొనలేని, చేరుకోలేని, కనీసం కలగనలేని వందో అంతస్తు ఆకాశహర్మ్యం హై రైజ్ బాల్కనీలో మరో కోకాపేట వేలం పాటల సంగీత కచేరీకి ముహూర్తం నిర్ణయమవుతూ ఉంటుంది.
ఏ దేశంలో అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలాగే ఉంటుందనడానికి తాజాగా చైనాలో ప్రపంచ ప్రఖ్యాత రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు – ఎవర్ గ్రాండే, కంట్రీ గార్డెన్ ల ఉత్థాన పతనాల గురించి అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే అర్ధమవుతుంది. చైనాలో ఈ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశాయి. ఈ కంపెనీలకు దశాబ్దాల మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే ఇంత పెద్ద కంపెనీలు కూలిపోవడానికి కారణమేమిటని ఆరా తీస్తే మన కోకాపేట లాంటి కథలే బైటపడ్డాయి.
అవసరం ఉన్నా లేకపోయినా అత్యధిక ధరలకు భూములు కొనడం, వాటికి లాభాలు కలుపుకొని అత్యంత విలాసవంతమైన నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టడం మొదట్లో బాగానే ఉన్నా కోవిడ్ తరువాత ఈ గాలి బుడగ పగిలిపోయింది. బ్యాంకులు ప్రాజెక్టుల పురోగతిని చూసి రుణాలివ్వడం మొదలు పెట్టేసరికి కొనుగోలుదారుల్లో ఇదివరకటి ఉత్సాహం లేదు. చైనా రియల్ ఎస్టేట్ కంపెనీల అత్యాశ ఎంతగా ఉందంటే వంద కోట్ల పెట్టుబడికి వెయ్యి కోట్ల లాభం రావాలని గాలిలో మేడలు కట్టారు. అవన్నీ పేకమేడల్లా కూలిపోయాయి.
కొన్ని వందల రియల్ ఎస్టేట్ కంపెనీలు చైనాలో దివాళా తీస్తున్నాయి. భారత్ లో కూడా రియల్ ఎస్టేట్ గాలి బుడగ ఏదో ఒకనాడు ఇలాగే పేలిపోక తప్పదని ఈ రంగాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డిలో మెల్లలా చైనా కంటే భారత్ బ్యాంకింగ్ రంగం పటిష్టంగా ఉండడం కొంతలో కొంత నయం. ఇదొక- అంతులేని రియల్ వేలం వెర్రి!….. – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article