Taadi Prakash… అబూ శిఖరం అంచుల్లో …. Artist Mohan on Alltime Great Abu Abraham
………………………
శనివారం సాయంత్రంలో విశేషమేముంటుంది గనక!సవాలక్ష సాయంత్రాల్లో అదో బోరు సాయంత్రం.కానీ ఆఫీసు టేబుల్ మీది చెత్త మధ్య ఒక చిన్న మెసేజ్. “అబూ అబ్రహాం మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు.” గుండె ఆగిందో తెలీదు. కొట్టుకుందో తెలీదు.
Ads
హడావుడిగా ఫోన్ చేస్తే అవతలి నుంచొక గంభీరమైన గొంతు,యెహోవా మబ్బుల్లోంచి మాట్లాడినట్టుగా,గంటలో రమ్మన్నారాయన.
వట్టి చేతుల్తో వెళ్ళేదేలా? త్వరత్వరగా ఓ స్కెచ్, అబూ బ్రష్ స్ట్రోక్ ను మిమిక్ చేస్తూ ఇంక్ గీతలు.
ఆయన లండన్ అబ్జర్వర్ లో,మాంచెస్టర్ పత్రికల్లో,పంచ్ మాగజైన్ లో పదేళ్ళకు పైగా పని చేశాడు. అమెరికాలో చాలాకాలం ఉండి అక్కడి పత్రికలకు బొమ్మలు గీశాడు. ఆయన ఒక్కడే తయారు చేసిన కార్టూన్ ఫిలింకి బి.బి.సి. బెస్ట్ కార్టూన్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ బహుమతి వచ్చింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఆయన బంగ్లాదేశ్ యుద్ధకాలంలో,జనతా పరిపాలనలో వేసిన రోరింగ్ హిట్స్ ఉన్నాయి. పైన చెప్పిన రికార్డు అంతర్జాతీయ స్థాయి కార్టూనిస్టుకెవరికైనా ఉండొచ్చు. కానీ అబూని చూసి జడుసుకోవలసిన విషయం ఆయన అపారంగా చదువుకున్నాడు.
ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాడు.
ఎంతో చూశాడు. పికాసో ఓసారి అన్నాడట – “బొమ్మలు గీయడం నేర్చుకోడానికి నాకు పదేళ్లు పట్టింది. వచ్చింది వదిలించుకోవడానికి ముప్ఫై ఏళ్లు పట్టింది.” అబూ అదేపని చేశాడు. రేఖల్లో గట్టి పనితనాన్నీ, వేగాన్ని, బలాన్ని చూపించే దశ నుండి ఎదిగాడు. చంటి పిల్లలు పలకమీద రాసే పిచ్చి గీతల అందాలు అందుకునే స్థాయికి పరిణతి చెందాడు. అలాంటి జ్ఞానం దగ్గరకి ….అలాటి గీత దగ్గరకి వెళ్ళాలంటే భయపడటం కాదు,ఠారుకు చావాలి.
క్లాసు ఇన్‌స్పెక్షన్ జరుగుతుందంటే పిల్లలంతా పట్టీల చెడ్డీలు వేసేసుకుని, పౌడర్ రాసేసుకునీ,
బొట్టు పెట్టేసుకునీ వెళ్తారు గదా!
నేనూ అలాగే పోతే బావుండేది. టైమ్‌లేదు. వారంరోజుల బవిరి గడ్డం, జుట్టంతా నోట్లో పడుతూ జిడ్డోడుతూ, గుండీలు లేని, చిరుగులు గల చొక్కాతో పరుగు పరుగున బయల్దేరా. నా పక్కనే మరో కుర్ర ఆర్టిస్టు, (వీడెవడు శాంకోపాంజా? గెటౌట్! అంటే ఏం చేయాలి? ఏమో!)
జూబిలీ హిల్స్ లో ఖరీదైన బంగళా.
హలో మోహన్ అంటూ పాతికేళ్ళ పరిచయం ఉన్నంత ఆప్యాయంగా పిలిచి కూచోమన్నాడు.
నేల అంతా తివాసీలు, సోఫాల్లో కుషన్‌లు,బాలీసులు,గోడలకి పెయింటింగ్‌లు,
ఓ మూల పుస్తకాల రాక్, దానిమీద శిల్పాలు,
గది నిండా పల్చని నీలి వెలుతురూ,మధ్యలో గొడ్డకాడ బుడ్డోళ్ళ లాగా మేము. నీలి లాల్చీ,
తెల్లని పైజామాలో మెల్లగా అతి సాదా సీదా మేరుపర్వతంలాగా వచ్చాడాయన.
అజంతా, ఎల్లోరా గుహల దగ్గర స్కెచింగ్ కి వచ్చానని చెప్పాడు. మర్నాడు పొద్దుటే ఢిల్లీ వెళ్లిపోతున్నాడు. పత్రికలూ, జర్నలిస్టుల రాతకోతల మీద, కార్టూనిస్టుల గీతల మీద కబుర్లు. వాంట్ టు హేవ్ ఎ డ్రింక్ అంటూ లికర్ కేబినెట్ తెరిచాడాయన. జిగేల్ మనే కళ్ళనిండా కక్కుర్తితో అటు చూశాం.
“ఐ లైక్ యువర్ ఎన్..టి.ఆర్. లావుగా, బుజ్జిగా ఉండే సన్యాసిని గీస్తావు. నీ వర్క్ బావుంటుంది”అన్నాడాయన.
కానీ ప్రతి రోజూ అలా రియలిస్టిక్‌గా గీయటం చాలా విసుగనిపిస్తుందని చెప్పా. ఏనాడో రెండో ప్రపంచ్ యుద్ధ కాలంలో డేవిడ్‌లో గీసినట్టూ, ఆయన లాగా నేటికీ గీసే వాళ్లని చూసి మళ్లీ గీయటం చాలా సికెనింగ్‌గా ఉందనీ చెప్పాను.
“కానీ నీ బొమ్మల్లో క్రాస్ హేచింగ్ పాత వాసనలేమీ ఉండవు. నీ గీత ఫలానా పెద్ద ఆర్టిస్టు పేరు (ఆ పెద్ద ఆర్టిస్టు పేరు చెప్పాలంటే నాకు సిగ్గు బాబూ) కంటే బావుంటుంది,” అన్నాడాయన.(అమాంతంగా మూడు రెట్లు లావయ్యాను)
మా తెలుగు పత్రికల కార్టూనిస్టులకు చాలా పరిమితులున్నాయి. ప్రపంచం మునిగిపోయే ఘోరమైన సమస్యలు ఉన్నాసరే మేం ఎన్టీఆర్ మేకప్‌లో మార్పుల మీదే కార్టూన్లు వేస్తుంటాం. నేలబారు ఐడియాలూ, చౌకబారు హాస్యం ఉంటుంది.
అబూ చెప్పాడు. కార్టూనింగ్ అనేది చాలా వ్యక్తిగతమైంది. నీ సొంత అభిప్రాయం చెప్పడానికే నువ్వు కార్టూన్ గీయాలి. అలా సాధ్యంకాని పరిస్థితి ఉంటే కార్టూనింగ్ మానెయ్యాలి. వేరే పని చేసుకోవాలి. కుండ బద్దలు కొట్టాడు.
నువ్వు రచయితవా అని అడిగాడు. కథలూ కాకరకాయలూ కాదు గానీ పుస్తకాలు అనువాదం చేశా.వ్యాసాలు రాస్తాను అని చెప్పా. ఈ మధ్యే చిత్తప్రసాద్ గురించి ఉదయంలో రాశా. చూసే ఉంటారన్నాను. తల ఊపాడు. యుద్ధకాలంలో చిత్తప్రసాద్ చిత్రాల గురించి చెప్పాడు. చాలా శక్తివంతమైనవన్నాడు.
మీకు బొమ్మలు గీయటం సరిగా రాదని చాలా మంది అనుకుంటారు తెల్సా? అన్నాను. పక్కలో బాంబుపడినట్టు అదిరి పోలేదాయన.
నవ్వాడు రుషిలాగా.
ఉదయంలో కొత్తలో మీ కార్టూన్లు వస్తున్నపుడు
మరీ టెన్త్ క్లాస్, ఇంటర్ కుర్రవాళ్ళతో బొమ్మలు వేయించడేమిటి? ఉదయంలో నువ్వుండి కూడా మంచి ఆర్టిస్టులతో కార్టూన్ గీయించవేం అని కొందరు మిత్రులు అడిగారని చెప్పాను. నిజమే అన్నాడాయన. ఒకసారి మలయాళ మనోరమ కార్టూనిస్టు కూడా ఇదే ప్రశ్న వేశాడట. డ్రాయింగ్ మీద కాస్త శ్రద్ధ తీసుకోవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. నేను స్కెచింగ్, డ్రాయింగ్ కు చాలా ప్రాధాన్యత ఇస్తా. చాలాకాలం శ్రమ తర్వాత నా స్టైల్ రూపుదిద్దుకుంది అన్నాడు.
నా పక్కనున్న కుర్ర ఆర్టిస్టు ప్రారంభించాడు.
“మీ డ్రాయింగ్ లో భారతీయత కనిపించింది.
కేరళ జానపద చిత్రాల్లో మీ కళకు వేళ్ళున్నాయనుకుంటా -నిజమేనా?”
“అవున”అన్నాడాయన. పారిస్ లో నా మిత్రులు ‘యు ఆర్ టూ బ్రిటిష్’అంటారు. లండన్ లోని ఆర్టిస్టులు నా బొమ్మలు తూర్పు యూరప్ తరహాలో ఉన్నాయంటారు. నేను చెప్పేదల్లా నా బొమ్మల్లో భారత్ ఉంటుంది. కేరళ ఉంటుంది. సముద్రపు ఒడ్డున పుట్టి పెరిగిన వారికి ఇప్పటికీ చేపలూ,రొయ్యలూ తినడం మక్కువ అని ఆయన చెప్పుకుపోతుండగా కాలింగ్ బెల్ మోగింది.
ఆయన బ్రిటిష్ భార్య,మరో అందమైన అమ్మాయి లోనికి వచ్చారు. వాళ్ళు అతి ఫాషనబుల్ గా ఉన్నారు. మమ్మల్ని పరిచయం చేశాడు. అంతకుముందే వాళ్ళు బయట మబ్బుల మీద షికారు చేసిన గంధర్వ కాంతల్లాగా ఉన్నారు. మేము మా మురికి గోనె సంచుల మొహాల్తో విష్ చేశాము. దిసీజ్ మొయినాసింగ్. షి డ్రాస్ ఇన్ సండే అబ్జర్వర్ అని ఆ అమ్మాయి గురించి చెప్పాడు. మీ కార్టూన్లు చూపిస్తారా అని అడిగాను. సర్టెన్లీ అంటూ లేచి రోజ్ వుడ్ లాగా మెరుస్తున్న పైప్ చివర మహారాజా సైజ్ సిగరెట్ పెట్టి గట్టిగా దమ్ము లాగింది.
అప్పుడే అప్పు చేసి కొనుక్కున్న పొట్టి సిగరెట్లని మేమూ జేబుల్లోంచి తీసాము. అబూ మరోసారి గ్లాసులు నింపి ఐస్ తెచ్చారు.
మొయినాసింగ్ బొమ్మలు దుర్భరంగా ఉన్నాయి. “రాపిడో గ్రాఫ్ తో మీరు బొమ్మలు వేయొద్దు.
బ్రష్ లేదా క్రోక్విల్ వాడండి.
లేకపోతే ఇంచక్కా మామూలు పెన్ లో ఇంక్ పోసి బొమ్మలెయ్యండి”అని సలహా ఇచ్చా.
అబూతో మళ్ళీ కబుర్లు. “ఇది అక్టోబర్ నెల. చేగువేరాని బొలీవియా అడవుల్లో సి.ఐ.ఏ. వాళ్ళు హత్య చేసి ఇప్పటికీ 20 ఏళ్ళయింది. చేగువేరా గురించి మీ కాలమ్ లో రాయొచ్చు గదా”అన్నాను. “అవును. చేగువేరా,ఫైడల్ కాస్ట్రో తో హవానాలో నేను చాలా సేపు గడిపాను. అప్పుడు నేను ఆటోగ్రాఫ్ అడిగాను.సంతకం పెట్టేందుకు పుస్తకం లేదెలా? అన్నాడు. నాచొక్కా చూపించా.
జేబు మీదే ఆటోగ్రాఫ్ ఇచ్చాడు” అని చెప్పాడాయన. తర్వాత ఫైడల్ కాస్ట్రోతో కలిసి పెద్ద కాబరే డాన్స్ చూశాం. ప్రోగ్రాంఅయింతర్వాత కేబరే మీద మీ అభిప్రాయం ఏమిటని కాస్ట్రోని అడిగాను.
‘దటీజ్ టూ మచ్ ఆఫ్ ప్రాపగాండా’
అన్నాడని అబూ చెప్పాడు.
మాకు విజయవాడ వెళ్లడానికే డబ్బుల్లేవు గదా మీరు ఈ రోజు హనోయ్‌లో, రేపు హవానాలో, తర్వాత బుడాపెస్ట్‌లో, కీవ్‌లో ఎలా తిరుగుతారన్నాం, నవ్వేడు. నికారాగ్వా విశేషాలు చెప్పాడు.
మెక్సికన్ కార్టూనిసాల గురించి చెప్పాడు.
ఢిల్లీ వస్తే క్యూబా, లాటిన్ అమెరికన్ కార్టూన్‌లూ, హ్యూమర్ మాగజైన్‌లు ఇస్తానన్నాడు.
ఆయన వీక్లీ కాలమ్స్‌లో మూడేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం రాసిన విషయాల గురించి వివరాలడిగితే ఆశ్చర్చపోయాడు. ఆయన భోజనం వేళ దాటి చాలా సేపయిపోయింది. అయినా హోస్టులందర్నీ పక్కనే కూచోబెట్టి వారితో మాట్లాడుతున్నాడు. మళ్లీ గ్లాసు నింపుకున్నాడు.
ఆర్.కె.లక్ష్మణ్, అజిత్ నైనన్, రవి శంకర్, మికీ పటేల్, విజయన్‌ల కార్టూన్‌ల గురించి అడిగాడు. తోచిన అభిప్రాయం గడ గడా చెప్తున్నాం. ఇంతలో సోఫా పక్కనున్న డ్రాయింగ్ షీట్ చూశాడు. ఏమిటదని అడిగాడు. మీకేనంటూ ఇచ్చాం.
ముచ్చట పడ్డాడాయన. ఆ బొమ్మని తన భార్యకీ, పక్కనున్న కార్టూనిస్ట్‌కీ కాస్త గర్వంగానే చూపించుకున్నాడు.
“మరి మీ కామెంట్ ఏమిటి?” అని అడిగా.
అబూ పర్వత శిఖరం లాంటి వాడనీ మా పిల్లకార్టూనిస్టులందరం పర్వతారోహకులమనీ బొమ్మవేసి “స్కేలింగ్ మౌంట్ అబూ” అనే కేప్షన్‌తో నేను తెలివి వెలగబెట్టాను.
ఆయన అట్లాగే “బికాజ్ ఇటీజ్ దేర్, ఎహ్” అని సంతకం పెట్టాడు.“దిసీజ్ సూపర్ ఈగో” అన్నాను. నవ్వేడు. ఢిల్లీకి ఆ బొమ్మ తీసుకుపోతానన్నాడు. పేపర్లో అచ్చేసిన తర్వాత పోస్ట్‌లో పంపిస్తానని కాళ్ళూ గెడ్డాలూ పట్టుకున్నా. ఓ.కే అన్నాడు.
చాలా రాత్రయిపోయింది.
ఢిల్లీలో కలుద్దాం గుడ్‌నైట్ అన్నాడు.
రోడ్డుమీద పడ్డాం. పంజాగుట్ట అంతా బ్లూమూన్. దారి క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తోంది.
ఎవరెస్ట్ శిఖరం ఎక్కినపుడు టెన్సింగ్ నార్కే
ఎట్లా ఫీలయి ఉంటాడో అని చిన్నప్పట్నుంచీ బెంగపడేవాణ్ణి.
నా పక్కనున్న కుర్ర ఆర్టిస్టు చెప్పకముందే,
ఆ ఫీలింగ్ అర్ధమయింది.
* * * Artist Mohan… (మోహన్ వేసిన అబూ కేరికెచర్ కవర్ ఫోటో)
Share this Article