Taadi Prakash……………… తిలక్… నువ్వు లేవు… నీ పాట/ మాట/ ఆట వుంది!………… Artist Mohan on film director Tilak
———————————————————
ఇవాళ పాత సినిమా దర్శకుడు కె. బీ. జీ. తిలక్ పుట్టిన రోజు. ఆయన గురించి పది సంవత్సరాల క్రితం the Sunday Indian తెలుగు రాజకీయ వార పత్రికలో ఆర్టిస్ట్ మోహన్ రాసిన వ్యాసం ఇది :
నిజానికిది సినిమా దర్శకుడు కొల్లిపర బాలగంగాధర తిలక్ గారి గురించి కాదు ఆయన్ని మాన్యుఫేక్చర్ చేసిన ఆ కాలం, ఆ వూరూ, ఆ జనమూ, నాయకులూ ఇంకా చాలా చాలా గురించి. వరవరరావుగారు ఆయన చూసిన ఆయనకు తెలిసిన తిలక్ గురించి చాలా బాగా రాశారు. ఆయనకి తెలీని, మేము చూసిన తిలక్ గురించి ఇది. ఒక రకంగా ఇదొక నిర్బంధ ఉచిత సొంతసొద.
Ads
తిలక్ గారి సినిమాలూ, పాటలూ, ఆయన భావాల గురించి ఇందులో ఏమీ ఉండదు. అవన్నీ పత్రికల్లో వచ్చాయి. ఆయన కాకుండా ఇతరుల గురించీ, మా గురించే ఎక్కువ గొప్పలు చెప్పుకోటం ఉంటుంది.
దెందులూరులో ఏముంటుంది గనక, పచ్చని పొలాలు, పంట కాలవలూ, చెరువుల్లో తాటి దోనెలూ, కలవపూలూ, విరగ్గాసే చెట్లూ, కొల్లేరు పిట్టల అరుపులూ, కూలీల పాటలూ అంతే.
ఆ మాటకొస్తే ఇటు చాటపర్రూ, అటు పెదపాడూ, చింతల పూడి, పెదకడిమీ, చినకడిమీ, మడిచెర్ల ఎన్ని పేర్లు చెప్పాలి! అన్నీ అలాగే ఉండేవి. కానీ మేజర్ ఎట్రాక్షన్ మటుకు ఏలూరే. అది మెగా మెట్రోపాలిస్. దేశానికి పంజాబ్ లాగా రాష్ట్రానికి ధాన్యాగారమయిన మహా జిల్లాకి రాజధాని., చుట్టుపక్కల వంద వూళ్లలో హైస్కూల్ పాసైన వాడెవడైనా, ఎంత హీరో అయినా చచ్చుకుంటూ ఇక్కడి సి.ఆర్.రెడ్డి కాలేజీ కొచ్చి చేరాల్సిందే.
ఎక్కడో శ్రీకాకుళంలో, ఎస్.కోట నుంచి పొట్ట చేతపట్టుకొచ్చేంత దరిద్రపు లేబర్ అయినా ఇక్కడ క్రిష్ణా జూట్ మిల్ లో పోరీ ఎక్కాల్సిందే… లేదంటే రిక్షా లాక్కొవచ్చు. రైస్ మిల్లుల్లో హమాలీగా బండిలాగొచ్చు. జలంచీరు కంచాలు, బొచ్చెలు సుత్తుల్తో కొట్టిపని చేయొచ్చు. (జలంసేరు. అంటే జర్మన్ సిల్వర్, అంటే అల్యూమినియం దాన్ని తూర్పు నుంచి వచ్చిన అనాగరికులయిన తూర్పోళ్లు అలా అంటారు. మేం తూర్పోళ్లమే. పైగా తూర్పుకాపులం కూడానూ), ఏ పనీపాటా దొరకనోళ్లు ఓ రవ్వల తుపాకీ వేసుకుని పెద్ద స్టేషను దాటి వేట.
కొల్లేరు కొచ్చే పరజ పిట్టలూ, సైబీరియా గూడ కొంగలూ పడతాయి. ఒక్క పిట్ట అమ్మితే ఎండుచేపలూ, పిత్త పరిగెలు, నూనే, ఎండుమిరపగాయలూ చింత పండూ అన్నీ వచ్చేస్తాయి. ఇంకో పిట్టతో సారా కొట్లో మూడు డ్రాములు కొట్టగా, వెదురు కర్రకి కొబ్బరి డొక్కు పట్టుకొని హరిశ్చంద్ర, శ్రీకృష్ణ రాయబారం పద్యాలు పాడే సారా సైగల్ కి కూడా వన్స్ మోర్ అంటూ మందు పొయ్యొచ్చు. తూగుతూ ఇంటికొస్తే గుడిసె బయట రాయిమీద కూచోబెట్టి పెళ్ళాం ఉడుకు నీళ్లుపోసి వీపు తోముకుంది. తల్లి పిట్ట మాంసం పిత్త పరిగెలూ వండుతుంది, పిల్లలు లొట్టలేసుకుంటూ తిని అరే నాన్నా అంటూ మెడకు చుట్టుకుంటారు.
ఇంకేం కావాలి. ఉద్యోగాలు చెయ్యాలా ఊాళ్లేలాలా!
ఇది ఏలూరులో తమ్మిలేరు నానుకుని ఉన్న తక్కువ కులాల వాళ్ల కథ. కాని బెజవాడ నుంచి వచ్చే రైవస్ కాల్వకి అవతల కొంత మిడిల్ క్లాసూ, ఇంకాస్త అప్పర్, మరింత భీకర్ రిచ్ అగ్రకులాల వారుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చాలా చాలా.
మొగుడు కూలీ కెళ్లి, పెళ్లాం ఆ రిచ్ ఇంట్లో పనిమనిషిగా వెళ్లిందంటే ఇక బెంగే లేదు. ఇల్లూ పిల్లలూ దర్జా. అగ్రవర్ణాల పులిహెూరలూ, కూరలూ మిగిలిన అన్నమంతా ఉచితం. కానీ అందరికీ అందే స్వర్గం కాదిది. ఏటి గట్టున గేదెలు కోసి, పేగులు ఎండబెట్టే మాదిగలూ, మాలలూ, ఇళ్లల్లో, బయటా దొడ్లు ఊడ్చే పాకీ వాళ్లూ, అడుక్కోటానికి వచ్చే చెంచులూ, నూనెలోళ్లూ, సన్యాసులూ, పందుల్ని పట్టి చంపే ఎరకలోళ్లూ, యానాదులు చెప్పలేం. ఘోరం. పేదరికం, ఆకలి, చాలామంది బార్టర్ సిస్టమ్ మీదే బతికేది. ఎర్రని ఏగానీ గానీ కరెన్సీగానీ బతుకులో చూసింది లేదు. చుట్టుపక్కల ఊళ్లలో మటుకు గ్రిమ్ మైనారిటీ కులాల భూస్వాములకు భారీ పొలాలూ ఆస్తులూ, ఏలూరులో భవంతులు, వ్యాపారాలూ, రాజభోగం సాగేది.
కొత్త బ్రిటిష్ కలెక్టరొచ్చి మీ ఊరి పేరేంటి బే అని విక్టోరియన్ మేనర్స్ అండ్ ఎటికెట్ తో అడిగితే “ఏలూరండి” అంటూ స్వచ్ఛమైన ఊరి ఊకారాంతపు ఉచ్ఛారణతో చెబితే “ఒహ్వా ఎల్లోర్” అని అదే పేరుని మా రైల్వేస్టేషన్ ఎల్లో బోర్డు మీద నల్లటి అక్షరాలు రాయించాడు. చలంగారి “స్టేషన్ పంపు” కథలు ఈ స్టేషన్ వే, మైదానం, అమీనా లాంటివాటి కేరాఫ్ తమ్మిలేరు.
సరే గాంధీగారు స్వతంత్రం అన్నారు. తిలక్ లాటి వాళ్లంతా ఊళ్ల నుంచి బళ్లు కట్టుకుని పొలోమంటూ ఏలూరొచ్చి స్వతంత్రం అని ఊరేగింపుల్లో అరిచారు రష్యాలో విప్లవం వచ్చిందని లేటుగా తెలిసింది
కాంగ్రెస్ లో కుర్రాళ్లయిన మా నాన్న లాంటి వాళ్లంతా రాడికల్ గ్రూప్ అయ్యారు. మరింత కుర్రకారయిన తిలక్ తదాది అంతా ఇటే మొగ్గారు. మానాన్న “లేబర్ ప్రొటెక్షన్ లీగు” స్థాపించాడు. అదే తర్వాత కృష్ణా జూట్ మిల్ కార్మిక ‘సంఘంగా, చుట్ట, బీడీ అల్యూమినియం, తివాసీ నేత, చేనేత, తోళ్ల కార్మిక సంఘాలుగా విస్తరించాయి. కాంగ్రెస్ లోని దయాళువులయిన జమీందార్లు ఈదర వెంట్రామయ్య, బడేటి వెంకట్రామయ్య లాటి ఎందరో ఈ బీదా బిక్కి సంఘాల్ని సమర్థించారు. ఆ లేబర్ ప్రొటెక్షన్ లీగ్ లే తర్వాతర్వాత కమ్యూనిస్టు పార్టీగా తయారయ్యాయి. దానిమీద నిషేధాలూ వచ్చాయి. క్విట్ ఇండియా ఆ తర్వాత తెలంగాణా సాయుధ పోరాట కాలంలో ఉద్యమాలూ ఊరేగింపులూ అంటూ తిరిగిన ఈ కాంగ్రెస్ కమ్ కమ్యూనిస్టు నాయకులూ, పెద్దా చిన్నా అందర్నీ బ్రిటీష్ వాళ్లు జైళ్లలో వేశారు. రాజమండ్రి, కడలూరు, రాయవేలూరు ఎక్కడెక్కడో తిప్పారు. తిలక్ నీ ఇదంతా ఇన్స్పైర్ చేసింది. ఈ జైళ్లు మనుషుల్ని
భలే కలిపాయి. వీరమాచనేని వెంకటనారాయణ అనే మెగా భూస్వామి (తర్వాత పి.సి.సి ప్రెసిడెంటు)నీ, కడప నుంచొచ్చిన కమ్యూనిస్టు వాగుడుకాయ కుర్రోడు గజ్జెల మల్లారెడ్డినీ, మా పేట చింత చెట్టు వీధి చివర ఉండే పద్మసాలీ కడుపు రాములునీ, పాలకొల్లులో స్టేజీమీద డప్పుకొడుతూ పాటలు పాడే అల్లు రామలింగయ్యనీ, చరిత్రకారుడు కంభంపాటి సత్యనారాయణనీ ఇలా చెప్పుకుంటూ పోతే వందపేర్లొస్తాయి… ఒకే సెల్లో వేశారు.
వైల్డ్ కాంబినేషన్. ఆ కాక్ టైల్ లోనే తిలక్ లాంటి వాళ్లకి కిక్ దొరికింది. విదేశీ వస్త్ర దహనమే కాకుండా సొంత లాభాన్ని దహించడం, ఎదుటి వాడికోసం చొక్కా విప్పి ఇచ్చేయడం, బతుకులో విజయం ఎన్నటికీ సాధించకుండా ఉన్నదాన్ని వదులు కోడం ఎందుకూ కొరగాని పుస్తకాలు చదూకోడం, ఆదర్శం, త్యాగం లాటి అశరీరమైన విషయాల వెంట అంతూదరీ లేకుండా పరుగులు తీయడం
నేర్పిందా కాలం.
తెలంగాణా సాయుధ పోరాటానికి సాయం చేస్తున్నాడని మావూరి మృత్యుంజయుణ్ని
చింత చెట్టు కి కట్టి పోలీసులు తుపాకులు ఎక్కుపెడితే, కాల్చుకొండని చొక్కా చీల్చి ఎదుర్రోమ్ము చూపించాడు. వాళ్లు కాల్చారు. కానీ మా వూళ్లో కూలీల పూజగదులన్నిటిలో చిన్న తిరపతి వెంకటేశ్వరస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామీ, బెజవాడ కనకదుర్గమ్మ ఫోటోల పక్కనే ఆయన బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండేది.
మా కనకదుర్గా ఫోటో స్టుడియో వాళ్లు తీసిన బొమ్మ. దాని పక్కనే కేరళ నంబూద్రి పాద్ మంత్రి వర్గం బొమ్మకూడా, అన్నిటికీ పసుపు కుంకుమ బొట్లు కర్పూర హారతులూ, పిల్లా పాపలందరి దండాలు రోజువారీ బతుకులో మామూలు విషయం,
ఆయన నిజంగా చావుని జయించాడు.
ఇక మా వూరు తిలక్ లాంటి సవాలక్ష మందిని సూదంటురాయిలా ఊళ్ల నించి లాగడానికి ఒన్ థౌజండ్ అండ్ ఎలెవెన్ కాజెస్ ఉన్నాయి. ఇక్కడ ఇటాలియన్ రోమన్ కాథలిక్స్ ఏనాడో పెట్టిన సెయింట్ థెరీసాస్ గర్ల్స్ కాన్వెంట్ ఉంటుంది.
ఇంకా దూరం వెళ్తే సర్ సి.ఆర్.రెడ్డి కాలేజ్, అనీబిసెంట్ మావూరొచ్చి చాలాకాలం ఉండి స్థాపించిన కొండా పార్వతీ దేవి హైస్కూల్, మా పేటలో సుబ్బమ్మాదేవి హైస్కూల్ (ఈ రెంటిలో మహానుభావుడనైన నేను చదువుకోడం అయింది. నాకంటే ముందు తొందరపడి సుబ్బమాదేవిలో చదివిన సవాలక్షమందిలో ఇప్పటి రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ సుబ్బారావు గారొకడు) ఇంకా కోటదిబ్బ హైస్కూల్ లాటివి చెప్పలేనన్ని.
అసలు విషయం. “ఎల్లోర్” పెద్ద స్టేషన్ తర్వాత మాపేట” పవర్ పేట్”. రైల్వే స్టేషన్ ఉంటుంది ఇటొస్తే వెంకట్రామా టాకీస్ ఎదురుగా మా ఇంటి పేరు మీదే “తాడివారి వీధి” ఉంటుంది. తమ్మిలేరు మా ఇంటికి అరమైలు దూరంకూడా ఉండదు. ఆ ఏటి గట్టున నడుచుకుంటూ పోతే అశోక్ నగర్, పంగిడి గూడెం మహారాణీ భవంతి వస్తాయి.
అందులో చెప్పుకోడానికి గొప్పేం లేదు.
కానీ అక్కడ ఏటి గట్టున పరమ దిక్కుమాలిన
గుడిసె ఉండేదట. అందులోనే గుడిపాటి వెంకట చలం తన మైదానం రాశారు…
ఎంత చారిత్రాత్మకమైన లిటరరీ గుడిసె!
తణుకులో ఖరీదైన బట్టల వ్యాపారి గారి దర్జా కొడుకైన అందగాడు దేవరకొండ బాలగంగాధర తిలక్ తన అమృతం కురిసిన రాత్రి కవితలు మధ్యలో వదిలేసి చేతికి మల్లెపూల చెండు చుట్టుకొని ఏలూరు వీధుల్లో వట్టికే రిక్షాలో రికామీగా తిరిగి తిరిగి ఫ్రెండ్స్ తో కబుర్లు కొట్టేవాడట. పవర్ పేట నుండి తిన్నగా వెళ్తే కృష్ణా లంచ్ హెూమ్… తర్వాత కర్రవంతెన వస్తుందిగా. కింద అన్నీ పడవలు. అవెక్కితే కాలవ మీద నాలుగైదు రోజుల్లో వీజీగా భీమవరం, పాలకొల్ నర్సాపురం వెళ్లిపోవచ్చు. వంట, పడకా అంతా పడవలోనే. కర్రొంతెన దాటగానే ఎదురుగా గోపాల క్రిష్ణా టాకీస్ ఉంది గదాని అందులో “జిస్ దేశమే గంగా బహతీ హై”కి వెళ్లకుండా, రైట్ కి కొడితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసుంటుంది. లెఫ్ట్ కి తిరిగితే టౌన్ హాలూ, ఆపైన మునిసిపల్ ఆఫీస్, అందులో రేడియో స్టేషనూ ఉంటాయి. మానాన్న మున్సిపల్ ఛైర్మన్ గనక నేను దర్జాగా చెడ్డీ ఎగలాక్కుంటూ ఆపరేటర్ రూమ్ లోకి పోయేవాణ్ణి. అంతకంటే గొప్ప టౌన్ హాలే. అక్కడ సాయంత్రం కొనకళ్ల వెంకటరత్నం టంచన్‌గా ఉండేవాడు. నాన్నా ఆయన కబుర్లు కొట్టేవారు. బంగారి మామ పాటల గురించి చర్చించే వారని తెలుసు. కవులూరి వెంకటేశ్వరావనే మరో రచయిత కూడా అక్కడే. ఇక మా పవర్ పేట పక్కన గిలకల గేటు దాటి వెంకట్రామా అండ్ కో ఉంటుంది. కూలీల పిల్లలంతా స్కూల్ ఎగొట్టి స్కేలు పట్టుకుని ఎళ్తే పదహారు పేజీల ఫారాలు మడిచి, టెక్స్ట్ పుస్తకాలుగా చేస్తే సాయంత్రానికి చెడ్డీ జేబునిండా డబ్బులు… అందరూ గుంపుగా “వెంకట్రామా అండ్ కో దొబ్బితిని పండుకో” అని కోరస్ గా అరుస్తూ ఐస్ ప్రూట్లు కొనుక్కు, కొరుక్కు తింటూంటి నాలాటి అనాధ బాలలకు కడుపులో అసూయ రగిల్చిన కక్ష. ఆ అండ్ కో పక్కనే ఎర్ర దుమ్ముకొట్టుకున్న పెంకుటిల్లు, బుచ్చిబాబు గారిది. అందులోంచే తెలుగు దేశానికి చైతన్య స్రవంతి ప్రవహించింది. ఇంకాస్త పైకి పది వన్నెండడుగులేస్తే సన్నటి మురికి కాల్వనిఆనుకొని చిన్న డబుల్ రూమ్ లో ఓ ఒంటరి బ్రహ్మచారి వేల్చేరు నారాయణరావుంటాడు. ప్రబంధాలు, పద్యాలు, షేక్స్పెయర్, వర్డ్స్ వర్త్ మార్క్సిజము ఆ రూమంతా ప్రతిధ్వనించి ఊరంతా కమ్మేస్తుంది. ఆ పక్కనే సురభి నాటకాల బాచ్ లో శివరావూ, వనారస గోవింద రావుగారి సంతతిలో అవేటి పూర్ణిమగారూ… చెప్పు కుంటూ పోతే వందల మందల ఆర్టిస్టులు.. వద్ధిక,
పార్టీ ఆఫీసని మా ఇంటికే పోదాం.
అక్కడ మా ఎమ్ఎల్లే అత్తలూరి సర్వేశ్వరావు గారు లోపల రూమ్ లో కూచుని ఉంటారు. పొట్టాయన. బ్రహ్మచారి, బిగించిన గుప్పెట్లో తెల్ల సిగరెట్ కాల్తుంటుంది, పార్లమెంట్ సభ్యురాలు వీరమాచనేని విమలాదేవి తెల్లగా అందంగా అంత పొడుగున ఇంతలావున దాటిగా నడుచుకుంటూ వచ్చి అందర్నీ ఏమోయ్ అంటూ హడావుడిగా పలకరిస్తూంటుంది, మరో పార్లమెంటు మెంబరు కొండ్రు సుబ్బారావు సన్నగా, నల్లగా, బక్క పల్చగా చిరునవ్వుతో వచ్చి డైలీ పేపరు తిరగేస్తాడు. తాడేపల్లి గూడెం నుంచి ఎం.వి.ఎన్ కపర్ధి అనే ట్రేడ్ యూనియన్ నాయకుడు లావుగా పొట్టిగా హుషారుగా వచ్చి పిచ్చి జోకులు వేసి, కవిత్వాలు చెప్పి పేట కార్మికులందర్నీ పలకరించి నవ్విస్తాడు. తణుకు నుంచి వంక సత్యనారాయణ, నర్సాపురం ఎమ్మెల్యే పడాల శ్యామసుందర్రావు, మా మిలట్రీ మేన్ ఇందుకూరి సుబ్బరాజుగారు ఒక్కడు కాదు… తాడి, పూడి, మడక అప్పల సాములు, ఉద్దరాజు రామంగారు అందరూ హీరోలే. ఈ మధ్య వై.ఎం.హెచ్.ఎ హాల్లో నాటకాల రాయుళ్లు, బయట సినిమా పిచ్చోళ్లు,
పార్టీ రాష్ట్ర మహాసభకి డాంగే బొంబాయి నుంచి వస్తున్నాడనీ, గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడానికి జనసేవాదళం బాస్ గా చండ్ర రాజేశ్వరావు యూనిఫామ్ వేసుకుని జనసేవా దళ్ సేనకు ముందు నించుంటాడనీ తెలిస్తే ఇక సందడి.
ఊరంతా తోరణాలు, వీధులన్నీ ఎర్రబారతాయి. కూలీలు పొలం పనులు ఎగ్గోడతారు. అప్పుడు తరిమెల నాగిరెడ్డి నడుచుకుంటూ మా ఇంటి కొస్తే గడ్డివాము పక్కన జామచెట్టు కింద, పొట్ట కాయలూ, ఆనబకాయల పాదు కింద నులక మంచం వేస్తే కూచున్నాడు. పక్కనే సన్నజాజి పందిరి. అమ్మ టీలు పెట్టిస్తే అందరికీ అందించే ఆఫీస్ బాయ్ నేనే.
ఇలా డాంగే, చండ్ర రాజేశ్వరావు లాంటి వారు వస్తున్నాంరంటే దేవుళ్ళు వస్తున్నట్టే.
భక్తి పారవశ్యంతో ఊగిపోడమే. అదే తిలక్, అల్లు రామలింగయ్య, మా వీధి వెనక తెల్ల మేడలో ఉండే మా శేషుగారి భర్త కొంగర జగ్గయ్య వస్తున్నారంటే భయం భక్తి ఏమీ ఉండవు. గ్లామర్.. వీళ్లు మా వూరి తెరమీద కనిపిస్తారు. పక్కింటోళ్లు, మనోళ్లు, పేట పిల్లలంతా అల్లురామలింగయ్య చుట్టూ మందలుగా మూగే వాళ్లు. రెండు సినిమా డైలాగులు జోకులు చెబితే పిల్లలంతా విరగబడి నవ్వి ఆర్నెల్లు అవే కబుర్లు చెప్పుకునే వారు. జగ్గయ్య కాంగ్రెసాయన. మా నాయనతో పెద్దగా కలిసే వాడు కాదు. పైగా మద్రాసులో బిజీ, మా అమ్మా ఆయన భార్య శేషు మాత్రం బాగా ఫ్రెండ్సు. తిలక్, అల్లురామలింగయ్య మా ఇంటి కొచ్చి నాన్నతో కబుర్లు కొట్టేవాళ్లు.
వీళ్లంతా జైళ్లలో కలిసి బతికారు. వీళ్లిద్దరూ వయసులో చిన్నవాళ్లు, నాన్న వీళ్లని ఏమోయ్, మెడ్రాస్ నుంచేనా, ఇంకా సినిమాలేనా” అని పలకరించే వాడు. అప్పటికి తిలక్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్నీ హిట్లే.. ఎమ్మెల్యే,
జల్సా రాయుడు, అత్తా ఒక ఇంటి కోడలే లాటి సినిమా లెన్నో పేలాయి. “నీ ఆశ అడియాశా… లంబాడోళ్ల రాందాసా” పాటతో ఎంతో మంది ఎలాగో ఐడెంటిఫై అయిపోయారు. పిల్లలందరం పోగయ్యి జోడుగుళ్ల పిస్తోలు ఠ… నేను ఆడీ తప్పని వాణ్ణీ జీహ అని జగ్గయ్య తాగుతూ సూర్యకాంతాన్ని బెదరించే పాటని నేను చెడ్డీ లాక్కుంటూ రెండువేళ్లు చూపిస్తూ అనగానే, ఇద్దరు ముగ్గురు పిల్ల ఫ్రెండ్స్ గుండెలు
చేత్తో పట్టుకుని నేలకొరిగి పోయి లేచి ఈమంటూ పళ్లికిలించే వాళ్ళు. తిలక్ పార్టీ ఆఫీసుకు రావడం, ఇంటికి రావడం, అమ్మని పలకరించడం లాల్చీ జేబులో చేయి పెట్టి నోట్లు తీసి ‘అరేయ్’ సిగరెట్లు పట్రా అంటే నేను ఆగమేఘాల మీద పరిగెట్టి రాడం పెద్ద ఆనర్. అనుపమ బానర్ మీద ఆయన సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఎన్టీయార్, ఏఎన్నార్ లాంటి మెగా ఫిలింల ముందు చిన్ని చిన్ని ఫామిలీ ఫిలింలు తీసి సూపర్ హిట్లు కొట్టాడు. ఆరుద్ర పాటలు, బాపూ పిక్చర్ స్టోరీలూ, జగ్గయ్య జమునని మెయిన్ స్ట్రీమ్ లో కాకుండా వేరుగా పారలల్‌గా చూపించి జనాన్ని మురిపించాడు. ప్రత్యగాత్మతో, బాపట్ల నుంచి మెడ్రాసు చేరిన హరి పురుషోత్తమరావుతో లైజాన్.
నేను హైస్కూలూ, కాలేజీ దాటి ఊరొదిలి విశాలాంధ్ర పేపర్ లో సబె డిటర్నయ్యా. తిలక్ వచ్చాడు. జర్నలిస్టునన్న జ్ఞానం కూడా లేకుండా “ఏరా సినిమా షూటింగ్ కి వస్తావా కవర్ చేద్దువుగాని” అని ఎడిటర్ ఏటుకూరి బల రామ్మర్తిగారి ముందే అన్నాడు.
నేను సిగ్గుతో ఆనందపడ్డాను. కొల్లేటి కాపురం సినిమా. ‘మా ఏలూరోళ్లందరికీ కొల్లేరు పిచ్చి జాస్తి.
ఆ చేపలూ, ఆ పిట్టలూ తినే బతికాం కదా. కొల్లేట్లో నాటు బాంబులు పెట్టి పడవల పక్కన పేలుస్తామన్నీ నీళ్లు వంద అడుగుల ఎత్తుకు ఎగురుతాయనీ స్పీల్బెర్గ్ లా చెప్పాడు. రమ్మన్నాడు. నేను పోలే.
మళ్లీ వచ్చి భూమికోసం సినిమా అన్నాడు. ఒంగోలు నుంచి మాదాల రంగారావునీ, రాజమండ్రి నుంచి జయప్రదనీ తెప్పిస్తున్నానన్నాడు. భూస్వాముల ముందు పార్టీ పాటని శ్రీకాంత్ తో రాయిస్తున్నట్టు చెప్పాడు. హైదరాబాద్ కు వచ్చి కార్టూనిస్టునయ్యా ఆయనా హైదరాబాద్ వచ్చేశాడు, ఎప్పటిలా నన్ను అరేయ్, ఒరేయ్ అంటం మానేశాడు. మోహన్ అని పిలవడం మొదలు పెట్టాడు. సినిమా. కెమేరా, షూటింగ్ అనేది కొద్ది మంది పెత్తందార్ల మోనోపలీ కాకూడదనీ, అన్ని జిల్లాల్లో, ఊళ్లల్లో అందరు పిలగాళ్లు వాళ్లకు తోచినవన్నీ సినిమాలు తీసే దశ రావాలనీ చెప్పేవాడు. కాంగ్రెస్ నాయకులతో కలిసి తిరిగేవాడు. ఎన్టీఆర్ కాలంలో ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు తీయడానికి ప్రభాకరరెడ్డితో కలిశాడు. పద్మాలయా స్టూడియోలో *గండి పేట రహస్యం . దానికి ప్రభాకరరెడ్డి డైరెక్టర్. ఎన్టీఆర్ పాత్రకి పారడి కామెడీ సారధి. ఎన్టీఆర్ విశ్వామిత్ర సినిమాని అది వెక్కిరిస్తుంది. నన్ను పిలిచి పోస్టర్లు డిజైన్ చేయమన్నాడు. ఏలూర్లో టీలూ, సిగరెట్లూ షట్రాలేదూ, అట్లాగే చేశా. అవన్నీ తర్వాత కాంగ్రస్ పార్టీ ఎన్నికల ప్రచారం పోస్టర్లుగా చేశాడు.
ఢిల్లీ పంపించాడు. ఎ.ఐ.సి.పి ప్రాపగాండా ఇన్ ఛార్జి మణి శంకరయ్యర్ వాటిని రాజీవ్ గాంధీకి చూపించాడు. తమిళనాడుకు వెళ్లి పేలి చచ్చిపోవడానికి ముందు రాజీవ్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు “మా ఉత్తరాది ఎల క్షన్లలో ఇలాటి సరదాలుండవు. దక్షిణాదివాళ్ల కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ, కేరీఆన్” అన్నాడని మణి శంకర్ అయ్యర్ నాకు చెప్పాడు. తిలక్ పంపిన నా కార్టూన్లని మణి సండే వీక్లీలో మల్టీ కలర్ లో అచ్చేశాడు కూడా. సినిమాల్లేకపోయినా ఖాళీగా కూచునేవాడు కాడు తిలక్, భారత పాకిస్తాన్ మైత్రీ సంఘం పెట్టాడు. ఢిల్లీలో నిర్మలా దేశ్ పాండేతో ఆయనకి ఫ్రెండ్షిప్. కాంగ్రెస్ వాళ్లతో గట్టి టై అప్. గాంధీ సినిమా తీసిన Attenborough వేలాది extra లకి ఎగొట్టిన డబ్బులు గురించి ఢిల్లీలో, లండన్‌లో నాలుగేళ్ల పాటు నానా యాగీ చేసి Attenborough తో ఆ డబ్బులన్నీ కక్కించాడు. పాకిస్తాన్ కవుల్ని, ఆర్టిస్టుల్ని హైదరాబాద్ రప్పించాడు. ఇక్కడి వాళ్లందర్నీ పాకిస్తాన్ బయలుదేరదీశాడు. గోరటి వెంకన్న, కార్టూనిస్టు శంకర్ ఇంకా ఎందరో బోర్టర్ వరకూ పోయి వెనక్కు వచ్చారు.
ఎందుకో చనిపోడానికి వారం రోజుల ముందు వరకూ ఆయన ఊరుకోలేదు, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. ఆ వారం రోజుల ముందే సండే ఇండియన్ రిపోర్టరని ఆయన ఇంటికి పంపించా, నే వెళ్తే బావుండేది. చాలా చాలా మాట్లాడి పంపించాడు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా బతికాడు. వాళ్లావిడ ఆయన చేసే పనులేవీ లెక్క చేసేదికాదు. తెలుసుకునేది అసలు కాదు. తిలక్ ని చివరి దాకా ఏలూరు వదల్లేదు దెందులూరెక్కడిది!
– Artist Mohan
*** *** ***
ఈ వ్యాసానికి సండే ఇండియన్ సంపాదకుడు నరేష్ నున్నా రాసిన ఇంట్రో ఇది :
మోహన నాస్టాల్జిక్ వ్యంజనమ్
నువ్వు లేవు నీ పాట ఉంది ఇంటిముందు మల్లెతీగల్లో అల్లుకొని… లాంతరు వెలుగులో క్రమ్ముకొని…. అని కవితాసతి నొసటి రసగంగాధర తిలకం రాసుకున్నారు. అదే ఏలూరు కుదుళ్ళలోంచి మొలిచిన కె.జి.తిలక్ అనే కొల్లిపర బాల గంగాధర తిలక్ గురించి నివాళి రాసిన ప్రముఖ చిత్రకారుడు మోహన్ కూడా అలాంటిదే రాశారు. మోహన్ ఏం రాశారో ఎదురుగానే ఉంది. మూడు దశాబ్దాలుగా కార్టూనిస్టుగా, ఇలస్ట్రాటర్ గా, ఆర్టిస్టుగానే కాకుండా మంచి రచయితగా కూడా ప్రసిద్ధులైన ఆయన
ఎలా రాశారో అన్న దానిమీదే ఈ వ్యాక్యాసం
ఈ వచన స్మృతిగీతమంతా సినీ దర్శక నిర్మాత కె.బి.తిలక్ సాకుతో విప్పిన స్వకీయ పురాణమేనని ముందుగా మోహన్ చేసిన కన్ఫెషన్ ని నమ్మి మోసపోవాల్సిన పనిలేదు. ఇదంతా కాగి తాల మీద కుదించిన డాక్యుమెంటరీ. నిన్నా మొన్నలలోంచి వర్తమానం దాకా అలతి అలతి పదాలతో బొమ్మ కట్టిన అక్షర దృశ్య మాలిక. శోకండాలు ఆగిన చావు ఇంట్లో ఆగని సణుగుడిలా తోచే గొలుసు జ్ఞాపకాల ఆ తల పోత: అవసరమైనంత మేరకు ఆగాగి పారుతున్న చైతన్యస్రవంతి ఒడ్డుకు నెట్టిస్తున్న
నురగ బుడగల బిటపట!
ఒక్క గీతలో వెయ్యి అరాలు స్ఫురింపించే ఉద్రేకించే సహజ జాణతనం వల్లే వచనంలో ఈ పోకడలు పోగల్గుతున్నారేమో మోహన్. సమయం సందర్భం, వాక్య నిర్మాణం, రచయిత నేర్పు, పాఠకుడి స్థాయి… వంటి రకరకాల అంశాలను బట్టి ఒక పదానికి, పాదానికి విశేష అర్థం ఆపాదించే శక్తిని వ్యంజన అంటారు కవిత్య అలకారికులు. వచన రచనలో వ్యంజనం తక్షణ చిరునామా మోహన్!…………………………. Taadi Prakash 9704541559
Share this Article