Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎహె ఊరుకొండి… మోహన్‌కు పుట్టినరోజులు, గిట్టినరోజులు ఉంటాయా..?!

September 22, 2021 by M S R

……… By…. Raghuramulu Thummalapally………….  మోహన్‌కు పుట్టినరోజులుంటాయా….. జననమరణ నరక నాక సబ్ సూపర్ రియాలిజంలో… నలుగురిలో ఉన్నా తానొక్కడే అనంత ఏకాంతంలో మునిగి తేలేవాడికి పుట్టినరోజులేమిటి….అసలు నాకు తెలిసి మోహన్ ఇంకా పుట్టనే లేదు. అమ్మతోడు. సరస్పత్తోడు. ఒకవేళ తెలిసో తెలియకో పుట్టినా కన్ను తెరవనే లేదు. అతీతాగతావస్థలనెరుగని పెండులమ్‌లా ఊగుతూ జోగుతూ కాలం గడుపుతున్న మోహన్ అసలు పుట్టాలో లేదో ఇంకా తేల్చుకోనేలేదు. అప్పుడే అరవైమూడా బుద్ధి లేకపోతే సరి. ఎవడ్రా కూసింది. ఓ ప్లాట్‌ఫారమ్‌లా పరచుకుని వస్తూపోతూ తాగుడుమూతల క్రీడలాడే పోరగాళ్లల్లో కాలంపోకడల్ని పరికించి పరికించి అలసిపోయాడేమో గానీ ఒక్క యేడూ ఎదగలేదు. అప్పుడే అరవైమూడా… ఏమా తెంపరితనం. సరిగానే లెక్కపెట్టావా….. ఏమ్మా లెక్కలొచ్చా….. ఏమైతేనేం….. ఆటోఎక్కినా ఒక్కటే దిగినా ఒక్కటే…..తిరిగే మీటరు ఆగదు. కవి ఏం చెప్పాడు రోజుకు 24 గంటలు. వాడుకోమానుకో అంతేకాలం…..కాలం కడుపుతో ఉండి ఎంతమంది పిల్లల్ని కంటే ఏం…..

mohan

స్టేషన్‌లో సందడెక్కువ. రైలు కదలదు. ఒకడు రక్కుతాడు. ఒకడు కక్కుతాడు. నిజంగా నిజం. ఓ కవి బాగా తాగి కవిత్వం కక్కుతాడు. సినిమాల్లో తీసేవాడు తీస్తాడు. పోయేవాడు పోతాడు. ఇక్కడా అంతే. సేమ్ సీన్ నేమ్స్ డిఫరెంట్. పోనీ జీవితాన్ని ఉంకోవైపు నుంచి చూద్దామా….వద్దులే గురూ….ఇంటిదగ్గర నుంచి ఫోనొచ్చింది. మరేటి సేసేది. పోనీ ఇంకాసేపు తాగుదాం. మరికాసేపు వాగుదాం. నా దగ్గర కరెన్సీ ఉందో లేదో నీకనవసరం. నీదగ్గర కాపర్సున్నాయా. అయితే సేవకా ఇటురమ్ము… అటు విష్కీ… అటు బీరు. అన్ని బ్రాండ్లు కుదరవండీ. అయితే రమ్ము రమ్ము హే భోగవతోత్తమ. ఎడమ చేతి చిటికెన వేలితో మీసం కొసను గెలుకుతుంటే బొమ్మెవడు వేస్తాడు. నీ బొమ్మ నువ్వే వేసుకోవాలి. ఉంకోడు వేసి పెట్టడమ్మా…. మధ్యలో వచ్చి తాగి చావండమ్మా అని శాపనార్థాలు పెడితే కుదరదు. మేం చావం. తాగి సుబ్బరంగా వణ్ణమే తింటాం….వేడివేడి అన్నం పొగల్లో ఇన్ని ఎండురొయ్యలూ గోంగూర కలిపి మర్లేసి కొడతాం. దీంతో లైనువర్కు అయిపోతుంది. ఆ తర్వాత రసం, పెరుగుతో పినిష్ చేస్తాం….ఈలోగా మోహన్‌కు గ్లామర్ పెరిగిందా తరిగిందా అని ఖాళీ గ్లాసుల విశ్లేషణ.

Ads

artist mohan

మోహన్ బొమ్మంటే చాలామందికి ఇష్టం. పిడికిళ్ల పోస్టర్‌లు సరే. ఊళ్లో ఊరేగింపు అంటే మోహన్ ముందుగా తన బొమ్మలో పీడిత, తాడిత, కార్మిక, కర్షక వర్గాల్ని కదం తొక్కిస్తాడు. అవన్నీ మామూలే అంటాడు. వాటి సంగతి కాదుగానీ మోహన్ బొమ్మల్లో ఓ చట్టిముక్కు పొట్టి పిల్ల భలేగుంటది. చారెడేసి కళ్ల ఈ పిల్ల మోహన్ అనే ఎదుగూబొదుగూ లేని పిల్లోడి ఆవుమీది వ్యాసం. మోహన్‌తో బొమ్మేయించుకోని, కనీసం వేయించుకోవాలని అనుకోని కవి నాకింతవరకైతే కనపడలేదు. మోహన్ సర్కిల్ అని చాలామంది చెప్పుకుంటారు కానీ అసలు ఆ సర్కిల్‌లో ఉన్నదెవరో చాలామందికి తెలియదు. వాంగో, గాగిన్, మానే తెలుసు. దమ్ముందా….ఇంకా వెనక్కు వెళతావా…..సిస్టిన్ చాపెల్ బొమ్మల గురించి మాట్లాడతావా….. ఆర్ట్ గురించి నీకేం తెలుసురా….. నోరు మూసుకో అనే సాధికారత మోహన్ సొంతం. లోత్రెక్ అంటే మోహన్ కు లోతైన ప్రేమ. డేవిడ్ లో లోగొంతుకలో ఏదో చెపితే మోహన్ మనకు తెలియకుండా నవ్వేస్తాడు…..

mohan(గీత :: పామర్తి శంకర్)

సెర్గియో ఆరగోనెస్ క్యాప్షన్ లెస్ ముసిముసి నవ్వుల్లో మోహన్ మునిగితేలుతాడు. చిత్తం నిండా చిత్తప్రసాదే. కాథీ కోల్విజ్ గురించి కూడా తెలుసు. పుయబ్లో గురించి నీకేం తెలుసు…. మోహన్‌కు కోపం వచ్చిందా చేగువేరా మీద నుంచి దిగడు. మోహన్‌కు అంతా తెలుసు. మనకు తెలియని చాలా విషయాలు మోహన్‌కు తెలిసినా అంతా గప్ చుప్ ఒల్లెక్కం….. యంత్రం చెడిపోయింది బాబూ….. స్పేర్ పార్టులు దొరకడం లేదు. ఓ లక్ష తీగలు కలపాలి గిటార్ మోగాలంటే. మోహన్ క్లార్కు సూర్యారావు ఏమీకాదు జీవితపు ఆటుపోట్లు చూసి దడుసుకోవడానికి. ఎంతటి విరాగి అయినా తనకు తెలియకుండానే కుటుంబరావు అయిపోయాడు. మోహన్ ఓ చదువరి. నువ్వో కొత్త పుస్తకం గురించి చెప్పావనుకో… చిన్నపిల్లాడు చాక్లెట్ గురించి చెపితే కళ్లింత చేసుకుంటాడే అట్లా అవుతాడు. శిష్య పరమాణువుగా చెల్లనివాణ్ణి కూడా తెచ్చిస్తావా గురూ అని గారాలు పోతాడు.

హిస్టరీ, జాగర్ఫీ, గీగర్ఫీయే కాదు మోహన్‌కు పాటలంటే కూడా ఇష్టం. అయితే చెవికోసుకోవడం లాంటి రిస్క్ ఏమీ తీసుకోడు. ఇష్టమంటే ఇష్టం దట్సాల్. తోడా విందీ బీ హాతా ఐ….. ఒక్కముక్క అర్థం కాకపోయినా కొన్ని హిందీపాటలు పల్లవిస్తాడు. ఎవరైనా తెలిసీ తెలియక అర్థం చెప్పబోతే చెవియొగ్గి వింటాడు… నీ బొందేం కాదు అనకుండా. ఆకాశమంత ఎత్తుండే అతని భుజం తట్టాలని చాలామంది చూస్తారట. నిజమే. ఏలూరు నుంచి తాడిమోహన్రావు నాయుడు అని ఓ కుర్రాడు వచ్చాడు. నేను భుజం తట్టాను. చూడు… మోహన్ అయిపోయాడు. ఈ అమాయక చక్రవర్తికి ఓ దునియాకే రఖ్‌వాలే అని అర్ధరాత్రి గొంతెత్తి పాడితే దేవుడు రాడు ఓనరు వస్తాడని తెలియదు. దీనికి నేనే సాక్ష్యం…. This was written when mohan turned 63 and somebody wrote a piece suggesting he needs lonliness…. (FB reminds me that I have written this piece 4 yrs ago…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions