బిగ్‌బాస్ షోలు గుర్తున్నాయి కదా… కంటెస్టెంట్ల ఓవరాతి యాక్షన్… ఎవరైనా హౌజు విడిచివెళ్లేటప్పుడు ఇక చూడాలి… ఎవడో చచ్చిపోయినట్టుగా శోకాలు, పెడబొబ్బలు, ఓదార్పులు… ఆఫ్టరాల్, అదొక గేమ్… నానా టీఆర్పీ లెక్కలు, వేషాలతో ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ మలుపులు తీసుకుంటూ ఉంటుంది… ఇదంతా వినోద దందా… ప్రేక్షకుల ఆసక్తిని గెయిన్ చేయడానికి సాగే ఓ డ్రామా… పేరుకు రియాలిటీ షో… డాన్స్, మ్యూజిక్, కామెడీ… ఏ జానర్ తీసుకున్నా అన్నింటిదీ ఒకే రూట్… రేటింగులను బట్టి కథలుపడాలి… సేమ్… ఇండియన్ ఐడల్… ఆమధ్య ఇండియన్ టాప్ 5 టీవీ రేటింగ్ జాబితాలోనూ కనిపించింది… మొన్నటి రేటింగుల్లో మిస్సయింది… దాన్ని కనీసం మూడు, నాలుగో స్థానంలో ఉంచడానికి సోనీటీవీ వాడు నానా ప్రయత్నాలూ చేస్తున్నాడు… ఈ మార్గంలోనే జడ్జిల మార్కులతోపాటు జనం వోట్లు కూడా కావాలంటున్నాడు… అన్ని షోలలో ఉన్నట్టే ఇందులోనూ ఎలిమినేషన్ ప్రక్రియ, అది సాగుతున్నప్పుడు ఓ ఎమోషన్ గట్రా కామన్…
మొన్నటి షోలో సింగర్ అరుణిత భావోద్వేగం చూస్తుంటే అకస్మాత్తుగా మళ్లీ బిగ్‌బాస్ గుర్తొచ్చి నవ్వొచ్చింది… తక్కువ మార్కులు వచ్చిన సవాయ్ భట్, పవన్ దీప్‌లను పిలిచి, వేదిక మీద నిలబెట్టి, ఇక ఎవరో ఒకరిని బయటికి పంపించే ప్రక్రియ… అరుణితలో వణుకు… దండం పెడుతోంది… ఆగమాగం అయిపోయింది పాపం… కొంపదీసి పవన్‌ను ఎలిమినేట్ చేస్తే ఫెయింటయ్యేదేమో… సరే, ఇన్నాళ్ల జర్నీలో ఆమెకూ పవన్‌కూ నడుమ కాస్త అభిమాన బంధం అల్లుకుపోయినట్టుంది… అదేనేమో ఆమె ఉద్వేగానికి గురికావడానికి కారణం… ఐనా, వారం వారం ఎవరో ఒకరు బయటికి వెళ్లాల్సిందే కదా… అది తను కావచ్చు, పవన్ కావచ్చు, పైగా చివరికి మిగిలేది ఒకరే కదా… మొత్తానికి సోనీ వాడికి భలే దొరికింది… ప్రోమోల్లో, వీడియో ఫీడ్‌లో ఆమె ఫీలింగ్స్‌నే పదే పదే చూపిస్తూ వాడేసుకున్నాడు…
Ads
నిజానికి ఈ జడ్జిల మార్కులు, వోట్లే ఓ పెద్ద మిస్టరీ… టీవీ వాడు ఏదనుకుంటే అదే… విషయానికొస్తే రాజస్థాన్‌లో బొమ్మలు తయారుచేసి అమ్ముకునే ఓ సాధారణ కుటుంబానికి చెందిన సవాయ్ అద్భుతమైన గాయకుడు… కాకపోతే మొనాటనీ వచ్చేసింది ప్రేక్షకులకు… ఒకటే టైపు… మోడరన్ తరహా పాప్ సాంగ్స్ అటెంప్ట్ చేయలేదు… సో, వైవిధ్యం లేకుండా పోయింది… తల్లి అనారోగ్యం కారణంగా కొంతకాలం షో విడిచిపెట్టి వెళ్లాడు… ఇక మొత్తం 15 మందిలో మిగిలింది ఏడుగురు… టఫ్ ఫైట్… ఈసారి ఇండియన్ ఐడల్ తీరే వేరు… ఏక్‌సేఏక్ సింగర్స్‌ను సెలెక్ట్ చేసింది… నిజానికి గత వారం షణ్ముఖప్రియకు తక్కువ మార్కులు పడి, ఎలిమినేషన్ అంచు దాకా వచ్చి బచాయించింది… ఏవో పాప్ తరహా సాంగ్స్ తప్ప క్లాసికల్ సాంగ్స్, మెలొడీ టచ్ చేయడం లేదని ఆమె మీద విమర్శ… ఈసారి మెలొడీ, క్లాసికల్ ఎంచుకుని… తనదైన ఏ ప్రయోగాలూ లేకుండా ఒరిజినల్‌ను అచ్చుగుద్దేసింది… దాంతో ఎలిమినేషన్ అంచుల నుంచి సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది…
కానీ పవన్ దీప్‌కు తక్కువ మార్కులు రావడమే ఆశ్చర్యం… తను కూడా టఫ్ ఫైటర్… బోలెడు కచేరీలు చేసిన అనుభవం ఉంది… మంచి గాత్రం, సరైన గానం… ఇప్పుడున్న వాళ్లలో నిహాల్ ఎలిమినేషన్ జాబితాలోకి వస్తాడు ఈసారి అనుకున్నారు అందరూ… మంచి గాయకుడే, కానీ ఆశిష్, డానిష్లతో పోలిస్తే పాటల్లో కాస్త వైవిధ్యం తక్కువ… డానిష్ అయితే ఇరగేస్తున్నాడు… కనిపించని పెద్ద పోటీదారు సైలీ… అసలు సాంగ్స్ ఎంపిక దగ్గర్నుంచి పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ ఆమెది… ఏతరహా పాటైనా సరే అలవోకగా రక్తికట్టించేస్తోంది… నేహా కక్కర్ లేదు, సోనూ కక్కర్ వచ్చింది… విశాల్ లేడు… అనుమాలిక్ వచ్చాడు… కానీ పోటీ మాత్రం అదే టెంపోతో హృద్యంగా, వీనులవిందుగా సాగుతోంది…!!
Share this Article