.
ఒకపక్క ఆంధ్ర అమరావతిలో తెలుగును కాపాడుకోవడానికి ఉద్యమ స్ఫూర్తితో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. మరో పక్క ప్రయివేటు సంస్థ ప్రపంచ తెలుగు సమాఖ్య సమావేశాలు తెలంగాణ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లిష్ తో పాటు తెలుగులో కూడా తప్పనిసరిగా ఇవ్వాలని అధికారిక ఆదేశాలు జారీ అవుతూ ఉంటాయి. సరిగ్గా అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన పట్టణాల్లో ఒక హోర్డింగ్ లో తెలుగు ఇలా వెలుగుతూ ఉంటుంది.
Ads
ఇవి ప్రయివేటు క్రీడా సంస్థ సొంతంగా పెట్టించిన హోర్డింగులు కాబట్టి ఇందులో ప్రభుత్వానికి ఏమీ సంబంధం ఉండదు. బాధ్యత ఉండదు. ముఖ్యమంత్రులను, ఎంతటి పెద్దవారినైనా పిలిచి… తెలుగు పరిరక్షణలో భాగస్వాములు చేయగలిగిన ప్రపంచ తెలుగు సమాఖ్యల్లాంటివి పట్టించుకుంటే పరిష్కారమయ్యే భాషా సమస్య ఇది.
పెద్ద పెద్ద కంపెనీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలున్న యాడ్ ఏజెన్సీలకు ఇలాంటి పనులను అప్పగిస్తాయి. ఆ ఏజెన్సీలు మొదట ఇంగ్లిష్ లో లేదా హిందీలో రూపొందించిన మాటలను, డిజైన్ ను తరువాత ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయిస్తాయి.
ఆ అనువాదం, ఆ ఫాంట్ ఎంత పంటికింద రాయిలా ఉన్నా, దరిద్రంగా, కృతకంగా ఉన్నా, అష్టావక్ర పదాల్లా భయపెట్టినా… ఇదివరకు కనీసం మనుషులే చేసేవారు. ఇప్పుడు ఆ పనికి గూగుల్ అనువాదాలు, ఇతర కృత్రిమ మేధ అనువాద సాఫ్ట్ వేర్లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి కృత్రిమ మేధ అనువదించి, అక్షరీకరించిన ఈ హోర్డింగ్ లో తెలుగు చదవగలిగినవారిని ప్రపంచ తెలుగు సమాఖ్య వచ్చే ఏడు అమరావతిలో నిర్వహిస్తామని ప్రకటించిన సమావేశాల్లో ప్రత్యేకంగా సన్మానించవచ్చు.
“ఛాంపియన్ గా ప్రారంభించడానికి ధైర్యం చేయండి” అన్న మాటలు, అందులో అక్షరాలు ఎలా అఘోరించాయో చూడండి.
నిలువెల్లా తెలుగుతనం నింపుకున్నవారెవరైనా దారిలో వెళుతూ ఈ తెలుగు హోర్డింగ్ ను చదవడానికి ప్రయత్నిస్తే రోడ్డు మీద ఎన్నెన్ని ప్రమాదాలు జరుగుతాయో ఊహించుకోండి!
పొరపాటున నాలుగక్షరాలు కలిపి చదివితే నేరుగా ఎక్కడికి వెళతారో ఊహించుకోండి!
డిస్ క్లైమర్:-
దీన్ని “ఛాంపియన్ గా ప్రారంభించడానికి ధైర్యం చేయండి”
అని నాకున్న పరిమిత అవగాహన మేరకు నేననుకున్నాను. మీరు కూడా అలాగే అనుకోవాలని షరతు ఏమీ లేదు. మీమీ జ్ఞానం, అవగాహన, చదివే స్థాయిని బట్టి మీరెలా అనుకున్నా పరిమ్యాచ్ స్పోర్ట్స్ వారు ఆనందిస్తారే కానీ బాధపడరు.
వారే అన్నట్లు-
దీన్ని చదవడం ప్రారంభించడానికి ధైర్యం చేయాల్సిందే. బహుశా ఇదేనేమో ఈ ఆటలో ఉన్న కిటుకు. మజా!
నోరంతా చేదయితే కొంచెం చక్కెర నోట్లో వేసుకోవాలి. అలా ఈ హోర్డింగ్ అనువాద విషరసాయన చేదు పోవడానికి మంచి అనువాద ప్రకటన ఒకటి చదవాలి.
ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇటీవల అమెరికాలో కన్నుమూశారు. తాజ్ మహల్ టీ ప్రకటనలో ఆయన తబలా వాయిస్తూ కనిపిస్తారు. వహ్ తాజ్ అన్న ఆ ప్రకటన భారతీయుల మనసు గెలిచింది. జాకీర్ హుస్సేన్ మృతికి నివాళిగా తాజ్ మహల్ టీ ఇచ్చిన ప్రకటన అన్ని భాషల్లో వచ్చింది. తెలుగులో కచ్చితంగా ఇది అనువాద ప్రకటనే. కానీ తెలుగు భాష మర్యాద, అందం దెబ్బ తినకుండా ఎంత గొప్పగా ఉందో చూడండి.
“అడిగిచూడండి 100 కోట్ల భారతీయులను-
‘తాజ్ మహల్ టీ’ గురించి విన్నప్పుడల్లా మీకు గుర్తుకొచ్చేది ఏమిటని.
తాజ్ మహల్ కాదు.
మీరే ఉస్తాద్.
ఇన్ని సంవత్సరాల అందమైన భాగస్వామ్యానికి మా కృతజ్ఞతలు.
TAJ MAHAL”
ఇందులో తాజ్ మహల్ టీ ని వెనక్కు తోసి జాకీర్ హుస్సేన్ ను ముందు నిలిపినట్లు ఉన్నా… వచ్చే ఫలితం మాత్రం పరోక్షంగా తాజ్ మహల్ టీ కే ఎక్కువ. ఆపాతమధురమైన ఒక జ్ఞాపకాన్ని తట్టి లేపుతూ… జాకీర్ కు ఇచ్చిన గొప్ప గౌరవం; అద్భుతమైన నివాళి వాక్యాలు ఇవి.
నిజమే, తాజ్ మహల్ టీ గురించి విన్నప్పుడల్లా గుర్తు రావాల్సింది జాకీర్ హుస్సేన్. ఆయన ముని వేళ్ళు నాట్యం చేసే తబలా విన్యాసం. ఆయన విద్య తాజ్ మహల్ కంటే అందమైనది. మరులుగొలిపేది. తాజ్ మహల్ టీతో జాకీర్ ది ఎంత అందమైన దృశ్యమో… తాజ్ మహల్ ముందు ఆ విద్వాంసుడు తబలా వాయిస్తూ…వహ్ తాజ్ అనిపించిన…అని వినిపించిన దృశ్యంతో మనదీ అంతే అందమైన మైమరపు. ఈ ప్రకటన మాతృక రాసిన, తెలుగులోకి అనువదించిన ఇద్దరినీ అభినందించాలి.
-పమిడికాల్వ మధుసూదన్
9989099018
Share this Article