ఆఫ్టరాల్ ఒక చానెల్‌లో వచ్చే ఓ సీరియల్ ముగిసిపోతున్నదంటే… అది వార్తేనా.? ఖచ్చితంగా వార్తే… ఎందుకంటే..? కొన్నేళ్లుగా ఆ సీరియల్ ప్రతి తెలుగువాడి ఇంటికీ చేరింది కాబట్టి… అందరినీ ఆకట్టుకుంది కాబట్టి… ఇప్పటివరకూ తెలుగులో ఏ టీవీ సీరియల్ సాధించినంత భారీ రేంజులో రేటింగ్స్ సాధించింది కాబట్టి… దాని రేంజు ముందు సినిమాలు కూడా వేస్టు… సదరు సీరియల్ హీరోయిన్ సినిమా తారలకు మించిన పాపులారిటీ సంపాదించింది కాబట్టి… ఆ సీరియల్ పేరు కార్తీకదీపం… మీరు చదివింది నిజమే… ఆ సీరియల్ ముగిసిపోతోంది… అదీ అధికారికంగా మాటీవీ ప్రకటించిందే…
మాటీవీ విడుదల చేసిన ఓ ప్రోమోలో హీరో నిరుపమ్, హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్ మాట్లాడుతూ ‘‘కార్తీకదీపం’ మీకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఇచ్చింది.. మీ గుండెల్లో చోటుని కల్పించింది. ప్రతి గొప్ప కథకి ఓ ముగింపు ఉంటంది, మీకు నచ్చే అద్భుతమైన క్లైమాక్స్‌తో ముందుకు రాబోతోంది’’ అని చెబుతూనే ఈ స్థానంలో రాబోయే బ్రహ్మముడి అనే సీరియల్‌కు భలే లాంచింగ్ ప్రకటన చేశారు… ఈ కొత్త సీరియల్ ప్రోమోలు కొద్దిరోజులుగా కనిపిస్తూనే ఉన్నాయి….
ఐతే మొదట్లో అందరూ ఇష్టపడిన ఈ సీరియల్‌లో నిర్మాత, దర్శకులు పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేశారు… తన బిడ్డకు మంచి సంబంధం వస్తుందనే భావనతో దీప తండ్రి కార్తీక్‌కు పిల్లలు పుట్టరనే సంగతిని దాచిపెడతాడు… అక్కడ కథ ఆరంభం… ఆ పాయింట్ చుట్టూ ఇన్నేళ్లు నడిపారు… కార్తీక్‌ను ప్రేమించిన మోనిత అనే డాక్టర్ దీప మీద కార్తీక్‌కు అనేక సందేహాలు పుట్టేలా చేస్తుంది… అసలు తనకు పిల్లలే పుట్టరు కదా, మరి దీపకు ఇద్దరు కవలలు ఎలా పుట్టారు..? ఎవరితోనే అక్రమ సంతానం పొందింది అని కార్తీక్ సందేహం…
Ads
ఇక కథను ఇష్టమొచ్చినట్టు మలుపులు తిప్పారు… ఒక దశలో లీడ్ పెయిర్ కార్తీక్, దీపలను కూడా చంపేశారు కథలో… సెకండ్ జనరేషన్ కథ కొనసాగుతుంది అని ప్రకటించారు… ప్రేమీ విశ్వనాథ్ లేని సీరియల్ ఎవడు చూస్తాడోయ్ అనుకున్న ప్రేక్షకులు చూడటం మానేశారు… ఆ దెబ్బకు రేటింగులు బేర్‌మన్నాయి… ఏం చేయాలో అర్థంగాక దర్శకుడు మరణించిన పాత్రల్ని మార్చురీ నుంచి లాక్కొచ్చి, పాత కథే చూపించడం మొదలు పెట్టాడు… ఐనా ఒక్కసారి ఫ్లో దెబ్బతిన్నాక, సీరియల్ మీద మంచి అభిప్రాయం పోయాక అది అంతే… ఒకప్పుడు 18, 19 దాకా జీఆర్పీలు తెచ్చిన కార్తీకదీపం ఇక ఎంత లేపినా సరే 10, 11 దాటలేదు…
సీరియల్‌లో ప్రేమీ విశ్వనాథ్‌కు దీటుగా మంచి పేరు సంపాదించుకున్న మోనిత అలియాస్ శోభా శెట్టి పాత్రతో కూడా దర్శకుడు ఆడుకున్నాడు… అదీ సీరియల్‌కు మైనస్ పాయింటే… సరే, ఎలాగైతేనేం, ఇంకా ఏవేవో ప్రయోగాలు చేసీ చేసీ, ఇక ఈ సీరియల్ వట్టిపోయిందని గ్రహించిన నిర్మాత ఎండ్ కార్డ్ వేద్దామని నిర్ణయం తీసుకున్నాడు… మాటీవీ కదా, దాని స్థానంలో మరో సీరియల్‌ను మేనేజ్ చేసి, ఫస్ట్ ప్లేసుకు తెచ్చుకుంటుంది… ఇప్పుడు కొన్నాళ్లు చర్చ ఏమిటంటే..? ప్రోమోలో ఓ హింట్ ఇచ్చి చూపించినట్టుగా దీప పాత్రను చంపేస్తారా..? అదేనా గొప్ప క్లైమాక్స్… అలాంటప్పుడు ఇన్నేళ్ల దీప పోరాటానికి సార్థకత ఏమున్నట్టు..? అది ప్రేక్షకులకు నచ్చని ముగింపు అవుతుంది… నచ్చే ముగింపు అంటే దీప, కార్తీక్ కలవాలి, ఎలా కలుపుతాడనేది దర్శకుడి తలనొప్పి…
ఈ సీరియల్‌లో మొదట్లో బ్లాకీగా చూపించిన హీరోయిన్ కలర్ క్రమేపీ మెరుగుపడటం ఓ అసంతృప్తికారకం కాగా… అసలు సీరియల్ కథలు అంటేనే అత్తల దాష్టీకాలు, అకృత్యాలు కదా, ఈ సీరియల్ లో మాత్రం అత్త పాత్ర సౌందర్య అడుగడుగునా కోడలికి అండగా ఉంటుంది… అదీ కథలో బ్యూటీ… కనీసం ఆ బ్రహ్మముడి సీరియలైనా కాస్త పాజిటివ్ అప్రోచ్‌తో, భిన్నంగా నడపండర్రా… ఈ క్షుద్ర అత్తాకోడళ్ల పంచాయితీలు గాకుండా…!!
Share this Article