కరోనా పిలుస్తోంది! కదిలి రండి థియేటర్లకు!!
————————
కొన్ని దృశ్యాలు, కొన్ని సంఘటనలు మనలో కొత్త చైతన్యాన్ని, ఉత్సాహాన్ని కల్గిస్తాయి. జీవితం మీద ఆశను చిగురింపజేస్తాయి. సినిమా పెద్దలు ప్రభుత్వ పెద్దలను కలవడం; ప్రభుత్వ పెద్దలు సినిమా పెద్దల ఇళ్లకు వెళ్లడం, శీతాకాలంలో ముంచుకొస్తున్న కరోనా సెకండ్ వేవ్ వేళ థియేటర్లు తెరవడం మీద వరుస మీటింగులు పెట్టుకోవడం, బతకడానికి అవసరమయిన ప్రాణవాయువుకంటే అధికమయిన థియేటర్లను ఇక తెరుచుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతించడం దానికదిగా జరిగిపోయిన మామూలు విషయం కాదు. దీని వెనుక సినిమా పెద్దల నిరంతర కృషి, పట్టుదల, లాబీయింగ్, వ్యాపార దక్షత, ఎత్తుగడ… ఎన్నో ఉన్నాయి. కరోనా తగ్గనప్పుడు థియేటర్లు తెరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఎందుకు నెత్తి మీద వేసుకున్నాయి అన్నది అర్థం లేని ప్రశ్న. మనమే ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి మన క్షేమం కోరే థియేటర్లను తెరుస్తున్నాయని అందులో అంతరార్థాన్ని మనం వెతికి పట్టుకోవాలి.
Ads
సినిమా షూటింగులు ఆగిపోయి వేల మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారికి వెంటనే పట్టెడన్నం పెట్టాలన్న ఒకే ఒక ఉద్దేశంతో సినీ పెద్దలు షూటింగులు మొదలు పెట్టారు తప్ప- ఇందులో మరో చెడు ఉద్దేశాన్ని మనం వెతకకూడదు. సంవత్సరమయినా కరోనా తగ్గలేదు. మరో సంవత్సరానికయినా తగ్గుతుందన్న గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు రోజూ అలవాటుగా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు పిచ్చివారయిపోతే అది మరీ ప్రమాదం కాబట్టి- వెంటనే థియేటర్లను తెరిపించాల్సివస్తోంది తప్ప ఇందులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. లాక్ డౌన్, గృహనిర్బంధంలో గృహ హింస బాగా పెరిగింది. ఇలాగే కొనసాగితే ప్రతి ఇల్లూ భగభగ మండుతూ, ఆ మంటల్లో మాడి మసైపోతుంది. ఆ గృహ హింస అగ్నిజ్వాలలనుండి జనాన్ని రక్షించడానికి వెంటనే థియేటర్లను తెరిపించాల్సివస్తోంది తప్ప ఇందులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. వచ్చే కరోనా ఎలా అయినా వస్తుంది. అదే మనమే థియేటర్లు, మాళ్లు, బజార్లమీద పడి కరోనాకు ఎదురు వెళితే- అది భయపడి పారిపోవచ్చన్న పాజిటివ్ వేదాంత ధోరణే తప్ప ఇందులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. కరోనాకు భయపడి, బాధపడి, ఇంట్లో దాక్కునే దశ దాటించాలనే సదుద్దేశమే తప్ప ఇందులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు.
చదువులు చెప్పే స్కూళ్లు, కాలేజీలు మూతపడితే పెద్ద నష్టమేమీ ఉండదు. రాయాల్సిన పరీక్షలు, జరగాల్సిన ఇంటర్వ్యూలు ఆగిపోతే ప్రాణాలేమీ పోవు. కానీ థియేటర్లు తెరవకపోతే ప్రేక్షకుల ఊపిరి ఆగిపోతుంది. అరవైల్లో పక్కన ఇరవై వయసు హీరోయిన్లతో ఇకపై ఓన్లీ యూ అండ్ మీ అని తెలుగు హీరో ఇంగ్లీషులో పాడే తెలుగు సినిమాలను చూడకపోతే- నిజంగానే ప్రేక్షకుల పైప్రాణాలు పైనే పోతాయి.
“ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే…
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే
ఇంకా తెలవారదేమి?
ఈ థియేటర్లు తెరవరేమి?”
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article