అంతటి కేసీయార్‌కూ తప్పడం లేదు… దుబ్బాక సెగ హైదరాబాద్‌కూ తగులుతోంది మరి… లేకపోతే ‘హిందుగాళ్లు, బొందుగాళ్లు, ఈ రామజన్మభూమి ఏందివయా, రావణజన్మభూమి, శూర్ఫణఖ జన్మభూమి’ అని లోకసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మీద ఎకసక్కేలు ఆడిన అదే కేసీయార్ ఇప్పుడు తనూ… అయ్యో, మా రాముడి మాటేమిటి, మీకు అయోధ్య రాముడు తప్ప మా తెలంగాణ రాముడు పట్టడా, నేనే ప్యూర్ రామభక్తుడిని, మీరు నకిలీ రామభక్తులు అంటూ బీజేపీ మీద నిందాగీతం జోరుగా అందుకున్నాడు… అందుకోవాల్సి వచ్చింది… అందుకోకతప్పలేదు… అందుకోవాల్సిందే…
టీఆర్ఎస్ మజ్లిస్ చెప్పుచేతల్లో ఉన్న పార్టీ అనే భావన హైదరాబాద్‌లో విపరీతంగా ఉంది… పెరిగింది… పెరుగుతూనే ఉన్నది… సరిగ్గా ఆ పాయింటే పట్టుకుని బీజేపీ గోదావరి ఈదుతోంది… గ్రేటర్ ఎన్నికల్లో మతం ప్రధానాంశంగా మారింది… హిందూ వోటర్లలో చర్చ మొదలైంది… దాంతో మాకు మజ్లిస్‌తో పొత్తు లేదు మొర్రో, మా కేసీయారే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హిందువు దేవుడోయ్, అసలు భక్తులమంటే మేమే రాముడోయ్ అని చెప్పుకోవడానికి నానాపాట్లూ పడుతోంది… ఈరోజు నమస్తే తెలంగాణ పత్రిక పబ్లిష్ చేసిన భారీ బ్యానర్, 2, 3 పేజీల బాధాతప్త కథనాలు ఈ నిజాన్ని చెబుతున్నవే…
Ads
ఈ కథనం ఏమంటున్నదీ అంటే..? మీరు పోలవరం ఎత్తు పెంచుతున్నారు, దాంతో మా భద్రాద్రి మునిగిపోతుంది, మీరు అయోధ్య రాముడికి గుడి కడతారు, మా భద్రాద్రి రాముడి గుడిని ముంచేస్తారు… ఏయ్ మోడీ జవాబు చెప్పు… చెప్పాకే వోట్లు అడగండి… రామద్రోహులు మీరు… రాముడు శపిస్తాడు…
బీజేపీ ఫిక్స్ చేస్తున్న ఎజెంటా ట్రాప్‌లోకి టీఆర్ఎస్ ప్రవేశించిందని మనం చెప్పుకున్నాం కదా… ఇదుగో ఇలాగే అన్నమాట… వద్దూవద్దంటూనే తను కూడా మతం చుట్టూ తిరగకతప్పడం లేదు… ఇక అసలు కథ ఓసారి చర్చిద్దాం…
- పోలవరం ఎత్తు పెంపు అనేది చంద్రబాబు నిర్ణయం… వెయ్యేళ్ల గరిష్ట వరదను అంచనా వేశారట, దాంతో పెంచేశాడట… తనను కేసీయార్ క్యాంపు ఒక్క మాటా అడగడం లేదు…
- ఎత్తు తగ్గించేసి, ఏదో ప్రాజెక్టును మమ అనిపించేయాలని జగన్ అనుకుంటున్నాడని టీడీపీ క్యాంప్ ఆరోపణ… నో, నో, ఎత్తు మిల్లీమీటర్ కూడా తగ్గించం, కాకపోతే దశలవారీగా మొత్తం ఎత్తు నిర్మిస్తాం అని దానికి వైసీపీ కౌంటర్… అసలు దానికి సరిపడా పైసలు ఎవరిస్తారు, ఎన్ని కావాలనే లెక్కల్లో ఏపీ రాజకీయాలు మునిగిపోయాయి…
- నిజమే, ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి మోడీని మాత్రమే నిందిద్దాం… నిలదీద్దాం… సరే, యాదాద్రికి 1000 కోట్లు పెట్టే ఈ ధర్మపాలకుడు భద్రాద్రికి ఏమిచ్చాడుట..? ఎన్ని కోట్లు ఇచ్చాడట..? భద్రాద్రి రాముడిని గాలికి వదిలేసింది ఎవరు..?
- జగన్, నేను జాన్ జిగ్రీ అని చెప్పే కేసీయార్ ఎప్పుడైనా ఈ భద్రాద్రి రాముడి గుడి గురించి జగన్‌తో చర్చించాడా..? ప్రాజెక్టు కట్టేది జగనే కదా… ఏయ్ జగనూ… జాగ్రత్త… నువ్వుండేది హైదరాబాదులోనే, యాదికి ఉంచుకో, మా రాముడి ఉసురు తగులుతుంది అని గట్టిగా హెచ్చరిక చేశాడా..?
- ఎత్తు పెంపుకి ప్రత్యామ్నాయం ఉందా..? ఎలా..? కాళేశ్వరంలాగే మూడునాలుగు బ్యారేజీలు కట్టేసి, మేఘ లిఫ్టులు పెట్టేసి, ఎత్తిపోసుకోవాలా..? భద్రాద్రి చుట్టూ ఓ కరకట్ట చాలదా..?
- ఏతావాతా సమజైపోయేది ఏమిటంటే..? అంతటి తానీషా సైతం రాముడికి భయపడి, రామదాసుకు విడుదల చేసి, ఏటా రాముడి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపించాడు… రాముడు ఎప్పుడూ రాజకీయంగా పవర్ ఫుల్లే… అంతటి కేసీయారే ఈ గ్రేటర్ పరీక్ష గట్టెక్కించాలని ఆ రాముడిని స్మరించుకోతప్పడం లేదు… ఏమో, రేపు రేపు మమత బెనర్జీ వంటి హార్డ్‌కోర్ యాంటీ హిందుత్వ మాతలు సైతం రామభజనకు దిగినా హాశ్చర్యపడనక్కర్లేదేమో…
Share this Article