తిరుమల… అక్కడ రైల్వే స్టేషన్‌లోనో, బస్ స్టాండులోనో దిగింది మొదలు… మళ్లీ తిరుగు ప్రయాణం వరకు… ప్రతి అడుగులోనూ దోపిడీ కనిపిస్తుంది… ప్రైవేటు వ్యాపారులే కాదు, సాక్షాత్తూ తిరుమల-తిరుపతి దేవస్థానం కూడా తక్కువేమీ కాదు… భక్తుడిని ఎన్నిరకాలుగా పిండాలో బ్రహ్మాండంగా తెలుసు దానికి… అఫ్ కోర్స్, ఏ గుడి దగ్గరైనా అంతే… తీర్థయాత్ర అంటేనే జేబులు ఖాళీ చేసుకోవడం… కానీ అత్యంత ధనికుడైన వెంకటేశ్వరస్వామి సన్నిధిలోనైనా కక్కుర్తి వ్యవహారాలు అవసరమా..? ఎక్కడెక్కడి నుంచో వ్యయప్రయాసలకోర్చి, స్వామి మీద అపరిమితమైన భక్తితో వచ్చే వాళ్లకు ఓ ప్రశాంత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని టీటీడీ ఎప్పుడూ అందించలేదు, ఇకపైనా అందించదు… ఆ ట్రస్టు బోర్డు ఓ రాజకీయ పంకిలం… దాని గురించి చెప్పుకోవడమే దండుగ… ఇదంతా ఎందుకంటే..? తిరుమలలో నిత్యాన్నసత్రం ఉంది… కులాలవారీ సత్రాలు కాదు, ఆ దేవుడి సొమ్ముతో నడిచేదే… ఆ భోజనం నాణ్యత గురించి చర్చ అనవసరం… తెలుగునాట అద్భుతమైన ఉచిత భోజనప్రసాదాన్ని అందించేది అంతర్వేదిలో మాత్రమే… తిరుమల వెంకన్న దగ్గర మరో అయిదారు వేల కోట్లు పోగుపడినా సరే, ఆ రేంజ్ భోజనం పెట్టదు, పెట్టలేదు… ఎందుకంటే..? అక్కడ పెత్తనాలు చేసే పెద్దలకు ఆ సంకల్పం ఉండదు, ఆవైపు ప్రయత్నమూ ఉండదు… వాళ్లకు భక్తుడు అంటే జస్ట్, ఆఫ్టరాల్…
నిజానికి కర్నాటకలో ఎంత చిన్న గుడైనా సరే, దాని ఆదాయానికి తగ్గట్టుగా ఉచిత భోజనాన్ని పెడుతుంది… ఇంత అన్నం, అందులోకి సాంబారు, చివరలో మజ్జిగ… అప్పుడప్పుడూ ఓ కూర… కానీ ఇతర రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం పెద్దగా కనిపించదు… తెలంగాణలో ఎక్కడా లేనట్టుంది… ఏపీలో అక్కడక్కడా… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… ఓ వార్త కనిపించింది… ఆ వార్త ఇదీ…
Ads
‘‘తిరుమలలో ప్రయోగాత్మకంగా సాంప్రదాయ భోజనం ప్రారంభం… శ్రీవారి భక్తుల కొరకు సాంప్రదాయ భోజనం ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవనంలో గురువారం ఉదయం ప్రారంభించారు… టీటీడీ ఇప్పటికే గోవిందునికి గో-ఆధారిత నైవేద్యం అందించడం కోసం, దేశీయ గోవుల సాయంతో పండించిన బియ్యం, పప్పు దినుసులు, బెల్లం, నెయ్యితో శ్రీవారికి అన్న ప్రసాదాల నైవేద్యం అందిస్తున్న విషయం తెలిసిందే… అదేవిధంగా దేశీయ వ్యవసాయంతో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అల్ఫాహారం, భోజనం ఎలాంటి ఆదాయం లేకుండా కాస్టు టు కాస్టుతో టిటిడి భక్తులకు అందించాలని సంకల్పించింది… సాంప్రదాయ భోజనంపై భక్తుల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని సెప్టెంబర్ 8వ తేదీ వరకు టిటిడి ప్రయోగాత్మకంగా నిర్వహించనుంది… గురువారం ఉదయం కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా తయారు చేసి అందించారు. మధ్యాహ్నం కొబ్బరి అన్నం, పులిహోర, పూర్ణాలు, పచ్చి పులుసు, దోసకాయ పప్పు తదితర 14 రకాల వంటకాలు చేశారు..’’
ఇదీ వార్త… టీటీడీ అధికారిక ప్రెస్‌నోట్ చెప్పిన విషయాలే… రోజూ వేల మందికి అన్నదానం చేసే టీటీడీ ఇప్పుడు ఈ సాంప్రదాయ భోజనానికి రేటు పెట్టబోతున్నదీ అన్నమాట… కాస్టు టు కాస్టు అట… అంటే రోజువారీ సగటు భోజనానికి ఎంత ఖర్చవుతుందో లెక్కేసి, ఈ రేటు వసూలు చేస్తుందన్నమాట… ఎందుకు ఉచితంగా ఈ విశిష్ట భోజనం పెట్టకూడదు..? అనేకానేక ఆధ్యాత్మికేతర అంశాలకు, సర్కారీ పనులకు, వెంకన్నేతర కార్యక్రమాలకు వందల కోట్లను ఖర్చు చేసే టీటీడీ తిరుమలకు వచ్చే భక్తుడికి కాస్త తిండిని ఉచితంగా పెట్టలేదా..? అదీ అసలు ప్రశ్న… చివరకు సగటు భక్తుడు శ్రీవారి ప్రసాదంలా భావించి, భుజించే అన్నానికి కూడా డబ్బు వసూలు చేయాలా..? మెజారిటీ భక్తులు బయట హోటళ్లలో తినలేక, గతిలేక కాదు… అన్నసత్రంలో పెట్టే భోజనాన్ని కూడా ప్రసాదంలా భావిస్తాడు… మెల్లిమెల్లిగా సాంప్రదాయ భోజనం పేరిట రేట్లు, కూపన్లు, టికెట్లు, వసూళ్లు ప్రారంభిస్తారా..? అందరికీ ఈ సాంప్రదాయ భోజనం పెట్టలేం, సాధ్యం కాదు అంటారేమో… పోనీ, విశేషపూజల పేరిట దండుకుంటున్నారు కదా, కనీసం ఆ భక్తులకైనా ఈ సాంప్రదాయ వంటకాల్ని ఉచితంగా పెట్టండి… అంతేతప్ప, ఆ రిచ్చెస్ట్ దేవుడి గుడిలో మరీ అన్నం కూడా అమ్మకండిరా నాయనలారా…!! దేవుడా… ఎలాంటి భృత్యగణం దొరికింది స్వామీ నీకు… ఒక్కసారి వాళ్ల మెదళ్లను కాస్త ప్రక్షాళన చేసి స్వర్ణదేవాలయానికి వెళ్లి రమ్మను స్వామీ…!! అప్పుడైనా గుడికీ, హోటల్‌కీ తేడా తెలుస్తుంది ఈ బోనసాయ్ మెదళ్లకు..!!
Share this Article