కమ్యూనిజం అనేది చాలా సులభమైన, శక్తివంతమైన ఒక సిద్ధాంతం. ఇది ఆవిర్భవించిన నాటి నుంచి, దాని ఆశయాల సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరులు, నిజాయతీగల వ్యక్తులు, మరియు నిగూఢమైన మేధావుల వర్గం ఉంది. మరియూ, గత 150 ఏళ్లలో కార్ల్ మార్క్స్ మరియు ఆయన సిద్ధాంతం అనేక ఉద్యమాలకు పరోక్షంగా ప్రేరణనిచ్చాయి. ఈ ఉద్యమాలు సమాజంలో కొంతవరకు న్యాయబద్ధమైన మార్పులు తీసుకురావడంలో ప్రభావం చూపాయి, దాంతో కొందరు శ్రామిక వర్గాలకు కొంత మేలు జరిగింది.
కానీ, కమ్యూనిజం పేరుతో, కమ్యూనిస్ట్ పేరుతో – కొందరు రకరకాల పదాలు వాడి క్లిష్టతరం చేస్తూ తమ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. మరికొందరు క్రిమినల్ మనస్తత్వం కలిగినవారు, లేదా ప్రజల బలహీనతలను దోచుకునే నైజం కలిగినవారు, ప్రజల విభేదాలను తమ స్వలాభం కోసం వాడుకొని భారీ సంపదను కూడగట్టారు. అలాగే, ఇంకొందరు తెలివితక్కువ వారు, చేతకాని వాళ్ళు కమ్యూనిజం లోని కొన్ని పదాలని వాడుతూ మేధావి వర్గంగా చలామణి అయ్యారు/ అవుతున్నారు.
కొందరు సౌమ్యంగా కనిపిస్తూ వర్గ విభేదాలను ప్రేరేపించి ఆ మంటల్లో చలి కాసుకుంటూ అధికారం, సంపదను సొంతం చేసుకున్నారు. కమ్యూనిస్ట్ ముసుగులో మన రాష్ట్రం, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఈ ధోరణి
Ads
నిజానికి సమ సమాజ స్థాపన కమ్యూనిజం కాదు. ఒక నూతన సమాజ స్థాపన కమ్యూనిజం ఆశయం. రెండిటికీ తేడా ఉంది. ఆ నూతన సమాజంలో ఆర్ధిక పరమైన, సామాజిక పరమైన, వర్గ పరమైన తేడాలు ఉండకూడదు. ఈ మూడు ప్రధాన అంశాలు. కమ్యూనిస్ అనే లాటిన్ పదం నుంచి Communism అనే పదం వచ్చింది. మానవ జీవన గమనాన్ని మార్చటానికి 19 వ శతాబ్దం చివర్లో వచ్చిన సిద్దాంతం కమ్యూనిజం. ఇది ఒక ఆర్ధిక, రాజకీయ, సాంఘీక పరమైన సిద్దాంతం.
ఒక మాటలో చెప్పాలంటే, ఆర్థిక పునాదులే సమాజంలోని రాజకీయ స్థితిగతులను నిర్దారించడంతో పాటు వర్గాలను సృష్టిస్తాయి కాబట్టి “వనరుల ఉమ్మడి యాజమాన్యం” ఉంటే ఎటువంటి తారతమ్యాలు ఉండవు; ఇదే ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజం సిద్దాంతం, అదే కమ్యూనిజం.
ఉదాహరణకి ఒక గ్రామంలో 1000 ఎకరాల భూమి ఉండి, 100 కుటుంబాలు ఉంటే, కొందరి పేరు మీద 100 ఎకరాలు, మరికొందరి పేరు మీద 2 ఎకరాలు, మరికొందరి వద్ద ఏ భూమీ లేకుండా ఉండకూడదు. ఆ భూమి ఉమ్మడిగా ఉండి, అందరూ కలిసి పనిచేసి వచ్చిన ఫలితాన్ని సమానంగా పంచుకోవాలి. యజమాని వర్గం, శ్రామిక వర్గం ఉండకూడదు, ఆ ఊర్లో ఆర్ధిక బేధాలు ఉండకూడదు. ఆర్ధికంగా అందరూ సమానంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికీ రాజకీయంలో సమాన అవకాశాలు ఉంటై అన్నది కమ్యూనిజం సిద్దాంతం.
అయితే పెట్టుబడీదారీ విధానం లేదు, టెక్నాలజీ లేదు, కంపనీలు లేవు, పరిశ్రమలు లేవు అనుకుందాం. ఒకప్పటిలాగా ఇప్పుడు అందరూ గోధుమలు, బంగాళా దుంపలు మాత్రమే తిని బతకట్లేదు కదా. ఒక ఊరిలో 100 మంది ఉంటే, వారిలో ప్రతి ఒక్కరి ఆహారపు అభిరుచులు వేర్వేరుగా ఉంటాయి – ఒకరు చిక్కుడు కాయ అంటారు, ఇంకొకరు బీరకాయ, ఇంకొకరు పొట్ల కాయ, క్యారెట్ , తోటకూర, చికెన్, మటన్, గోంగూర, కాకరకాయ, చేపలు, రొయ్యలు అలా వంద రకాలుగా ఇష్టపడతారు.
మరి ఉన్న ఉమ్మడి భూమిలో ఏ పంట పండించాలి? ఏ జంతువులను పెంచాలి? సరే, భూమి మాత్రం ఉమ్మడిగా ఉంచి ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పండించుకుంటారు అనుకుందాం. సొరకాయ పండించుకునేవాళ్ళ కంటే చేపల చెరువు వేసిన వారికి ఎక్కువ లాభాలు వచ్చి, వాళ్ళు ఆర్థికంగా బలంగా నిలిచి, చివరికి రాజకీయాధిపత్యం కూడా సాధించే అవకాశముంది. ఇది వనరుల సమాన పంపిణీ ఉన్నా, ఆర్థిక అసమానతలు మళ్లీ ఉద్భవించే ప్రమాదాన్ని సూచిస్తుంది.
అందుకే, వినటానికి మరియు చదవటానికి ఆకర్షణీయంగా ఉన్నా, కమ్యూనిజం అనేది అమలులో సంపూర్ణంగా సాధ్యం కాని సిద్ధాంతం. మనిషి సహజసిద్ధంగా సంఘజీవి అయినప్పటికీ, అతనిలో స్వేచ్ఛాప్రియత కూడా ఉంది. ఉదాహరణకు, ఒక ఊరిలోని 100 కుటుంబాలకు ఒక్కొక్కరికి 100 కోట్లు ఇచ్చి, వారిని ఆర్థికంగా సమానంగా ఉంచి, యజమాని వర్గం మరియు శ్రామిక వర్గం లేకుండా చేసినా, కొత్త తేడాలు తప్పక ఏర్పడతాయి. నలుపు-తెలుపు, పొడుగు-పొట్టి, ఆడ-మగ, పెద్ద-చిన్న, తెలివైనవారు-తక్కువ తెలివి ఉన్నవారు వంటి తేడాలు ఆవిరి కావు. తారతమ్యాలు, విభేదాలు మనిషి సహజ లక్షణాలు, అవి లేని నూతన సమాజ స్థాపన ఇంకెలా జరుగుతుంది..?
పోనీ ప్రతి ఒక్కరి ఖాతాలో కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే ఉంచి, మిగతా మొత్తం ఉమ్మడి ఖాతాలో వేసినప్పటికీ, మొద్దుబారిపోతూ, పని చేయకుండా బద్ధకంగా ఉండే అవకాశం ఎక్కువే. వెనెజులాలో జరిగిన పరిణామాలు మనందరం చూశాం. ఉత్ప్రేరణ లేకుండా పని ఎలా జరుగుతుంది? ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? మనుషులలో సహజమైన ఉత్సాహం లేదా ఉత్ప్రేరక శక్తి ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనాలు మరియు పరస్పర పోటీ పై ఆధారపడింది.
పని ఫలితానికి గుర్తింపు, ప్రతిఫలం ఉండకపోతే, వ్యక్తులు తమ ఉత్పాదకతను తగ్గించుకోవడం సహజం. ఆర్థిక తేడాలు లేకపోతే ఉమ్మడిగా చేయాల్సిన పరిస్థితుల్లో, పనిచేయాలన్న ఉత్సాహం తగ్గిపోతుంది అనేది నిజం.
అందుకే ఈ 150 ఏళ్లలో నిజమైన కమ్యూనిజం ఆధారంగా ఎక్కడా ప్రభుత్వం స్థాపితం కాలేదు. 19వ శతాబ్దంలో కమ్యూనిజం సిద్ధాంతం రాకపోయినా, 20వ శతాబ్దంలో మొట్టమొదటిగా రష్యాలో లెనిన్ కమ్యూనిజం ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. కానీ లెనిన్ పాలన పూర్తిగా నియంత్రిత ప్రభుత్వ విధానం (టోటాలిటేరియన్ పాలన)గా మారింది. కమ్యూనిజం సిద్ధాంతాన్ని తన స్వంత అభిప్రాయాలతో మార్చి “లెనినిజం” అనే కొత్త శైలిని ప్రవేశపెట్టాడు.
లెనిన్ ప్రారంభంలో సామ్రాజ్యవాదాన్ని అంతమొందిద్దాం అనే సంకల్పంతో బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలతో కలిసి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీలపై మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. అయితే, యుద్ధం మద్యలోనే తప్పుకున్నాడు. చివరికి, తన వైపు నుంచి యుద్ధం చేసిన బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీతో కలిసి అమెరికా ఒక సమాఖ్య కూటమిని ఏర్పరచింది ఈ కూటమి, లెనిన్ ఆశయాలకు విరుద్ధంగా, సామ్రాజ్యవాదాన్ని మరింత బలపరచి, పెంపొందించడానికి దోహదం చేసింది.
ఈ విధంగా, లెనిన్ పాలన కమ్యూనిజం సిద్ధాంతానికి అనుసరిస్తూ కనిపించినప్పటికీ, నిజమైన కమ్యూనిజం ఆశయాలను దారి మళ్లిస్తూ, స్వీయవ్యాఖ్యనాలతో లెనినిజాన్ని స్థాపించి, సామ్రాజ్యవాదాన్ని కొత్తగా ప్రోత్సహించే దిశలో అడుగులు వేసింది.
నిజానికి, కార్ల్ మార్క్స్ తన మార్క్సిజం సిద్ధాంతం ఆధారంగా బ్రిటన్, జర్మనీ, లేదా ఫ్రాన్స్‌లలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఏర్పడతాయని ఆశించాడు. ఎందుకంటే, మార్క్స్ విశ్వాసం ప్రకారం, ఈ దేశాలు పెట్టుబడిదారీ విధానంలో ఉన్న వికాసం కారణంగా సమాజం ప్రోలెటేరియట్ విప్లవం కోసం సిద్ధంగా ఉండేదిగా కనిపించాయి. కానీ, ఆశ్చర్యకరంగా, అక్కడ పెట్టుబడిదారీ విధానం మరింత బలపడగా, వ్యవసాయ ఆధారిత రష్యాలో మాత్రం మార్క్సిజం ఆధారిత ప్రభుత్వం ఏర్పడింది.
లెనిన్ రష్యాలో మార్క్సిజాన్ని తన స్వంత అభిప్రాయాలతో లెనినిజంగా మార్చి అమలు చేయగా, ఆయన తర్వాత స్టాలిన్ ఆ మార్గాన్నే మరింత నియంత్రణాత్మక పాలనగా మార్చాడు. అదే సమయంలో, చైనాలో మావో జెదాంగ్ కూడా నిజమైన కమ్యూనిజం ఆశయాలకు విరుద్ధంగా తనదైన నియంత్రిత పాలనను స్థాపించాడు.
మార్క్సిజంలో వర్గ పోరాటం కేంద్ర బిందువుగా ఉంటుంది – ఇది సామాజిక అసమానతలను తొలగించి సమసమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఉంచుతుంది. కానీ లెనిన్, స్టాలిన్, మరియు మావో మాత్రం ఆ సిద్ధాంతాన్ని అమలు చేసే పేరుతో నియంతృత్వ పాలనలను అమలు చేశారు. దీని ఫలితంగా, ఈ నాయకులు కమ్యూనిజం పేరు తీసుకొచ్చినా, వారి పాలన వ్యక్తిగత అధికార దాహంతో నడిచిన నియంతృత్వాలకు మళ్లింది. ఇవి మార్క్సిజంలో ఉద్దేశించిన సమతా సమాజానికి విరుద్ధంగా, నియంత్రణ, బలవంతపు మార్పులు, మరియు వ్యక్తిగత శక్తి కేంద్రీకరణను పెంచాయి.
ప్రస్తుత ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్న దేశాలు కేవలం 5 మాత్రమే: చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా, మరియు లావోస్.
ప్రపంచంలో చైనాను మించిన పెట్టుబడిదారీ దేశం మరొకటి లేదు, కాబట్టి చైనాలో అమలవుతున్నది కమ్యూనిజం కాదనే చెప్పవచ్చు. నిజమైన కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం, ప్రైవేట్ వ్యాపారాలు, యజమాని వర్గం, మరియు శ్రామిక వర్గం ఉండకూడదు. అలాగే, రాజకీయంగా అందరికీ సమాన అవకాశాలు, సామాజిక మరియు రాజకీయ అసమానతలు ఉండకూడదు.
చైనా మాత్రమే కాదు, క్యూబా, ఉత్తర కొరియా, మరియు వియత్నాం కూడా నిజమైన కమ్యూనిజాన్ని పాటించట్లేదు. కమ్యూనిజం సిద్ధాంతంలోని మూడు ప్రధాన మూలకాలు – ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, మరియు వర్గాల రహిత సమాజం – ఈ దేశాల్లో కనిపించట్లేదు. ఈ దేశాల్లో ఆర్థిక, సామాజిక, మరియు వర్గ భేదాలు బలంగా కొనసాగుతున్నాయి. అందువల్ల, ఈ దేశాలు కమ్యూనిజం పేరు మాత్రమే మోస్తున్నాయి కానీ, వాస్తవానికి అవి మార్క్సిజం లేదా కమ్యూనిస్టు సిద్ధాంతానికి పూర్తి గా విరుద్ధంగా నడుస్తున్నాయి.
నా ఉద్దేశ్యం ప్రకారం, సిసలైన కమ్యూనిజం సిద్ధాంతంలోని కొన్ని అంశాలు అమెరికా మరియు మరికొన్ని పెట్టుబడిదారీ దేశాల్లో కొద్దో గొప్పో అమల్లో ఉన్నాయి.
కమ్యూనిజం కోర్ సిద్ధాంతం ప్రకారం ఉమ్మడి యాజమాన్యం ఉండాలి మరియు యజమాని వర్గం, శ్రామిక వర్గం ఉండకూడదు. కానీ, అమెరికాలో ఈ రెండు వర్గాలు ఉన్నప్పటికీ, సమాజంలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు కమ్యూనిజం ఆశయాలకు దగ్గరగా ఉంటాయి:
1. సామాజిక అసమానతలు తక్కువ
2. ఆర్థిక అసమానతలు తక్కువ
3. రాజకీయ అసమానతలు తక్కువ
అమెరికాలో ఎక్కువమంది యొక్క జీవన ప్రమాణాలు (లివింగ్ స్టాండర్డ్స్) ఒకేలా ఉంటాయి. చెప్పుల దుకాణంలో పనిచేసేవారు, బార్బర్ షాప్‌లో పని చేసే వారు, మరియు చట్ట సభల్లో పనిచేసేవారికి దాదాపు సమాన సదుపాయాలు, అవకాశాలు, మరియు న్యాయం అందుబాటులో ఉంటాయి.
అమెరికాలో సగటు వేతనం $60,000 నుంచి $90,000 వరకు ఉంటుంది. కొంతమంది 2-5 % ధనికులు మినహాయిస్తే, మిగతా 95-98% జనాభా జీవన ప్రమాణాలలో తేడా లేకుండా దాదాపు 99% ప్రజలు ఒకేలా ఉంటారు.
దీని వల్ల, ఆర్థిక సమానత్వం పూర్తిగా లేకపోయినా, అమెరికా వంటి పెట్టుబడిదారీ దేశాలు కొంతమేర సమాజంలో సమాన అవకాశాలు కల్పిస్తూ, కమ్యూనిజం సిద్ధాంతంలోని కొన్ని లక్ష్యాలకు దగ్గరగా ఉంటాయి.
కార్ల్ మార్క్స్ ఇప్పుడు బతికి ఉంటే అతను కలలు కన్న సామాజిక అసమానతలు లేని, ఆర్ధిక అసమానతలు లేని, రాజకీయ అసమానతలు లేని విధానం ప్రాక్టికల్ గా పెట్టుబడీదారీ దేశాల్లో చూస్తున్నందుకు సంతోషపడేవాడు. ఇంకా, తాను ప్రతిపాదించిన “వర్గ పోరాటం” అనే భావనను వక్రీకరించి, వర్గాల మధ్య విభేదాలు, గొడవలు రేపుతూ, వందల, వేల కోట్లు సంపాదిస్తున్నవారి పట్ల సిగ్గుపడేవాడు. అదేవిధంగా, తెలివితక్కువ వ్యక్తులు తన సిద్ధాంతంలోని కొన్ని పదాలను వక్రీకరించి తాము మేధావులుగా చలామణి అవటం చూసి ఆయన నిరాశ పడేవాడు.
వర్గాలు, కొన్ని రూపాల్లో, ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. కానీ, ఆర్థిక మరియు సామాజిక అసమానతలు ఈ రోజు కాకపోతే రేపు లేదా భవిష్యత్తులో దాదాపు పోవాల్సిన అవసరం ఉంది. మార్క్స్ కలలు కన్న సమాజం – ఆర్థిక, సామాజిక అసమానతలు లేని నూతన సమాజం – ఒక రోజు ఖచ్చితంగా స్థాపితం అవుతుంది. మార్పు సమయం పట్టినా, మార్క్సిజం యొక్క చివరి లక్ష్యం – సమానతతో కూడిన సమాజం – అమలు కాని కలగానే మిగలదు; అది ఒకరోజు వాస్తవంగా నిజం అవుతుంది.
అయినా, కార్ల్ మార్క్స్ 1818లో జర్మనీలో పుట్టినప్పటికీ, అతని కంటే ముందు, 1744లో ఫ్రాన్స్‌లో పుట్టిన జువాలజిస్ట్ లామార్క్ తన జీవ పరిణామ సిద్ధాంతం (లామార్కిజం)ని ప్రతిపాదించాడు. ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ ఈ సిద్ధాంతాన్ని అమోదించారు. ఇంకా, కార్ల్ మార్క్స్ కంటే ముందుగా, 1809లో బ్రిటన్‌లో పుట్టిన బయాలజిస్ట్ చార్లెస్ డార్విన్ తన జీవ పరిణామ సిద్ధాంతం (డార్వినిజం)ని ప్రతిపాదించాడు, దీన్ని కూడా శాస్త్రవేత్తలు మరియు సైన్స్ ప్రపంచం పూర్తి గా ఆమోదించింది.
జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం, పర్యావరణ మార్పులకు అనుగుణంగా మారలేని జాతులు త్వరగా వినాశనానికి గురి అవుతాయి. వైవిధ్యం అనేది సహజమైనదే మరియు ప్రతి వ్యక్తిలోని లక్షణాల్లో తేడాలను సూచిస్తుంది. జీవుల మనుగడ కోసం వైవిధ్యం ఎంతగానో అవసరం, ఎందుకంటే వైవిధ్యాలపై ఆధారపడి ఉన్న లక్షణాలు భవిష్యత్ తరాలకూ చేరవేస్తాయి.
అందువల్ల, ఈ భూమిపై మనుషుల మనుగడకు కూడా వైవిధ్యం తప్పనిసరి. పర్యావరణ మార్పులను తట్టుకుని అభివృద్ధి చెందడానికి వైవిధ్యాలు కీలకమైనవి, ఎందుకంటే అవే మనుగడకు అవసరమైన సామర్థ్యాలని అందిస్తాయి. మార్పులకు అనుగుణంగా మనుగడ సాగించడంలో జీవవైవిధ్యం ఎంత ముఖ్యమో, అదే విధంగా సమాజంలో కూడా వివిధ అభిరుచులు, సామర్థ్యాలు, లక్షణాలు ఉంటాయి. ఇవే భవిష్యత్తులో వికాసానికి పునాదులు అవుతాయి.
అందుకే నేను అంటాను, వైవిధ్యం మరియూ వర్గ విభేధాలు ఉన్నప్పటికీ ఆర్ధిక పరమైన, సామాజిక పరమైన అసమానతలు లేని సమాజం ఖచ్చితంగా ఒకరోజు ఏర్పడుతుంది, అప్పుడు దానికి వినూత్నమైన కొత్తపేరు పెడదాం… – సామాన్యుడు జగన్నాథ్ గౌడ్ వ్యక్తిగత అభిప్రాయం…
Share this Article