.
ఎక్కడో చదివాను… నచ్చింది… ఎందుకంటే..? ఎన్నోసార్లు అనుకుని ఉంటాను… అతడు అనే సినిమాను స్టార్ మా చానెల్ ఇప్పటికి ఎన్నిసార్లు ప్రసారం చేసి ఉంటుంది అని…!
ఎప్పుడో 2005 లో వచ్చిన సినిమా… ఎప్పుడు ఆ చానెల్ ట్యూన్ చేసినా ఈ సినిమా కనిపిస్తూనే ఉంటుంది… ఇరవై ఏళ్లలో ఇప్పటికి 1500 సార్లు ప్రసారం చేశారట… వరల్డ్ రికార్డు… కాదు, ఇక ఆ రికార్డును ఎవరూ, ఏ సినిమా అందుకోలేదేమో…
Ads
నిజంగానే సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ రాదు, అదేమిటో… ఒక్క క్లైమాక్స్ ఫైట్ మాత్రం కాస్త లెంత్ ఎక్కువైంది తప్ప, ఇక మిగతా సినిమా అంతా ఇప్పటికే చూడబులే… ఆ కథ, ఆ ప్రజెంటేషన్… దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెరిట్ అంతా కనిపిస్తుంది…
యాక్షన్, కామెడీ, ఎమోషన్, పాలిటిక్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్… వాట్ నాట్..? అన్నీ సమపాళ్లలో రంగరించాడు దర్శకుడు… అన్ని సీన్లూ రక్తికట్టాయి… ఈ సినిమాకు మరో ప్రధానబలం డైలాగులు… త్రివిక్రమ్ అదరగొట్టేశాడు… అదనపు బలం త్రిష… ముగ్ధ… మహేశ్, తనకూ మధ్య మంచి కెమిస్ట్రీ…
నిజానికి అతడులాగే ఖలేజా కూడా టీవీల్లో అనేకసార్లు ప్రసారమైంది… ఆ కంటెంట్ కొందరికి నచ్చలేదేమో గానీ… ఈరోజుకూ టీవీల్లో వస్తుంటే కాసేపు చూడాలనిపిస్తుంది… మహేశ్ సినిమాల్లో తన కామెడీ టైమింగ్ పర్‌ఫెక్ట్‌గా పండింది ఇందులోనేనేమో…
అతడు విషయానికి వస్తే… రెండేళ్ల క్రితమే టైమ్స్‌లో ఓ వార్త వచ్చింది, 1000 సార్లు ప్రసారమైన తొలి సినిమా అని… నో నో, 1500 సార్లు అని కొన్ని వెబ్‌సైట్లు రాసుకొచ్చాయి… సరే, ఇప్పటి లెక్కే సరైంది అనుకుందాం… లెక్కదేముంది, అంకెదేముంది..? ఈరోజుకూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉండటం దాని ఘనతే… ఓటీటీలో ఉన్నా సరే, టీవీల్లో చూస్తుండటం విశేషమే మరి…
(ప్రస్తుతం బాహుబలిని కూడా అదే రేంజులో టీవీల్లో ప్రసారం చేస్తున్నారు…) అతడు విశేషం మరొకటి ఉంది, ప్రసారమైన ప్రతిసారీ ఎంతోకొంత మంచి రేటింగ్సే వస్తున్నయ్… సినిమా సంగతి అటుంచితే… ఈ సినిమా సీన్ల స్పూఫ్స్, జోక్స్, పాటల ప్రోగ్రాములు ఎన్ని, ఎన్నని… ఎన్నెన్నని…
సినిమాలో డైలాగ్స్… మాయాబజార్‌లో అమ్మో అమ్మే అనే డైలాగ్ గుర్తుంది కదా… అలాంటిదే ఇందులో… అంటే సూటిగా, ఒకే ముక్కలో… ఒకచోట హీరోయిన్ త్రిష విలన్‌తో అంతిమ పోరాటానికి వెళ్తున్న మహేశ్ బాబును అల్లుకుపోయి, ‘నేనూ వస్తా’ అంటుంది… దాన్ని వారించిన మహేశ్ బాబు ‘నేనే వస్తా’ అని బదులిస్తాడు… ఇలాంటి సీన్లు చాలా ఉన్నయ్ సినిమాలో…
ఓ కిరాయి హంతకుడు… తనను మోసం చేసిన సహ-నేరగాడు… ఎప్పుడో ఊరొదిలి పారిపోయిన మనిషి తిరిగి ఇంటికి వెళ్తూ అనుకోకుండా మహేశ్ బాబుకు రైల్లో కలవడం, అంతే అనుకోకుండా తనకు బదులుగా ఆ వ్యక్తి కాల్పుల్లో మరణించడం సినిమాలో అసలు ట్విస్టు…
టార్గెట్ చేసి తరుముతున్న పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, తాత్కాలికంగా తలదాచుకోవడానికి ఆ వ్యక్తి పేరుతో ఆ ఇంటికి వెళ్లిన మహేశ్ బాబు ఆ కుటుంబ బంధంలో మునిగిపోవడం హృద్యంగా తెరకెక్కింది…
బావ కాని బావతో మరదలు త్రిష బంధం అల్లుకుపోయిన తీరును, ఆ పాత్ర అమాయకత్వాన్ని కూడా త్రివిక్రమ్ కొత్తగా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది… అసలు నన్ను ఓ ఆడదానిగా చూస్తున్నావా అని త్రిష అలిగి, మండిపడే సీన్ బహుశా త్రివిక్రమే మళ్లీ తీయలేడేమో… సరే, రాజకీయాలు, కుట్రలు ఎట్సెట్రా ఉన్నా సరే ఆ కుటుంబంలో మహేశ్ బాబు పాత్ర ఒదిగిపోయిన తీరే సినిమాకు పెద్ద ఆకర్షణ…
కామెడీ సీన్స్ సరేసరి… చివరకు ఫేక్ మనమడు అని తెలిసినా సరే ఆ తాత యాక్సెప్ట్ చేస్తాడు తనను… కేసు దర్యాప్తు చేసే ఉన్నతాధికారి కూడా కావాలనే చివరలో ‘వదిలేస్తాడు’… సినిమాలో ఓచోట తుపాకీ కనిపించిందంటే చాలు, అది ఎప్పుడో ఓసారి పేలి తీరాలి… అంటాడు ఓ పెద్దమనిషి…
ఈ సినిమాలో ఓ రఫ్ తుపాకీ పాత్ర కూడా కీలకమే… ఆ కుటుంబ పెద్ద కొడుకును బలితీసుకుంటుంది… చివరకు అదే తుపాకీ విలన్ చేతిలో ‘ఉల్టా పేలి’ హీరో చేయాల్సిన పనిని చేసేస్తుంది… పిల్లలు ఆడుకుంటూ ఒక ‘చెర్ర’ను పొరపాటున అందులోనే వదిలేయడం దానికి కారణం…
పాటలు కూడా సూపర్ హిట్… బాలు, చిత్ర, సునీతలు మాత్రమే గాకుండా శ్రేయోఘోషాల్, సుచిత్ర, కవితా కృష్ణమూర్తి, కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్, కేకే తదితర భిన్నమైన సింగర్స్ గళాలు వినిపిస్తాయి మనకు… అతడు సినిమా విశేషాల గురించి చాలాసార్లు చదివి ఉంటారు కదా… బహుశా దీన్ని చూడని తెలుగు ప్రేక్షకుడు కూడా లేడేమో… సో, ఇక్కడే కొన్ని డైలాగులు నెమరేసుకుని ముగిద్దాం…
- నిజం చెప్పే ధైర్యం లేని వాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు.
నిజం చెప్పకపోవటం అబద్ధం..అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.
ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు.. వీడేంటిరా చాలా శ్రద్ధగా కొట్టాడు.. ఏదో ఒక గోడ కడుతున్నట్టు…గులాబీ మొక్కకు అంటు కడుతునట్టు, చాలా జాగ్రత్తగా పద్దతిగా కొట్టాడురా … ఆడు మగాడ్రా బుజ్జా…
- అల్లుడు సీజన్ లాంటోడు. వస్తాడు, పోతాడు, మనవడు చెట్టు, వస్తే పాతుకుపోతాడు
మనల్ని చంపాలనుకునే వాడిని చంపడం యుద్ధం..
మనల్ని కావాలనుకునే వాడిని చంపడం నేరం…
మనల్ని మోసం చేయాలనుకున్న వాడిని చంపడం న్యాయం
- అక్క అంబాసిడర్, నేను బెంజ్… అది పోర్టబుల్, నేను ప్లాస్మా… అక్క లైబాయ్, నేను లక్స్…
నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు ..
నేను నమ్మాను కాబట్టి చెప్పాను
ఎందుకంటే హనుమంతుడు కన్నా
రాముడికి నమ్మకస్తుడు ఎవరుంటారు
- అప్పుడప్పుడూ నడుస్తూ ఉండు, మెల్లిగా అదే అలవాటవుతుంది
జింకను వేటాడేప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా, అట్లాంటిది మరి పులినే వేటాడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి…
- వెళ్లు, గెలిస్తే రా, గెలవకపోతే నువ్వేమైపోయావో నాకు తెలియనివ్వకు, ఈ వయసులో నాకు కావల్సినవి అబద్ధాలు, నిజాలు కావు, జ్ఞాపకాలు… నీవల్ల నాకు అవి బోలెడన్ని ఉన్నాయి….
Share this Article