ఒక వార్త… టైమ్స్‌లో కూడా కనిపించింది… మహేశ్ బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమా ఏకంగా 1000 సార్లను మించి టీవీలో ప్రసారమైందని వార్త సారాంశం… కాదు, 1500 దాకా ఈ సంఖ్య చేరుకుందని కొన్ని సైట్లు రాసుకొచ్చాయి… ఆ సంఖ్య ఖచ్చితంగా ఇదీ అని ఎవరూ నిర్ధారించలేరు గానీ… ఇది టీవీల్లో సినిమా ప్రసారాలకు సంబంధించిన కొత్త రికార్డు అట…
కావచ్చేమో, బహుశా ఈ రికార్డును రాబోయే రోజుల్లో మరే సినిమా బ్రేక్ చేయలేదేమో కూడా… (ప్రస్తుతం బాహుబలిని కూడా అదే రేంజులో ప్రసారం చేస్తున్నారు… కాకపోతే అతడు సినిమా రికార్డును బ్రేక్ చేయాలంటే టైమ్ పడుతుంది…) నిజంగానే అతడు సినిమా భారీ సంఖ్యలోనే టెలికాస్ట్ అవుతున్నదని సగటు తెలుగు టీవీ ప్రేక్షకుడు ఎవరైనా చెప్పేస్తారు… అనుభవంతో…!
ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసినా సరే ఎంతోకొంత రేటింగ్ వస్తున్నదీ అంటే… జనం చూస్తూనే ఉన్నారని లెక్క… మొత్తంగా సినిమా ప్రసారమే కాదు, పాటల ప్రోగ్రాముల్లో, జోక్స్ ప్రోగ్రాముల్లో కూడా అతడు సీన్స్ కనిపిస్తూనే ఉంటాయి… ఇన్ని వందల సార్లు ప్రసారం చేసినా జనం ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నారంటే నిజంగానే ఆ సినిమాలో ఏదో కట్టిపడేసే మాయ ఉంది… కేవలం ఒక్క కారణమని చెప్పలేం… అనేక కారణాలు…
Ads
2005 ఆగస్టులో రిలీజైన ఈ సినిమా మహేశ్ బాబును తిరుగులేని స్టార్‌ను చేసింది… త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభతోపాటు తను రాసిన డైలాగ్స్ ఈ సినిమాలో అల్టిమేట్… ప్రత్యేకించి ఒకచోట హీరోయిన్ త్రిష విలన్‌తో అంతిమ పోరాటానికి వెళ్తున్న మహేశ్ బాబును అల్లుకుపోయి, ‘నేనూ వస్తా’ అంటుంది… దాన్ని వారించిన మహేశ్ బాబు ‘నేనే వస్తా’ అని బదులిస్తాడు… ఇలాంటి సీన్లు చాలా ఉన్నయ్ సినిమాలో…
ఓ కిరాయి హంతకుడు… తనను మోసం చేసిన సహ-నేరగాడు… ఎప్పుడో ఊరొదిలి పారిపోయిన మనిషి తిరిగి ఇంటికి వెళ్తూ అనుకోకుండా మహేశ్ బాబుకు రైల్లో కలవడం, అంతే అనుకోకుండా తనకు బదులుగా ఆ వ్యక్తి కాల్పుల్లో మరణించడం సినిమాలో అసలు ట్విస్టు… టార్గెట్ చేసి తరుముతున్న పోలీసుల నుంచి తప్పించుకోవడానికి, తాత్కాలికంగా తలదాచుకోవడానికి ఆ వ్యక్తి పేరుతో ఆ ఇంటికి వెళ్లిన మహేశ్ బాబు ఆ కుటుంబ బంధంలో మునిగిపోవడం హృద్యంగా తెరకెక్కింది…
బావ కాని బావతో మరదలు త్రిష బంధం అల్లుకుపోయిన తీరును, ఆ పాత్ర అమాయకత్వాన్ని కూడా త్రివిక్రమ్ కొత్తగా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది… సరే, రాజకీయాలు, కుట్రలు ఎట్సెట్రా ఉన్నా సరే ఆ కుటుంబంలో మహేశ్ బాబు పాత్ర ఒదిగిపోయిన తీరే సినిమాకు పెద్ద ఆకర్షణ… కామెడీ సీన్స్ సరేసరి… చివరకు ఫేక్ మనమడు అని తెలిసినా సరే ఆ తాత యాక్సెప్ట్ చేస్తాడు తనను… కేసు దర్యాప్తు చేసే ఉన్నతాధికారి కూడా కావాలనే చివరలో ‘వదిలేస్తాడు’…
సినిమాలో ఓచోట తుపాకీ కనిపించిందంటే చాలు, అది ఎప్పుడో ఓసారి పేలి తీరాలి… అంటాడు ఓ పెద్దమనిషి… ఈ సినిమాలో ఓ రఫ్ తుపాకీ పాత్ర కూడా కీలకమే… ఆ కుటుంబ పెద్ద కొడుకును బలితీసుకుంటుంది… చివరకు అదే తుపాకీ విలన్ చేతిలో ‘ఉల్టా పేలి’ హీరో చేయాల్సిన పనిని చేసేస్తుంది… పిల్లలు ఆడుకుంటూ ఒక ‘చెర్ర’ను పొరపాటున అందులోనే వదిలేయడం దానికి కారణం… పాటలు కూడా సూపర్ హిట్… బాలు, చిత్ర, సునీతలు మాత్రమే గాకుండా శ్రేయోఘోషాల్, సుచిత్ర, కవితా కృష్ణమూర్తి, కార్తీక్, మహాలక్ష్మి అయ్యర్, కేకే తదితర భిన్నమైన సింగర్స్ గళాలు వినిపిస్తాయి మనకు…
నిజానికి ఈ సినిమా పవన్ కల్యాణ్ చేయాలట… త్రివిక్రమ్ తన కోసమే కథ రాసుకుని పవన్‌కు వినిపిస్తుంటే ఆయన నిద్రలోకి జారిపోయాడట… త్రివిక్రమ్ సైలెంటుగా బయటికి వచ్చేసి మహేశ్‌బాబు దగ్గరకు వెళ్లి కథ వినిపించాడట… మహేశ్ కథ లైన్ కృష్ణకు వెంటనే చెప్పేస్తే ఆయన గోఎహెడ్ అనేశాడట… అలా మహేశ్ బాబు ఖాతాలోకి వచ్చింది ఈ సినిమా… క్లైమాక్స్ కొంత ఓవర్ అనిపిస్తుంది గానీ అందులోని ఫ్రీజ్ షాట్లు గట్రా తీయడానికి 27 రోజులు పట్టిందని ఆమధ్య ఎవరో సినిమా రిపోర్టర్ రాసుకొచ్చాడు… చెబుతూ పోతే అతడు విశేషాలు అనంతం… ఇక్కడ ముగిద్దాం…
Share this Article