“మరలనిదేల రామాయణంబన్నచో
నీప్రపంచక మెల్లనెల్ల వేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బ్రతుకులు తనవిగాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనదిగాన
తలచిన రామునే తలచెద నేనును
నాభక్తి రచనలు నావిగాన
వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితివీవనిపించుకో వృథా
యాసముగాక కట్టుకతలైహికమా! పరమా యటంచు దా
జేసిన తండ్రియాజ్ఞయును జీవునివేదన రెండు నేకమై
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్”
ఇంతమంది ఇన్ని యుగాలుగా ఇన్ని రామాయణాలు రాస్తున్నారు కదా? మళ్లీ రామాయణమే ఎందుకు రాస్తున్నానంటే? అని ఆయనకు ఆయనే ప్రశ్న వేసుకుని…ఆయనే తిరుగులేని సమాధానం కూడా చెప్పుకున్నారు విశ్వనాథ.
Ads
ఈ లోకం రోజూ తింటున్న అన్నమే తింటోంది. చేస్తున్న సంసారమే చేస్తోంది. తన రుచి తనది. అలా నాదయిన భక్తి రచన నాది కాబట్టి తలచిన రాముడినే తలచుకుంటాను…రాస్తే రాముడి కథ రాసి నిలబడు…పాడు కట్టు కథలు దేనికి? అని మా నాన్న చెప్పిన మాట; నాలో జీవుడి వేదన రెండూ కలగలిసి రాముడినే స్మరిస్తున్నాను…అని రామాయణం తెలుగుసేత మొదలుపెట్టారు విశ్వనాథ.
పద్నాలుగేళ్లు పాలించిన “చెప్పు”
రామాయణ గాధలు తెలియనిదెవరికి?
కాకపోతే- రాత్రంతా రామాయణం విని, పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడుగుతుంటాం కాబట్టి-మరలనిదేల రామాయణంబన్న . . . రోజూ తినే అన్నమే మళ్లీ మళ్లీ తింటున్నాం కదా అన్నారు విశ్వనాథ.
రాముడు అడవికి వెళ్లాడు. భరతుడు తాత, మేనమామల కేకయ రాజ్యం నుండి అయోధ్యకు వచ్చాడు. అన్న రామన్న లేడు. తండ్రి దశరథుడి మరణం. తండ్రి ఉత్తర క్రియలయ్యాక మొత్తం అయోధ్యను తీసుకుని అడవిలో అన్న దగ్గరికి వెళ్లాడు. నేను రాజ్యం అడగలేదు, అమ్మ కైకేయి అడిగినప్పుడు నేనక్కడ లేను . నాన్న పోయారు. అయోధ్య సింహాసనం ఖాళీగా ఉంది . వచ్చి నువ్వే ఏలుకో – అని వినయంగా రామయ్యకు చెప్పాడు. భరతా! తండ్రి ఉన్నా, లేకున్నా మాట మాటే. రావడం కుదరదు. 14 ఏళ్లు నేనడవిలో ఉంటానన్నాడు రాముడు. అయితే నేనూ అయోధ్యకు వెళ్ళను. ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అని దర్భలు పరుచుకుని…ప్రాణత్యాగం చేస్తానని మొండికేస్తాడు భరతుడు.
ఇది తెగే వ్యవహారం కాదని మధ్యలో వసిష్ఠుడు కలుగజేసుకుని బంగారు పాదుకలు తెచ్చి- రామా! ఒక సారి ఈ పాదుకలు తొక్కి భరతుడికివ్వు. నీ పాదుకలనే నిన్నుగా అనుకుని భరతుడు నీపేరిట రాజ్యం చేస్తాడు- అని సూచించాడు. ఈ మధ్యేమార్గం రాముడికి- భరతుడికి ఇద్దరికీ నచ్చింది. ఆ క్షణం నుండి ఏకంగా పదునాలుగేళ్లు చతుస్సాగర పర్యంత సకల మహీమండల సువిశాల రాజ్యాన్ని రామపాదుకలే పాలించాయి.
అదెప్పుడో త్రేతాయుగం. మధ్యలో ద్వాపర కూడా పూర్తయి…కలిలోకి వచ్చాము. ఇప్పుడు భరతుడిలా ఎవరుంటారు? అని పెదవి విరవాల్సిన పనిలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ కూర్చున్న పెద్ద కుర్చీని ఖాళీగా పక్కన పెట్టుకుని…తాను అంతకంటే చిన్న కుర్చీలో కూర్చుని పనులు చేస్తున్నారు కొత్త ముఖ్యమంత్రి అతిశీ. నాదీ భరతుడి వేదనే- అని వాదనకు వీల్లేకుండా స్పష్టంగా ఆమే చెప్పుకున్నారు. మరలనిదేలయన్న…అదే రామాయణం- అంతే!
రామరాజ్యం కోసం పరితపించే రామభక్తులకు ఇందులో రాజ్యాంగాన్ని అవమానించిన చిత్రం కనిపించడమే కొస మెరుపు!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article