.
Sai Vamshi ……. భర్తలపై భార్యల హింసలు.. నాణేనికి అవతలి వైపు కథలు … (Attrocities of Women on Men)
… ముంబయికి చెందిన రోనక్ నగ్డాకు 26 ఏళ్లు. భార్య పాలక్ ఫురియా. ఇద్దరి జీవితం హాయిగా సాగుతుందని ఆశపడ్డాడు. కానీ పరిస్థితి అతని చేతిలోనుంచి దాటిపోయి, భార్య చేతిలోకి వచ్చింది. పెళ్లయిన నాటి నుంచే అతని మీద తన పెత్తనాన్ని మొదలుపెట్టింది పాలక్.
Ads
తన పుట్టింట్లోనే ఎక్కువశాతం గడిపి, ఎప్పుడో చుట్టం చూపుగా అత్తింటికి వచ్చి వెళ్లేది. భర్తను కూడా తన అమ్మానాన్నల ఇంటికే తీసుకెళ్లేది. ప్రతి చోటా తన మాటే నెగ్గాలన్న పట్టు ఆమెది. కొన్నిసార్లు అతను ఎదురించేవాడు. మరికొన్నిసార్లు అతను భరించేవాడు.
గొడవలు జరిగేవి. తర్వాత ఎలాగో సర్దుకుపోయేవారు. కానీ 2023లో ఆ గొడవలు తీవ్రస్థాయికి వెళ్లాయి. అప్పటికి పాలక్ ఆరునెలల గర్భవతి. వెంటనే పుట్టింటికి వచ్చేసింది.
ఆమెను తిరిగి తన దగ్గరికి తీసుకురావాలని రోనక్ చాలా ప్రయత్నించాడు. కానీ అత్తామామలు పడనివ్వలేదు. 2023 డిసెంబర్ 22న పాలక్‌కి కూతురు పుట్టింది. తనను చూసేందుకు కూడా వారు అతణ్ని అనుమతించలేదు. అతనిపై గృహహింస కేసు పెట్టారు.
మానసికంగా, శారీరకంగా అతణ్ని హింసించారు. వేధింపులు అక్కడితో ఆగలేదు. రోనక్‌తోపాటు అతని తల్లిదండ్రులు, 19 ఏళ్ల తమ్ముడి మీదా కేసు నమోదు చేయడంతో సమాజంలో వారి పట్ల చిన్నచూపు మొదలైంది. రోనక్ ఉద్యోగం చేసేచోట అతని పట్ల చులకనభావం ఏర్పడింది. అయినా తన భార్య తన దగ్గరికి వస్తుందని, తన కూతుర్ని తాను చూస్తానని ఆశతో ఏడాదిపాటు గడిపాడు రోనక్.
భార్యను కలిసి, తనతో మాట్లాడితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా ప్రయత్నించాడు. కానీ పాలక్ అతనితో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. దాని వెనకాల ఆమె అమ్మానాన్నల ప్రోద్బలం, ప్రోత్సాహం ఉన్నాయి.
‘నా భార్యతో నేను మాట్లాడాలి’ అంటూ వారి ఇంటి ముందు ఓ రోజంతా నిలబడ్డాడు. సాయంత్రానికి వాళ్ల మనసు కరిగి లోపలికి రానిచ్చారు. కానీ ఆమెను కలవనివ్వలేదు. అతను బలవంతం చేయడంతో దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. అంతే! అతని మనసు విరిగిపోయింది. ఇక తన భార్య తన దగ్గరికి రాదని అర్థమైంది.
జీవితంలో ఇక తను తన కూతుర్ని చూడలేనని తెలిసిపోయింది. ఇంటికి వచ్చేశాడు. 2024 నవంబర్ 24న సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, అందుకు తన భార్య, ఆమె కుటుంబసభ్యులు కారణమని, తనను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా హింసించారని చెప్పి ఉరేసుకున్నాడు.
చనిపోయే ముందు మృతుడు ఇచ్చిన వాంగ్మూలం ఉంది. అతని ఒంటి మీద పడ్డ దెబ్బలకు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులు ఉన్నాయి. అయినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. మృతుడి తల్లి సంగీత ఎన్నిసార్లు స్టేషన్ల చుట్టూ తిరిగినా రోనక్ అత్తింటివారిపై ఏ చర్యా లేదు. అలా 20 రోజులు గడిచాయి.
చివరకు కొన్ని ఎన్జీవోలు, పురుషుల హక్కుల పరిరక్షణ సంఘాలు వచ్చి ధర్నా చేసి, ఒత్తిడి తేవడంతో రెండు రోజుల క్రితం వారిపై కేసు నమోదు చేశారు. దారుణమేంటంటే, పాలక్ తన భర్త రోనక్ మీద పెట్టిన కేసు ఇంకా కొనసాగుతోంది.
ఆ కేసులో భాగంగా అతని కుటుంబసభ్యులు ఇంకా కోర్టులకు హాజరవుతూనే ఉన్నారు. ఒక్క రోజు కూడా తమ కోడలు తమ దగ్గర లేదని, పుట్టింట్లోనే ఉందని, తాము ఆమె మీద హింసకు పాల్పడే అవకాశం లేదని చెప్పినా ఎవరూ వినడం లేదు.
… మొన్న బెంగళూరులో భార్య, ఆమె కుటుంబసభ్యుల వేధింపులు భరించలేక అతుల్ సుభాష్ అనే ఐటీ ఉద్యోగి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై చాలామంది తీవ్రంగా స్పందించారు. గృహహింస చట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
National Crime Records Bureau లెక్కల ప్రకారం, దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఓ పురుషుడు కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇవన్నీ భార్య వేధింపులతో చేసుకునే ఆత్మహత్యలు కాకపోయినా, ఏడాదికి 35 వేల మంది పురుషులు కుటుంబ సమస్యల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నారన్నది వాస్తవం.
భయంకరమైన వాస్తవం. మహిళల రక్షణ కోసం తెచ్చిన ‘గృహహింస చట్టాన్ని’ కొందరు దుర్వినియోగం చేసి, భర్తలను బెదిరించి డబ్బు లాగే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా అత్యంత భయంకరమైన వాస్తవం.
… ‘ఇంత జరుగుతుంటే స్త్రీవాదులు ఏం చేస్తున్నారు? వాళ్లకు ఈ విషయాలు తెలియవా? వాళ్ల కళ్లు మూసుకుపోయాయా?’ అని కొందరు ఆవేశపడిపోతుంటారు. వెల్.. భారతీయ న్యాయసంహితలోని 120-బి, 167, 182, 191, 324, 506 సెక్షన్ల గురించి తెలుసా? స్త్రీవాదులంటే గయ్యాళి గంపలు, రౌడీలు, సెటిల్‌మెంట్లు చేసి డబ్బులు తీసుకునేవారు అనే ఆలోచనను, మీ ఆవేశాన్ని కాస్తంత పక్కన పెట్టి ఈ సెక్షన్ల గురించి తెలుసుకోండి.
ఇవన్నీ భార్య నుంచి భర్తకు రక్షణ కోసం ఏర్పరిచిన సెక్షన్లు. పోలీసులకు మీరు కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేస్తారు. కానీ ఎంతమంది ఇవ్వగలుగుతారు? బాధిత మహిళలు మహిళా సంఘాన్ని ఆశ్రయించినంత సులువుగా, ధైర్యంగా మగవాళ్లు ఎన్జీవోల దగ్గరికో, మానవ హక్కుల సంఘం దగ్గరికో వెళ్లగలుగుతున్నారా?
… భార్య చేతిలో హింస పడుతున్నానని చెప్తే అందరూ గేలి చేస్తారని, ‘ఆడంగోడు’ అంటారని, చులకనగా చూస్తారని భయపడి నోరు విప్పరు. ఎవరికీ చెప్పుకోరు. లోలోపలే బాధ పడి, భార్య హింసల్ని భర్తిస్తూ ఉంటారు. గుంభనంగా బయటికొచ్చి స్త్రీవాదుల్ని, సంఘాల్ని నిందిస్తారు. ఇదెక్కడి న్యాయం?
నిజానికి, భర్త మీద భార్య తప్పుడు కేసు పెట్టినట్లు తేలితే, భర్త ఆమె మీద సీఆర్పీసీ 156(3) సెక్షన్ కింద కేసు పెట్టి శిక్ష వేయించొచ్చు. మీరు స్టేషన్ దాకా వెళ్లే ధైర్యం చేయలేనప్పుడు మీ సమస్య పరిష్కారం కాదు సరికదా, ఇంకా జటిలం అవుతుంది. అప్పుడు స్త్రీవాదుల్ని ఎంత తిట్టుకున్నా మీకు లాభం ఉండదు.
… జెండర్ వల్లనో, కులం/మతం వల్లనో ఏ ఒక్కరూ మంచివారైపోరు. ఇది స్త్రీలకూ వర్తిస్తుంది. ఆడవాళ్లంతా మంచివాళ్లే అయితే, అసలు మహిళా జైల్లే ఉండకూడదు. కాబట్టి స్త్రీల తరఫునా తప్పులు, నేరాలు జరుగుతాయి.
పైన పేర్కొన్న కేసులో పాలక్‌కి మరో వాదన ఉండొచ్చు. రోనక్ ఆమెను హింస పెట్టిన ఆధారాలు కూడా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు అతని మరణం పాలక్‌ని బాధపెడుతుండొచ్చు. అయితే ఇప్పుడు నిజానిజాలు తేల్చాల్సింది పోలీసులు. వాళ్లు కేసే నమోదు చేయకపోవడంపై ఎన్జీవోలు మండిపడి, దీక్షలు చేశాయి. జెండర్‌కి, కులమతాలకు అతీతంగా అందరూ ఒక్కటైనప్పుడే మనం నమ్మే సిద్ధాంతాలకు విలువ…. – విశీ (వి.సాయివంశీ)
Share this Article