.
అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి అవధాని అంత కంటే కొంటెగా సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను. మీరూ ఆనందిస్తారు కదా అని.
*1.ప్రశ్న* :- అవధానం చేసే వారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో..?
*జవాబు* :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు కారం అట్లంటేనే ఇష్టం*
Ads
*2. ప్రశ్న* :- పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి?
*జవాబు* :- పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే *స్లో…కమ్* కదా
*3 ప్రశ్న* : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది?
*జవాబు* :– పెళ్లి కాకముందు ‘అయస్కాంతంలా’, పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా…’
*4. ప్రశ్న* :-ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకురమ్మన్నారు.
*జవాబు*:- ఇంతకీ ఏ కవి *’తలను’* తీసికెళ్తున్నారు
*5.ప్రశ్న* :-పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి?
*జవాబు* :-అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం.
*6 ప్రశ్న* :-అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు?
*జవాబు* :-దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను
*7. ప్రశ్న*:- అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, అశ్రువులు ఎప్పుడొస్తాయి?
*జవాబు* :- ప్రశ్నవేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే అశ్రువులు వస్తాయి.
8. ప్రశ్న* :- బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు?
*జవాబు … రెండింటి మీద అంతగా వెంట్రుకలు ఉండవు కాబట్టి.
9. ప్రశ్న* :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు?
*జవాబు* :- ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు (రంభాఫలం) అని అర్థం.
*10. ప్రశ్న* :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా…?
*జవాబు* :- మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి.
*11. ప్రశ్న* :- మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు?
*జవాబు* :- వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమంటాను.
*12. ప్రశ్న* :- మీరెప్పుడైనా బూతు పనులు చేశారా?
*జవాబు* : – ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ ‘బూతు పనులు’ తప్పవు
*13 ప్రశ్న*:-అర్ధనారీశ్వరుడైన ఈశ్వరుడు ధరించే వస్త్రం ఏమిటి?
*జవాబు* :- ఈశ్వరుడు కనపడేలా కో ‘బ్రా’ ను మెడలో ధరిస్తాడు
*14. ప్రశ్న* :- అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట.. నిజమా?
*జవాబు* :- నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది.
*15. ప్రశ్న* :- పావురం అంటే మీకు ఇష్టమా…?
*జవాబు* :- పావు ‘రమ్’ ఎవరికి ఇష్టం వుండదు
*16. ప్రశ్న* :- మీరు సారా త్రాగుతారా?
*జవాబు* :- అవును అవధాన కవితామృతాన్ని మన ‘సారా’ త్రాగుతాను.
*17. ప్రశ్న* :- సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి?
*జవాబు* :- అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి.
*18. ప్రశ్న* :- మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా..
*జవాబు* :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద కాబట్టి.
*19. ప్రశ్న*: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి?
*జవాబు*:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి.
*20. ప్రశ్న*:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు?
*జవాబు*:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా.
*21. ప్రశ్న*:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు?
*జవాబు*:- పురుషులందు పుణ్యపురుషులు ‘ఏరయా?’
*22. ప్రశ్న*:- అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు?
*జవాబు*:- మరో నలుగుర్ని పిలిచి ‘అష్టావధానం’ చేస్తాను.
*23. ప్రశ్న*:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను ‘శ్రీమతి’ అంటారెందుకు?
*జవాబు*:- పెళ్లయిన తరువాత ‘స్త్రీ మతి’ స్థితిమతి మీదే పురుషులు ఆధారపడుతారు గనుక.
*24. ప్రశ్న*:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు.
*జవాబు*:- గొడవపడితే మాట్లడదేమోనని
భయపడేవాడు ప్రేమికుడు..
మాట్లాడితే గొడవ పడుతుందేమోనని
భయపడేవాడు భర్త…
*25 ప్రశ్న*:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా?
*జవాబు*:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే…
‘కీర్తి’ అమ్మాయి పేరు,
‘శేషు’ అబ్బాయి పేరు.
*26. ప్రశ్న*:- గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరు గోపిక. మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి?
*జవాబు*: – *‘ఆపిక’* వెంటనే అవధాని సమాధానం……… ప్రభాకర్ జైనీ
Share this Article