సినిమా అనే ఓ దృశ్య మాధ్యమానికి సంబంధించి అవతార్ ఓ చరిత్ర… దాదాపు 7 వేల కోట్ల అత్యంత భారీ ఖర్చు, 16 వేల కోట్ల రెవిన్యూ టార్గెట్, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి దేశంలోనూ రిలీజ్, దాదాపు 60 వేల థియేటర్లు, 140 భాషలు… అసలు ఇవి కాదు వార్తలు… జేమ్స్ కామెరూన్ ఓ ఇంద్రజాలికుడు… అనితర సాధ్యమైన ఓ ఫిక్షన్‌ను కలగంటాడు… దాన్ని తెరపై ఆవిష్కరిస్తాడు…
ప్రతి సీన్‌కూ అత్యంత ప్రయాస… ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాడు… ఇప్పట్లో ఈ రేంజ్ గ్రాఫిక్స్ సినిమా రాకపోవచ్చు… మరి సినిమా అంటే ఓ కథ కదా… వీడియో గేమ్ కాదు కదా… ఎమోషన్ ఉండాలి, బేసిక్ సినిమా లక్షణాలు ఉండాలి కదా అంటారా..? అందులో ఢోకా లేదు… అబ్బురపరిచే కథ అవతార్ అయితే దానికి కొనసాగింపు అవతార్-2…
Ads
అసలు ఒక సినిమా సీక్వెల్ కోసం 13 ఏళ్లపాటు ప్రేక్షకులు నిరీక్షించడమే జేమ్స్ కామెరూన్ సంపాదించిన అపారమైన విశ్వాసం… ఈమధ్య కొందరు ఫేమస్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ రివ్యూయర్ల కోసం ప్రీమియర్ షోస్ వేసి చూపించారు… నెగెటివ్ ప్రచారం వచ్చినా సరే అనే భావన… కొందరు వీడియో గేమ్ అన్నారు, కొందరు బోరింగ్ అన్నారు, కొందరు అవతార్‌తో పోలిస్తే బాగాలేదన్నారు… కొందరు జేమ్స్ నిరాశపరిచాడు అని రాశారు…
అదొక విజువల్ వండర్… ఐఫీస్ట్… ఎవరెన్ని నెగెటివ్ రాతలు రాసినా సరే… ఐననూ వెళ్లి రావలె అనుకునేవాళ్ల సంఖ్య కోట్లు… ఎందుకంటే..? కంపు కొడుతున్న ఇతర గ్రాఫిక్స్, ఫిక్షన్, కమర్షియల్ సినిమాలతో పోలిస్తే అవతార్-2 చాలా చాలా బెటర్… ప్రత్యేకించి పిల్లలు, ఫ్యామిలీతో వెళ్లడానికి అడ్వాన్స్ బుకింగులు సాగుతున్నాయి… సినిమా మీద పెరిగిన నెగెటివిటీతో చాలాచోట్ల సినిమా అనుకున్న రేట్లకు అమ్ముడుపోలేదు… అవతార్-2 పని అయిపోయింది అనే విశ్లేషణలు కూడా జోరుగా స్టార్టయ్యాయి…
సినిమా చూస్తున్నప్పుడు మన నెత్తిమాశిన గ్రాఫిక్స్ సినిమాలను ఓసారి గుర్తుతెచ్చుకొండి… అవతార్-2 ఏ స్థాయి సినిమాయో అర్థమవుతుంది… ది వే ఆఫ్ వాటర్… ఓ జానపద కథే… కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తీరు, ప్రజెంట్ చేసిన విధానం అబ్బురం… మూడు గంటలు దాటిన రన్ టైమ్ వల్ల కొందరు ఒకింత బోర్ ఫీల్ కావచ్చుగాక… ఐననూ థియేటర్ వరకూ వెళ్లవలె… చూడవలె…
అవతార్ గుర్తుంది కదా… పండోరా గ్రహంపైకి జేక్ అక్కడ మనుషులే అక్కడ జాతుల్ని మోసం చేస్తున్నారని గుర్తిస్తాడు… వాళ్లతో కలుస్తాడు, తనే మనుషులపై పోరాడతాడు… ఈక్రమంలోనే నేత్రి పరిచయం, ప్రణయం… అక్కడే ఉండిపోతాడు… నిజానికి అవతార్‌తో పోలిస్తే ఈ సీక్వెల్ కథ ఇంకాస్త విస్తృతం… జేక్, నేత్రిలకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు, ఓ పెంపుడు బిడ్డ… వారితోపాటు స్పైడర్ అనే మానవబాలుడు… మళ్లీమళ్లీ పండోరాపై కన్నేసి దోచుకోవడానికి ప్రయత్నించే మానవదొంగల ముఠా నాయకుడు క్వరిచ్ కొడుకే ఈ స్పైడర్… భూలోకానికి పంపించే మార్గం దొరక్క పండోరాపైనే ఉండిపోతాడు…
తన కొడుకే స్పైడర్ అని గుర్తించిన క్వరిచ్ తనను విడిపించుకుని తీసుకుపోవాలని, పనిలోపనిగా తనకు అడ్డుతగిలే జేక్‌ను ఖతం చేయాలనీ టార్గెట్ పెట్టుకుంటాడు… జేక్ పిల్లల్ని బంధిస్తాడు… కానీ జేక్ వాళ్లను విడిపించుకుని అదే గ్రహం మీద మరో ప్రాంతానికి వెళ్తాడు… ఈ పోరాటాలు ఇటు సాగుతుంటే, మరో వైపు జేక్ కొడుకు లోక్, ఆ కొత్త ప్రాంతపు పాలకుల కూతురు సిరెయాతో ప్రణయం సాగుతుంటుంది… మళ్లీ అక్కడ తెలుగు సినిమా పోకడలు… ఆ కూతురి అన్నకు ఈ ప్రణయం నచ్చదు…
ఇద్దరూ తన్నుకుంటారు, ఆ అన్న లోక్‌ను తీసుకెళ్లి భయంకరమైన ఓ సముద్రలోయలో పడేస్తాడు… అక్కడ పాయకస్ అనే జలచరం రక్షిస్తుంది… జేక్ పిల్లలు నీటితో, సముద్రంతో బాగా అనుబంధం పెంచుకుంటారు… ఇలా సాగిపోతుంది కథ… అవతార్ స్ట్రెయిట్ లైన్… కానీ అవతార్-2 కథలో లీనం కావడం, అర్థం చేసుకోవడం కొంత క్లిష్టం… కథ కోసం రన్ టైమ్ కూడా పెరిగింది… ఇంతకీ క్వరిచ్ జేక్‌ను అంతం చేయడానికి ఏమేం కుట్రలు పన్నాడు..? క్వరిచ్ కొడుకు స్పైడరే తండ్రిపై తిరగబడటంతో ఆ తండ్రి ఏం చేశాడు..? లోక్, సెరెయా ప్రణయం ఏమైంది..? ఆ అన్న మళ్లీ లోక్ మీద కక్షకట్టి ఏం చేశాడు..? కథ అలా సాగిపోతూనే ఉంటుంది…
ఇప్పుడు సినిమా అంటే 2 గంటలు… కానీ ఇది 3 గంటల 12 నిమిషాలు… అవతార్ నటీనటులే మళ్లీ… కొత్తగా టైటానిక్ తార కేట్ విన్‌స్లెట్ కనిపిస్తుంది… ఈ సినిమాకు వందల కోట్లు పెట్టాం, గ్రాఫిక్స్ కోసమే 300 కోట్లు ఖర్చయింది అని భారీ ఇండియన్ సినిమా ప్రాజెక్టుల దర్శకనిర్మాతల కూతలు, ఆ వార్తలు గుర్తున్నాయి కదా… ఆ సినిమాల చిల్లరతనాలు కూడా చూసినవే కదా…
ఒక్కసారి అవతార్-2 సినిమా అయిపోయాక పోల్చుకొండి… మన దరిద్రులు చెత్త నుంచి వసూళ్ల అద్భుతాల్ని ఆశిస్తారు… జేమ్స్ కామెరూన్ వంటి హాలీవుడ్ దర్శకులు తమ జీవితం మొత్తమ్మీద తీసేదే వేళ్ల మీద లెక్కపెట్టే సినిమాలు… కానీ అద్భుతాలను ఆవిష్కరిస్తారు… అందుకే సినిమా మీద నెగెటివ్ రివ్యూలు గట్రా చదవడం మానేసి, చూడవలె… చూడవలె…!!
Share this Article