అవినాష్… బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చేశాడు కదా… అప్పటివరకూ తనకు ఉపాధి ఆధారంగా ఉన్న జబర్దస్త్ షో కూడా పోయినట్టే కదా… మరి ఏం చేయబోతున్నాడు..? అసలే కదిలిస్తే చాలు, బొచ్చెడు సినిమా కష్టాలు చెప్పుకుని శోకాలు పెట్టే అవినాష్ భవిష్యత్తు ఏమిటి…? వీటికి జవాబులు కావాలా…? అంతకుముందు అవినాష్ రీసెంట్ కథ ఓసారి చదవాలి…
చాలామంది కమెడియన్లలాగే అవినాష్ కూడా ఈటీవీ జబర్దస్త్ ద్వారా మెరిశాడు… బిగ్‌బాస్ అవకాశం వచ్చింది… కానీ జబర్దస్త్ షో దగ్గర ఓ నీచమైన నిబంధన ఉంది… ఈ షో నిర్మాతలు మల్లెమాల టీవీ కోసం పనిచేసేవాళ్లు ఓ అగ్రిమెంటు బందీలు… అందులో ఉన్నన్నిరోజులూ వాళ్లు బయటి షోలు చేయడానికి లేదు… అంతేకాదు, అగ్రిమెంటు చించేసి బయటికి వెళ్లిపోతాను అనుకుంటే లక్షల పరిహారం కట్టాలి… ఈనాడు, ఈటీవీల రూల్స్ కూడా అంతే కదా… వాళ్లకు ప్రోగ్రామ్స్ చేసీ చేసీ మల్లెమాల కూడా అలాగే మైలపట్టిపోయింది…
బిగ్‌బాస్ చాన్స్ వచ్చినప్పుడు సహజంగానే మల్లెమాల కంపెనీ అభ్యంతరపెట్టింది… అవినాష్ ఆ అగ్రిమెంటు చించేసి, ఆ బందిఖానా నుంచి బయటపడి, వాళ్లు అడిగిన డబ్బు వాళ్ల మొహాన కొట్టి… తలెత్తుకుని, కాలర్ ఎగరేస్తూ, స్వేచ్ఛగా బయటికొచ్చాడు… బిగ్‌బాస్ డబ్బు ప్లస్ ఏదో ఒకటి చేసుకుని బతకలేనులే అనే ధీమా… మల్లెమాల మొహం మాడిపోయింది కాబట్టి మళ్లీ జబర్దస్త్‌కు పిలవకపోవచ్చు… మరి తరువాత..?
Ads
బిగ్‌బాస్ ప్రసారం చేసే స్టార్ మాటీవీకి అవినాష్‌కూ నడుమ బంధం పెరిగింది కదా… పైగా జబర్దస్త్ పేరిట కామెడీ జానర్‌ను ఈటీవీ కుమ్మేసుకుంటోంది… జీతెలుగులో చేరిన నాగబాబు దాన్ని అక్కడ రిప్లికేట్ చేయబోయి భంగపడ్డాడు… ఇప్పటికే ఈటీవీ ఢీ షోకు ప్రతిగా డాన్స్ షో అంటూ ఓంకార్‌ను రంగంలో దింపి… ఇప్పుడు అవినాష్‌ను ముందుబెట్టి ఓ కామెడీ షో ప్లాన్ చేసింది… గతంలో ఓ స్టాండప్ కామెడీ షో చేసి చేతులు కాల్చుకున్నా సరే, ఈసారి అవినాష్‌తో మళ్లీ ఓ ప్రయోగం… దాని పేరు కామెడీ స్టార్స్…
నిజానికి ఇది కొత్త కాన్సెప్టు ఏమీ కాదు… సేమ్, జబర్దస్త్, అదిరింది టైపు స్కిట్ల షో… సరే, అవినాష్‌కు కూడా ఓ కొత్త వేదిక కావాలి… అందుకని మాటీవీ ఆఫర్ వెంటనే ఒప్పేసుకున్నాడు… తను క్వారంటైన్లో ఉన్నప్పుడు, షోలో ఉన్నప్పుడు దీనికి సంబంధించిన విధివిధానాలు పూర్తి చేశారు… బిగ్‌బాస్ తరువాత నేనేం అయిపోవాలిరా దేవుడోయ్ అంటూ అవినాష్ పెట్టిన పెడ బొబ్బలు అన్నీ జస్ట్, ఓ షో… ఓ డ్రామా…
ఇప్పుడు ప్లాన్ చేసిన ప్రకారం… ఈ కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో కూడా నాలుగు టీమ్స్ ఉంటయ్… ముగ్గురు జడ్జిలు ప్లస్ ఒక సూపర్ జడ్జి… ఈ షో హోస్ట్ చేసేది అవినాష్… నాగబాబుతో పాటు జబర్దస్త్ నుంచి బయటికి వచ్చి, అదిరింది ఫ్లాప్ షో కోసం అసంతృప్తిగానే పనిచేస్తున్న కమెడియన్లు ప్లస్ జబర్దస్త్ నుంచి ఒకరిద్దరు కమెడియన్లకు మాటీవీ గాలం వేస్తున్నట్టుంది…
జబర్దస్త్‌లో అగ్రిమెంటు బాధితులు, అసంతృప్తులు చాలామంది ఉన్నారు… వాళ్లకు సరిపడా డబ్బులిస్తే, వాళ్లు కూడా ఆ మల్లెమాల పిచ్చిసంకెళ్లను తెంచుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారట… వీళ్లందరినీ అవినాష్ మీడియేట్ చేయాలి… ఓ కొత్త కామెడీ షోకు పురుడుపోయాలి… ఏమో, నేను గొప్ప ఎంటర్టెయినర్ను అనే ఈగో కాస్త తగ్గించుకుని, కాస్త ప్రొఫెషనలిజం చూపించగలిగితే ఈ షో క్లిక్ కావచ్చు… తెలుగు ప్రేక్షకులకు కూడా ఆ బూతు జబర్దస్త్‌కు, ఆ బోరింగు అదిరిందికి ఓ ఆల్టర్నేట్ కామెడీ షో దక్కవచ్చు…! అగ్రిమెంటు, ఉల్టా పరిహారం తాలూకు బాధ తగ్గి, ఆ కోపం తీరాలంటే ఈ షో సక్సెస్ చేయడమే అవినాష్ కర్తవ్యం…
Share this Article