.
చాలా భాషల టీవీ చానెళ్లలో సినిమా పాటలకు సంబంధించిన రియాలిటీ షోలు వస్తుంటాయి… వేలాది మందితో ఆడిషన్లు… మెరికల్లాంటి కంటెస్టెంట్ల ఎంపిక…
హిందీలో వచ్చే ఇండియన్ ఐడల్ అన్ని మ్యూజిక్ కంపిటీషన్ షోలలోకెల్లా టాప్… దాన్ని అనుకరిస్తూ, అదే పేరుతో తెలుగులో ఆహా ఓటీటీలో థమన్, గీతామాధురి, కార్తీక్, నిత్యామేనన్ జడ్జిలుగా మూడు సీజన్లు ఓ షో నడిచింది… మొదటి రెండు సీజన్లు వోకే.,. థర్డ్ సీజన్ నాసిరకంగా చుట్టేశారు…
Ads
నిజానికి ఇండియన్ ఐడల్ మాత్రమే కాదు… అన్ని భాషల్లో వేర్వేరు పేర్లతో వచ్చే షోలలో ఒక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు… వీలైనంతవరకూ పాటల్లో రంధ్రాన్వేషణలు చేయకుండా కాస్త మెచ్చుకోలు మాటలతో, ప్రశంసలతో ఉత్సాహాన్ని నింపాలనే సూచనల్ని జడ్జిలు అక్షరాాలా పాటిస్తున్నారు…
షో రక్తికట్టడం కోసం రకరకాల డ్రామాలు, స్క్రిప్టులు, గెస్టులు, నటనలు, ఛలోక్తులు కూడా చోటుచేసుకుంటున్నాయి… సరే, సినిమా పాటల పోటీలు అంటేనే ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ షోలు అయ్యాయి కదా… రేటింగుల కోసం ఆ తిప్పలు…
ఐతే కొందరు గాయకుల కంఠస్వరం, గాత్రమాధుర్యం, పాడే మెళకువలు, భావవ్యక్తీకరణ ఇట్టే కనెక్టవుతాయి… అక్కడ డ్రామా అవసరం ఉండదు… జడ్జిల చెవుల్లో నుంచి మోగే ఆ స్వరాలు గుండెల్ని కుదిపేసి, కళ్లు వర్షిస్తాయి… అవి దుఖాశ్రువులు కావు, ఆనందాశ్రువులు కావు… అపరిమిత ఉద్వేగంతో కురిసే అశ్రువులు…
స్నేహ శంకర్… వయస్సు 18 ఏళ్లు మాత్రమే… చిన్నప్పటి నుంచీ బోలెడు షోలలో పార్టిసిపేట్ చేసింది… సాధికారంగా, ఎక్కడా చిన్న తొట్రుపాటు లేకుండా, జంకు లేకుండా, ఓ సీనియర్ గాయని అలవోకగా పాడినట్టు ఆర్ద్రగీతం ఒకటి ఆలపిస్తుంటే… జడ్జిగా ఉన్న శ్రేయా ఘోషాల్ కన్నీళ్ల పర్యంతమైంది… ఆమె తన ఉద్వేగాన్ని అణుచుకోలేకపోయింది… ఇక్కడ డ్రామా ఏమీ లేదు… కృతకంగా కూడా ఏమీ కనిపించలేదు…
ఆమె స్వతహాగా మంచి మెరిటోరియస్ గాయని, ఐనా ఆ స్నేహ శంకర్ పాటను కల్లాకపటం లేకుండా చప్పట్లతో అభినందించింది… విశాల్ దడ్లాని తనూ గాయకుడే, కంపోజర్… ఓపట్టాన ఓ పాటను మెచ్చుకోడు… తను కూడా నిశ్చేష్టుడయ్యాడు ఆ పాట వింటూ… సహ జడ్జి బాద్‌షా కూడా అంతే… అక్కడున్న వాళ్లంతా ఓరకమైన తాదాత్మ్యతలోకి వెళ్లిపోయారు…
ఇదీ ఆ పాట లింక్… https://www.youtube.com/watch?v=R0ky7RxOhoY&ab_channel=IndiakaaMusic
ఈమె ఎవరూ అంటే..? నేటివ్ ముంబై… సింగర్ కమ్ కంపోజర్ రామశంకర్ బిడ్డ… సూఫీ గీతద్వయం శంభు-శంకర్‌లలో శంకర్ మనమరాలు… ఈ వయస్సుకే ఆమె సూఫీ, గజల్, పాప్, హిందుస్థానీ అన్నీ పాడేస్తుంది… సినిమాలు, టీవీ సీరియళ్లకు… ఢిల్లీ ప్రభుత్వ విద్యాగీతం కూడా ఆమె పాడిందే… ఈసారి ఇండియన్ ఐడల్ విజేత కళ్లముందే నిలబడింది అని శ్రేయా ఘోషాల్ వ్యాఖ్యానించింది…
సర్లే… అలా జడ్జిలు అంటూనే ఉంటారు… అప్పట్లో మన షణ్ముఖప్రియను ఇలాగే పైకి లేపారు… చివరకు టాప్ ఫైవ్‌లో కూడా లేకుండా చేశారు… అన్నట్టు… ఈసారి ఐడల్ సీజన్‌లో మన కర్నూలు యువ గాయకుడు అనిరుధ్ సుస్వరం కూడా ఉన్నాడు… అవును, మొన్నటి తెలుగు ఇండియన్ ఐడల్ థర్డ్ సీజన్‌లో పార్టిసిపేట్ చేశాడు… తప్పుడు జడ్జిమెంట్లతో నిరాశకు గురై, నేరుగా హిందీ ఇండియన్ ఐడల్ షోలో చేరాడు..!!
Share this Article