.
భాషాతీత విఖ్యాత రామా!
మనం గమనించంగానీ…భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.
Ads
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది.
చెప్పడానికి వీలుకాకపోతే – అబ్బో అదొక రామాయణం.
జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే – సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే – అదొక పుష్పకవిమానం.
కబళించే చేతులు, చేష్ఠలు కబంధ హస్తాలు.
వికారంగా ఉంటే – శూర్పణఖ.
చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ).
పెద్ద పెద్ద అడుగులు వేస్తే – అంగదుడి అంగలు.
మెలకువలేని నిద్ర – కుంభకర్ణ నిద్ర.
పెద్ద ఇల్లు – లంకంత ఇల్లు.
ఎంగిలిచేసి పెడితే – శబరి.
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే – ఋష్యశృంగుడు.
అల్లరి మూకలకు నిలయం – కిష్కింధ కాండ.
విషమ పరీక్షలన్నీ మనకు రోజూ – అగ్ని పరీక్షలే.
పితూరీలు చెప్పేవారందరూ – మంథరలే.
యుద్ధమంటే – రామరావణ యుద్ధమే.
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ – రావణ కాష్ఠాలే.
కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది.
సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు. ఒక ఊళ్లో పడుకుని ఉంటారు. ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు. ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు. ఒంటిమిట్టది ఒక కథ. భద్రాద్రిది ఒక కథ. అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణమంత- చెబితే మహా భారతమంత.
రాముడికి తెలుగెలా తెలుసు?
త్రేతాయుగం రామాయణ కథతోనే లేపాక్షి కథ కూడా మొదలవుతుంది. సీతమ్మను రావణుడు అపహరించుకుని ఆకాశమార్గాన తీసుకువెళుతుంటే జటాయువు అడ్డగించి…యుద్ధం చేస్తుంది. కోపగించిన రావణుడు పక్షికి రెక్కలే బలం కాబట్టి…ఆ రెక్కలను నరికేస్తే చచ్చి పడి ఉంటుందని…రెక్కలను కత్తిరిస్తాడు. జటాయువు రెక్కలు తెగి…రక్తమోడుతూ…నేల కూలుతుంది. సీతాన్వేషణలో భాగంగా చెట్టూ పుట్టా; కొండా కోనా; వాగూ వంకా వెతుకుతూ రామలక్ష్మణులు జటాయువు దగ్గరికి వస్తారు. సీతమ్మ జాడ చెప్పి…రాముడి ఒడిలో జటాయువు కన్ను మూస్తుంది. తమకు మహోపకారం చేసిన జటాయువు అంత్యక్రియలను రామలక్ష్మణులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంలో జటాయువును చూసిన వెను వెంటనే రాముడన్న మాట-
“లే! పక్షి!”
అదే “లేపాక్షి” అయ్యింది.
తెలుగు భాష దాదాపు 1200 సంవత్సరాల క్రితం పుట్టింది అని ఒక లెక్క. ఇంకా ఉదారంగా అంచనా వేసినా…1500 సంవత్సరాల క్రితం పుట్టి ఉండాలి. ద్వాపర యుగానికి ముందు అంటే ఎంత కాదన్నా ఏడెనిమిది వేల సంవత్సరాలు, రాముడి పదకొండు వేల ఏళ్ల పాలన, లవకుశుల పద్నాలుగు వేల ఏళ్ల పాలన లెక్కల్లోకి తీసుకుంటే జటాయువును రాముడు కలిసింది కనీసం పాతిక వేల సంవత్సరాల క్రితం కావాలి. అప్పటికి- “లే పక్షి! లేచి కూర్చో! నీళ్లు తాగు! నొప్పిగా ఉందా?” అని ఇప్పటి తెలుగులో అప్పటికి లేని భాషలో రాముడెలా మాట్లాడి ఉంటాడు? అని కొందరు పండితులు భాషా చరిత్ర, భాషా పరిణామ చర్చలతో తలలు బాదుకున్నారు. ఇప్పటికీ బాదుకుంటూనే ఉన్నారు.
పండితుల చర్చతో సామాన్యులకు పని లేదు. రాముడు జటాయువును కలిసి… లే! పక్షి! అన్న చోటు లేపాక్షికి మూడు కిలోమీటర్ల దూరంలోని బింగిపల్లి దగ్గర ఉంది. అక్కడ రాతి మంటపం, చిన్న గుడి ఉన్నాయి. ఏడెనిమిది వందల ఏళ్ల క్రితమే దీని ఉనికిని గుర్తించినట్లు ఆధారాలు దొరికాయి.
1945- 75 ల మధ్య మైసూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన బాడాల రామయ్య “లేపాక్షి స్వప్న దర్శనం” పేరిట 1970 లో గొప్ప పద్యకావ్యం రాశారు. ఈ కావ్యానికి విశ్వనాథ సత్యనారాయణ ముందు మాట రాశారు.
“లే” అన్న మాట తెలుగు. “పక్షి” సంస్కృతం. రాముడికి తెలుగు తెలుసా? జటాయువు తెలుగులో మాట్లాడిందా? అప్పుడు తెలుగు ఉందా? అని ప్రశ్నలు, పరిప్రశ్నలు వేసుకోవడానికి బదులు- జటాయువుకు మోక్షమిచ్చిన రాముడు మహా చైతన్యస్వరూపుడు. ఆ చైతన్యంలో సర్వ భాషలున్నాయి. ఏ భక్తుడు ఏ భాషలో మాట్లాడినా… రాముడు అర్థం చేసుకున్నాడు. త్యాగయ్యతో తెలుగులోనే మాట్లాడాడు. రామదాసుతో తెలుగులోనే మాట్లాడాడు. పోతనచేత తెలుగులోనే భాగవతం రాయించాడు. కాబట్టి “లే! పక్షి!” అనే ఉంటాడు. ఒక గుడి మహోదాత్తమైన రాముడి లే పక్షి- పలకరింపును పేరుగా పెట్టుకుని పులకరింతతో శతాబ్దాలుగా నిలిచి ఉంటే…కాదని మనం సాధించేదేముంటుంది? పవిత్రతను పాడు చేసుకోవడం తప్ప!”
రాముడి “లే! పక్షి!” పిలుపే “లేపాక్షి”గా మారి గుడి గోపురమయ్యిందన్న విశ్వనాథవారి వాదనే స్థానికంగా కూడా అనాదిగా వినవస్తున్న కథనం.
అలాంటి రాముడు కాలాతీతుడు. భాషాతీతుడు. తమిళ కావేరీతీరంలో “రారా! మా ఇంటిదాకా!” అని తేట తెలుగులో త్యాగయ్య పిలిస్తే…అయోధ్య సరయూతీరం వదిలి మనోవేగంతో తిరువారూరుకు వచ్చి…త్యాగయ్య నట్టింట్లో కూర్చున్నాడు. మహారాష్ట్రలో పుట్టి…కన్నడనేల మీద పెరిగి…దేశమంతా తిరిగిన పురందరదాసు కన్నడలో పిలిస్తే…కన్నడ కస్తూరి పరిమళాలకు ముగ్ధుడై ఆయనవెంట తిరిగాడు.
తంజావూరు ప్రాంతవాసి అరుణాచల కవి తమిళంలో రామనాటకం సంగీత రూపకం రచించి…గానం చేస్తే…అందులోకి ఒదిగిపోయాడు రాముడు. భద్రాద్రి రామదాసు “ఓ రామ! నీనామమెంతో రుచిరా!” అని కండ చెక్కర, ఖర్జూరం కన్నా తియ్యనైన తెలుగులో చెబితే పొంగిపోయి రామదాసును చెరనుండి విడిపించాడు.
అరుణాచలకవి సంగీతనాటకం ద్వారా రాముడు తమిళ లోగిళ్ళలో తమిళం మాట్లాడుతున్నాడు.
పురందరదాసువల్ల కన్నడనేలమీద తంబురా మీటుకుంటూ హాయిగా కన్నడ కీర్తనలు పాడుకుంటున్నాడు.
త్యాగయ్యవల్ల నగుమోముతో తెలుగు కృతుల్లో మునిగి మైమరచిపోతున్నాడు.
అలా అయోధ్య రాముడికి తమిళం, కన్నడ, తెలుగు రుచి చూపించిన అరుణాచల కవి, పురందరదాసు, త్యాగయ్య విగ్రహాలను అయోధ్యలో ప్రతిష్ఠించాలన్న ఆలోచన ఎవరిదో కానీ… వారికి చేతులెత్తి మొక్కాలి.
సామజవరగమనా కీర్తనలో తను కొలిచే దేవుడిని “కాలాతీత విఖ్యాతుడు” అన్నాడు త్యాగయ్య. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చొరవవల్ల అయోధ్యలో కొలువుదీరిన దక్షిణాది వాగ్గేయకారులు “భాషాతీత విఖ్యాతుడు” అని కూడా కీర్తిస్తూ ఉంటారు.
వెలితి:- ఇంత ఉదాత్తమైన ఆలోచన చేసినవారు మన భద్రాద్రి రామదాసును విస్మరించడం మాత్రం బాగలేదు. రామభక్తి శక్తిని ప్రత్యక్షంగా నిరూపించి, అనుభవించి, తెలుగు కీర్తనల్లో రాముడిని పరబ్రహ్మస్వరూపంగా ఆవిష్కరించి, తరించిన రామదాసు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అన్నట్టు… మొల్ల విగ్రహం పెడితే అయోధ్య రాముడికీ ఆనందం..!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article