Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయోధ్య అసలు దొంగల గుట్టురట్టయింది ఎలాగంటే..?

June 30, 2026 by M S R

.

Srini Journalist …. ₹200 కోట్ల ఆధ్యాత్మిక అవినీతి…
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, శతాబ్దాల నిరీక్షణ తర్వాత సాకారమైన అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల సొమ్ము పక్కదారి పట్టిందనే వార్త దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో అంతర్గతంగా జరిగిన ఈ లూటీ విలువ దాదాపు ₹200 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి ఇంకా వంద శాతం స్పష్టమైన చట్టపరమైన ఆధారాలు పూర్తిగా లభించనప్పటికీ— వివిధ రాజకీయ పార్టీలు, స్థానిక విజిల్‌ బ్లోయర్లు ఆరోపిస్తున్న లెక్కలు, దర్యాప్తు సంస్థల ప్రాథమిక విచారణా సరళిని బట్టి చూస్తే ఇది అత్యంత ఆధ్యాత్మిక అవినీతి గా మారే ప్రమాదం కనిపిస్తోంది.

Ads

అసలు ఇంత పటిష్టమైన భద్రత, నిఘా నీడన ఉన్న ఆలయంలో ఈ ఫ్రాడ్ ఎలా జరిగింది? ఎక్కడెక్కడ లూటీ చేశారు?
ఆలయంలో ప్రధానంగా మూడు విభాగాలలో ఈ నిధుల లూటీ జరిగినట్లు స్పష్టమవుతోంది.
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీని బట్టి దాదాపు 27 హుండీలను ఏర్పాటు చేశారు. నియమ నిబంధనల ప్రకారం ఈ హుండీల తాళాలు అత్యంత భద్రమైన ప్రదేశంలో, ట్రస్ట్ ఉన్నతాధికారుల ఆధీనంలో మాత్రమే ఉండాలి.

కానీ, దొంగతనానికి పాల్పడిన సిబ్బందికి ఈ తాళాలు చాలా సులభంగా లభ్యమయ్యేలా (Easy Access) ఇక్కడి అంతర్గత పర్యవేక్షణ వ్యవస్థలో తీవ్రమైన లోపాలు తలెత్తాయి. దీనిని ఆసరాగా చేసుకుని హుండీల నుంచే నేరుగా నగదును పక్కదారి పట్టించే అవకాశం నిందితులకు దక్కింది.

భక్తులు సమర్పించిన కోట్లాది రూపాయల నగదును లెక్కించే గదిలో అత్యంత పకడ్బందీగా ఈ ఫ్రాడ్ సాగింది. అక్కడ అధికారికంగా సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ, నోట్లు లెక్కించే సమయంలో ఒక నిందితుడు కావాలనే కెమెరా యాంగిల్‌కు పూర్తిగా అడ్డంగా (Opposite) నిలబడేవాడు. ఆ నీడను వాడుకుంటూ మిగిలిన వారు నోట్ల కట్టల నుండి ₹500 నోట్లను వేగంగా దొంగిలించి తమ దుస్తుల్లో దాచేవారు. నిందితులు కేవలం చేతివాటం ప్రదర్శించడమే కాకుండా రికార్డులను కూడా మేనేజ్ చేశారు.

నోట్లు లెక్కించే సమయంలో కొన్ని కట్టలలో అదనపు నోట్లు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపించి వోచర్లు సృష్టించేవారు. ఆ తర్వాత వాటిని బ్యాంకుకు తరలించే సరిగ్గా అదే సమయంలో.. ప్లాన్ ప్రకారం ఆ కట్టల నుండి నగదును మాయం చేసేవారు. దీనివల్ల వోచర్‌లోని కట్టల సంఖ్య బ్యాంకు రికార్డులతో సరిపోయేది కానీ, లోపల ఉండాల్సిన అసలు నగదు మాత్రం లూటీ అయిపోయేది.

ఆలయ అకౌంట్స్ విభాగంలో పనిచేసిన మహిపాల్ సింగ్ అనే విజిల్‌ బ్లోయర్ ద్వారానే ఈ లోపాలు మొదటిసారి వెలుగులోకి వచ్చాయి. హుండీ విరాళాల లెక్కింపులో పారదర్శకత లేదని, కొన్ని నిధులు క్రమంగా మాయమవుతున్నాయని ఆయన ఆధారాలతో సహా ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కి అంతర్గత సమావేశంలోనే ఫిర్యాదు చేశారు.

అయితే, ఆ సమయంలో ట్రస్ట్ అధికారులు ఈ హెచ్చరికను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతోనో, లేదా అంతర్గత వ్యక్తులను కాపాడాలనే ఉద్దేశంతోనో కానీ.. ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా, వ్యవస్థలోని తప్పులను ప్రశ్నించినందుకు గాను మహిపాల్ సింగ్‌ను బాధ్యతల నుండి అక్రమంగా తొలగించారు.

ఈ నేపథ్యంలోనే, గత 22 రోజుల క్రితం అంటే జూన్ 7న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ అంశాన్ని బహిరంగంగా లేవనెత్తడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
విజిల్‌ బ్లోయర్ ఆరోపణలను పైకి కొట్టిపారేసినప్పటికీ, బ్యాంకు రికార్డులలో నిరంతరం భారీ తేడాలు వస్తుండటంతో ట్రస్ట్ ఉన్నతాధికారులకు అనుమానం బలపడింది.

సాధారణ కెమెరాల కళ్లు గప్పి దొంగతనం జరుగుతోందని అర్థమయ్యాక, సిబ్బందికి తెలియకుండా నోట్లు లెక్కించే గదిలో అత్యంత గుప్తంగా రహస్య కెమెరాలను (Hidden Cameras) ఏర్పాటు చేశారు. ఈ రహస్య నిఘా ఫలితాన్ని ఇచ్చింది. సాధారణ కెమెరాలకు నిందితులు అడ్డంగా నిలబడుతున్నప్పటికీ, ఈ గుప్త కెమెరాలు వారి లూటీ పర్వాన్ని పక్కా సాక్ష్యాలతో రికార్డ్ చేశాయి. సిబ్బంది నోట్ల కట్టల నుండి డబ్బులు దొంగిలించి, ఆలయ ప్రాంగణంలోని బాత్‌రూమ్‌లలో దాస్తున్న దృశ్యాలు దొరికిపోయాయి. ఈ తిరుగులేని డిజిటల్ ఆధారాలతోనే ఈ మొత్తం నెట్‌వర్క్ గుట్టు రట్టయింది.

రహస్య కెమెరాల సాక్ష్యాల ఆధారంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT), అయోధ్య పోలీసులు రంగంలోకి దిగి తక్షణమే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న, ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వ్యక్తిగత డ్రైవర్ రామశంకర్ యాదవ్ (టిన్ను యాదవ్) తో పాటు మరో ఏడుగురు అకౌంట్స్ తాత్కాలిక సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

అయితే దర్యాప్తు ఇక్కడితో ఆగలేదు. నోట్ల లెక్కింపు విభాగంలో పనిచేసే మరో 50 మంది ఉద్యోగులు ప్రస్తుతం పోలీసుల తీవ్ర విచారణలో ఉన్నారు. నెలకు కేవలం ₹15 వేల నుండి ₹20 వేల జీతం తీసుకునే వీరు హఠాత్తుగా ఖరీదైన ఐఫోన్లు, కార్లు, ప్లాట్లు కొనడం స్థానికంగా సంచలనం సృష్టించింది. దర్యాప్తు పూర్తి కావచ్చే వరకు ఈ 50 మందిని అయోధ్య నగరాన్ని విడిచి వెళ్లకూడదని (Travel Restrictions) ఆంక్షలు విధించారు. ఈ కుంభకోణం తీవ్రతను బట్టి, ఢిల్లీ నుండి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకుని ఈ 50 మంది విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఈ లూటీ వ్యవహారంలో కీలక నిందితుడు తమకు అత్యంత సన్నిహితుడు కావడం, ఆలయ పరిపాలనలో ఉన్న లోపాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మరో కీలక సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారు.

భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఇటుకలు సురక్షితంగానే ఉన్నాయని, కేవలం హుండీ నగదు మాత్రమే లూటీ అయిందని సిట్ (SIT) తన నివేదికలో స్పష్టం చేసింది. అయినప్పటికీ, వ్యవస్థాగత లోపాల వల్ల ఆలయ ప్రతిష్టకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ట్రస్ట్‌లోని మిగతా సభ్యులపై కూడా తీవ్రమైన నిఘా కొనసాగుతోంది.

(క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు టీటీడీ సలహాలు తీసుకున్న అయోధ్య ఆర్థిక వ్యవహారాల్లో ఆ సలహాలను కోరకపోవడం, తదనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకోకపోవడం ఓ బ్లండర్... అంటే తిరుమల భారీ స్కాములు లేవని కాదు, కానీ మరీ హుండీల దగ్గర నుంచే సిబ్బంది నగదు చోరీలు మాత్రం అయోధ్యకు అప్రతిష్టే...)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయోధ్య అసలు దొంగల గుట్టురట్టయింది ఎలాగంటే..?
  • జై ‘జై మూంద్ర! మన క్రికెట్ జట్టుకు పంక్చర్ కొట్టింది మనవాడే…!!
  • డెస్టినీ..! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం… స్వీయ అస్తమయం వైపు!!
  • ఇండియాను కాలుష్యం కాస్త రక్షిస్తోంది! నమ్మడం లేదా? ఇది చదవండి!
  • ‘బాడీ కౌంట్’ నిజంగా పెరుగుతోందా..? ఉన్నదే బహిరంగం అవుతోందా..?
  • Aeromart 2026 – గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో మరో గ్లోబల్ ఈవెంట్!
  • నితిన్ నబీన్‌జీ … కేసీయార్‌పై ఈగ వాలనివ్వనిది మీరే మహాశయా…
  • బాస్ పేరిట వాట్సప్ మెసేజలు- కోట్లు గల్లంతు – బహుపరాక్
  • చివరి సినిమాలో… ఒక్క పాటలోనే తన నాలుగు అభిమాన పాత్రల్లో…
  • Campa … మార్కెటింగ్‌లో అంబానీ తెలివే తెలివి! వేగంగా నంబర్.3 ప్లేస్!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions