.
. ( – విశీ (వి.సాయివంశీ ) .. …. అక్రమ సంబంధాలు ఉండొచ్చు … అక్రమ అనుబంధాలు ఉండవు
ఒక రచయిత (ప్రకాశ్ రాజ్) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. దిల్లీ నుంచి తిరుగు ప్రయాణమై ఎవరికీ తెలియకుండా తను ప్రేమించిన మహిళ (అర్చన) ఇంటికి వచ్చారు. ఇద్దరూ ప్రేమికులే! అయినా విడిపోయి వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని పాతికేళ్ల కాలం ఒకరినొకరు కలవకుండా గడిపారు.
Ads
ఇన్నాళ్లకు మళ్లీ కలిశారు. ఆమె భర్త చనిపోయాడు. కూతురు మరెక్కడో ఉండి చదువుతోంది. ఆయనను అమితంగా ప్రేమించే ఆయన భార్య (రేవతి) తన ఇంట్లో ఉంది. ఇది వీళ్లిద్దరి కాలం. వీళ్లకు మాత్రమే సొంతమైన 24 గంటల కాలం.
అతను ఆమె చేతి వంట తిని, ఆనాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నాడు. ఎందుకు విడిపోయారో, ఇన్నాళ్లకు ఎందుకు కలిశారో! దేనికీ సమాధానం లేదు. ఉన్నది వాళ్లిద్దరి మధ్య బంధమే! అంతా బాగుందనుకుంటే వింతేముంది?
ఉన్నట్టుండి ఆయనకు గుండెపోటు వచ్చింది. ప్రాణం పోయింది. ఇప్పుడేంటి పరిస్థితి? ప్రపంచం దృష్టిలో తనేమిటి? ఆమెకు, ఆయనకు నడుమ ఉన్న సంబంధం ఏమిటి? అన్నీ ప్రశ్నలే! సమాధానాలు లేవు. చెప్పగలిగిన వారు ఎవరు? చెప్తే అర్థం చేసుకోగలిగిన వారు ఎవరు? పోలీసులు, మీడియా రకారకాల ఊహాగానాలు చేస్తున్నారు.
భర్త ప్రాణం పోయిందని తెలిసిన రేవతి అర్చన ఇంటికి వస్తుంది. ఇళ్లంతా శూన్యం. అర్చన మనసులాగే! వచ్చినావిడ గోల చేయదు. ఈమెను నిలదీయదు. నోరారా తిట్టదు. అనుమానించదు. “మీ కూతురుకు చాలామంది మగ స్నేహితులు ఉంటారు. వాళ్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా జరిగితే అనుమానిస్తామా? అవమానిస్తామా?” అంటుంది. ఎంత గొప్ప మాట! ఎంత గొప్ప మనసు! ఎలా? ఎలా సాధ్యమైంది?
“నా భర్త రచయిత. ఎన్నో ఉదాత్తమైన పాత్రలు రాశారు. వాటినే ఆయన అంత గొప్పగా చిత్రించినప్పుడు, ఇన్నాళ్లు ఆయనతో కలిసి ఉన్న నేను ఇంకెంత ఉదాత్తంగా ఆలోచించాలి? అలా ఆలోచించ లేకపోతే మా దాంపత్య బంధానికి అర్థమేమిటి?” అంటుంది. ఆ మాటతో మనకు ఏడుపుగా అనిపిస్తుంది.
గొప్ప కథకు గొప్ప నటులు కుదిరినప్పుడు ఆ సినిమా ఎంత హృద్యంగా ఉంటుందో చెప్పడానికి 2019లో వచ్చిన తమిళ సినిమా ‘అళియాద కోళంగల్’ గొప్ప ఉదాహరణ. దేశం గర్వించదగ్గ నలుగురు నటులు ఇందులో నటించారు. అర్చన, రేవతి, ప్రకాశ్ రాజ్, నాజర్. అందులో ముగ్గురు జాతీయ పురస్కార గ్రహీతలు.
సరైన పాత్రలు దొరకాలి గానీ, వాళ్ల నటన సంగతి చెప్పేదేముంది? ప్రముఖ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు బాలూ మహేంద్ర మరణానంతరం ఆయనకు నివాళిగా తీసిన సినిమా ఇది. అందుకే ఆయన 1979లో తీసిన సినిమా ‘అళియాద కోళంగల్’ పేరే దీనికి పెట్టారు. అంటే ‘చెదిరిపోని ముగ్గులు’ అని అర్థం.
ఈ చిత్రంలో పాత్రలు అలాంటివే! సరైన చిత్రానికి సరైన పేరు. ఎం.ఆర్.భారతి ఈ సినిమాకి దర్శకుడు. ‘సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం ఉన్న ఒక్క సన్నివేశం అయినా సరే నటిస్తాను’ అంటుంటారు నటీనటులు. దొరకాలి కదా? ఈ చిత్రంలో నటి రేవతికి అలాంటి పాత్ర దొరికింది. ఆమె కనిపించేది రెండే సన్నివేశాలు. అయితేనేం? అందర్నీ డామినేట్ చేసేంత బలమైన నటనతో ఆకట్టుకున్నారు.
సినిమా పూర్తయ్యాక ఆమె పాత్రే గుర్తుండిపోతుంది. అర్చన మాత్రం తక్కువా? చిత్రం చివర్లో రేవతి ఆమెతో మాట్లాడి వెళ్లాక అర్చన తన మనసులో భారం దించేసుకుని వానలో తడుస్తూ, తనివితీరా వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ సన్నివేశంలో ఆమె తడుస్తూ ఏడుస్తుంది. అప్పటిదాకా కథలో లీనమైన ప్రేక్షకులు తడవకుండా ఏడుస్తారు.
పక్క మనిషి మీద కాసింత ప్రేమ, కాస్త స్నేహం చూపించడానికీ నోచని స్థితి వస్తే అదేమి జీవితం? ఆడామగా కలిసి ఉన్న ఒక సందర్భానికీ పెడర్థాలు తీస్తే అదేమి సమాజం? ఈ ప్రపంచంలో అక్రమ సంబంధాలు ఉండొచ్చు. అక్రమ అనుబంధాలు ఉండవు. ప్రతి అనుబంధమూ గుండె లోతుల్లో నుంచి పుట్టేదే! అర్థం చేసుకోలేని మనుషులు ఏమి మనుషులు? ప్రేమ చాలా విలువైనది. అందరూ దాన్ని ఎంచలేరు. (సినిమా YouTubeలో అందుబాటులో ఉంది.
Share this Article