.
( రమణ కొంటికర్ల 99126 99960 ) … చరిత్ర సాధించినవారి ఘనతలనే కాదు… విధ్వంసం సృష్టించినవారి కథలను కూడా నమోదు చేస్తుంది. అలాంటి వాడే అజ్మల్ కసబ్. ఈ టెర్రరిస్ట్ పేరు కూడా భారత్ ఎప్పటికీ మర్చిపోదు. మర్చిపోలేదు. ముంబై ఉగ్రదాడుల కేసులో ప్రధాన నిందితుడు. అలాంటి కసబ్ తరపున జరిగిన విచారణలో.. కసబ్ చేసిన కొన్ని వాదనలు ఎంతగా ఆశ్చర్యపర్చాయో తాజాగా ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్ గుర్తు చేసుకున్నారు.
కౌన్ బనేగా కరోడ్ పతి – 18 కార్యక్రమానికి నటులు రాజ్ కుమర్ రావ్, వామికా గబ్బీతో కలిసి ఉజ్వల్ నికమ్ కూడా హాజరయ్యారు. ఆ క్రమంలో 26/11 కేసు విచారణకు సంబంధించిన ఉజ్వల్ పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
Ads
తొలిసారి కసబ్ కోర్టుకు రాగానే తననే తదేకంగా చూశాడని.. తాను కూడా అతణ్నే ఎక్కువ గమనిస్తూ కూర్చున్నానన్నారు. అంటే, అతడి ప్రవర్తన, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ తో అతడి మానసిక స్థితిని అర్థం చేసుకునే ప్రయత్నమన్నది నికమ్ అభిప్రాయం.
కసబ్ నుంచి ఊహించని వాదన!
కసబ్ 26/11 దాడుల తర్వాత పట్టుబడొచ్చునేమోగానీ.. అంతకుముందే జూహూలో చౌపట్టీ వద్ద కసబ్ ను పట్టుకున్నారు పోలీసులు. అసలు కసబ్ ముంబైకి రావడానికి ప్రధాన కారణం అమితాబ్ బచ్చన్ ను చూడటానికేనట. ఇవన్నీ ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్ చెప్పిన మాటలు. స్వయంగా కసబ్ కోర్టులోనే ఈ విషయాన్ని చెప్పినట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు.
మరి అమితాబ్ ఏమన్నారు..?
ఈ విషయమిలా ఉంటే… స్పాంటేనియస్ గా అమితాబ్ స్పందన మరింత ఆకట్టుకుంది. ఎందుకంటే అసలే సినిమా హీరో. స్టంట్స్ కు పెట్టింది పేరుగా బాలీవుడ్ ను ఊపేసిన హీరో మాటలూ… అలాంటి సమయస్ఫూర్తితోనే సాగాయి. కసబ్ అప్పుడు మా ఇంటికే వచ్చి ఉంటే.. మా ఇంటి నుంచి తిరిగి వెళ్లేవాడే కాదు.. అక్కడికక్కడే కాల్చేసేవాళ్లమంటూ ఉజ్వల్ నికమ్ సీరియస్ గా చెప్పిన మాటలపై.. అంతకంటే సరదాగా అమితాబ్ స్పందించారు.
కసబ్ మరో వాదన గురించీ నికమ్ ఏమన్నారంటే..?
కసబ్ తనను తాను మైనర్ గా చూపించుకునే యత్నం చేశాడు. తనపై జువైనైల్ జస్టిస్ చట్టం ప్రకారం తన గురించి వాదనలు జరగాలని పట్టుబట్టాడు. దాంతో కసబ్ వయస్సు నిర్ధారణ కొరకు వైద్య పరీక్షలు, బోన్ డెన్సిటీ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించారట.
తనను రా అధికారులు పట్టుకున్నారనీ… ఉగ్రదాడుల్లో తాను పాల్గొనలేదనీ వివిధ వాదనలనూ కసబ్ కోర్టు ముందు చేసినట్టు నికమ్ ఆ షోలో ద్వారా తెలియజేశారు.
అయితే, కసబ్ చేసిన ఆ వాదనలను దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా ఎదుర్కొన్నాయి. సీసీ టీవీ ఫుటేజ్ సహా, వివిధ ఆధారాలతో ప్రాసిక్యూషన్ కోసం కోర్టులో సమర్పించాయి.
కసబ్ కేసులో ఉరిశిక్షకు నాల్గేళ్లెందుకు పట్టింది..?
నికమ్ చెప్పిందంతా విన్నాక.. సావధానంగా అమితాబ్ నికమ్ ను అడిగిన ప్రశ్న ఇది. 26/11 దాడుల తర్వాత కసబ్ ను ఉరి తీయడానికి దాదాపు నాల్గేళ్లు ఎందుకు పట్టిందని అమితాబ్ ప్రశ్నించారు. దానికి నికమ్ స్పందిస్తూ.. చట్టపరమైన ప్రక్రియను పూర్తిగా పాటించాల్సిందేనన్నారు.
నిందితుడికి తనను తాను సమర్థించుకునేందుకు, ప్రూవ్ చేసుకునేందుకు అవకాశమివ్వడం తప్పనిసరి. అలాగే, కోర్ట్ విచారణ, అప్పీల్స్ వంటి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలు పూర్తయ్యాకేగానీ శిక్షలు అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు నికమ్.
అయితే తనను తాను తప్పు చేయలేదని మొదట డిఫెండ్ చేసుకున్న కసబ్.. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్ర చేసినట్టు ఆఖరులో మాత్రం పశ్చాత్తాపం ప్రకటించాడట. ఏదేమైనా తన పనులకు తానే బాధపడటమన్నదే ఏ వ్యక్తికైనా అతి పెద్ద శిక్ష అంటూ ముగించారు ఉజ్వల్ నికమ్…
Share this Article