Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహా… కడుపు పండిన ఓ కొత్త కథ…! 30 ఏళ్ల పిండం ప్రాణం పోసుకుంది..!!

August 1, 2025 by M S R

 

ఓ “పురాతన” శిశువుకు స్వాగతం… మొన్నటి వారాంతంలో పుట్టిన ఒక శిశువు “అత్యంత పురాతన శిశువు”గా కొత్త రికార్డు సృష్టించాడు… అర్థం కాలేదా..? జూలై 26న జన్మించిన థాడియస్ డేనియల్ పియర్స్, 30 సంవత్సరాల పాటు నిల్వ ఉంచిన ఒక పిండం నుంచి అభివృద్ధి చెందాడు… నిజం…

అతని తల్లి లిండ్సే పియర్స్ ‘‘వాడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు… మాకు ఇంత అమూల్యమైన శిశువు ఉండటం అద్భుతంగా ఉంది!” అని సంబురపడుతోంది.,. ఎక్సలెంట్ అనుభవం కదా మరి… అయితే ఆమె జెనెటిక్ కొడుకు కాదు ఆ శిశువు…

Ads

ఒహియోలో నివసించే లిండ్సే, ఆమె భర్త టిమ్ పియర్స్, 1994లో ఒక మహిళ నుంచి ఆ పిండాన్ని “దత్తత” తీసుకున్నారు… ఇది ఓ “సైన్స్ ఫిక్షన్ సినిమాలోని ఒక కథ”లా ఉందని ఆమె కుటుంబం అబ్బురపడుతోంది… ఎందుకంటే… “ఈ బిడ్డకు 30 ఏళ్ల అక్క కూడా ఉంది” … ఇంకా నమ్మలేకపోతున్నాను అని ఆ పిండాన్ని దానం చేసిన 62 ఏళ్ల లిండా ఆర్చర్డ్ అంటోంది…

మూడు చిన్న ఆశలు
ఈ కథ 1990ల ప్రారంభంలో మొదలవుతుంది… ఆర్చర్డ్ ఆరు సంవత్సరాలుగా గర్భం ధరించడానికి ప్రయత్నించి విఫలమైంది… ఆమె, ఆమె భర్త అప్పట్లో కొత్త సాంకేతికత అయిన IVF (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు… “అప్పట్లో చాలా మందికి దాని గురించి తెలియదు” అని ఆర్చర్డ్ గుర్తుచేసుకుంటోంది… చాలా మంది ‘అసలు మీరు ఏమి చేస్తున్నారు?’ అని అడిగేవారు…

ఎవరు ఏమంటున్నా సరే, తమ ప్రయత్నాల్లో ముందుకు సాగారు.., మే 1994లో వారు నాలుగు పిండాలను సృష్టించగలిగారు… వాటిలో ఒకటి లిండా గర్భంలోకి బదిలీ చేయబడింది… అది ఒక ఆరోగ్యకరమైన ఆడపిల్లగా పుట్టింది… మిగిలిన మూడు పిండాలను క్రయోప్రిజర్వ్ చేసి, స్టోరేజ్ ట్యాంకులో ఉంచారు…

ఇది 31 సంవత్సరాల క్రితం… అప్పుడు పుట్టిన ఆ ఆరోగ్యకరమైన ఆడపిల్ల ఇప్పుడు 30 ఏళ్ల మహిళ.., ఆమెకు తన సొంతంగా 10 ఏళ్ల కూతురు కూడా ఉంది. కానీ మిగిలిన మూడు పిండాలు కాలంలో గడ్డకట్టబడ్డాయి…

ఆర్చర్డ్ మొదట ఆ పిండాలను తానే ఉపయోగించాలని అనుకుంది… “నాకు మరో బిడ్డ కావాలని ఎల్లప్పుడూ కోరుకున్నాను…” అంటున్న ఆమె “వాటిని నేను నా మూడు చిన్న ఆశలు అని పిలిచేదాన్ని…” అని చెబుతోంది… కానీ ఆమె అప్పటి భర్త మాత్రం వేరుగా ఆలోచించాడు… తరువాత ఆర్చర్డ్ అతనితో విడాకులు తీసుకుంది.., కానీ ఆమె తన పిండాల సంరక్షణ, ఓనర్‌షిప్ గెలుచుకుంది… అయితే వాటిని భవిష్యత్తులో మరొక భాగస్వామితో ఉపయోగించుకోవచ్చనే ఆశతో అలాగే స్టోరేజీలో ఉంచింది…

old embroyo

దీనికోసం ఆమె 30 ఏళ్లుగా వార్షిక స్టోరేజ్ రుసుము చెల్లించాల్సి వచ్చింది.., అవి కాలక్రమేణా పెరిగీ పెరిగీ సంవత్సరానికి వెయ్యి డాలర్ల వరకు అయ్యాయి… ఆమెకు అది ఖరీదైనదే… ఐనా సరే, వాటిని అలాగే నిల్వ చేస్తూ వచ్చింది… ‘‘ఇది సరైన పనే, నో రిగ్రెట్స్…’’ అంటోంది…

ఆమెకు మెనోపాజ్ ప్రారంభమైనప్పుడు పరిస్థితులు మారాయి… ఆమె తన ఎంపికలను పరిశీలించింది… ఇక పిండాలను వదిలేయడం లేదా పరిశోధన కోసం దానం చేయడం… ఆమెకు అది ఇష్టం లేదు. అలాగే వాటిని మరొక కుటుంబానికి అజ్ఞాతంగా దానం చేయడం కూడా ఇష్టం లేదు… ఆ పిండాలు తన కూతురికి తోబుట్టువులుగానే పుట్టాలి అనుకుంది…

అప్పుడు ఆమె పిండం “దత్తత” గురించి తెలుసుకుంది… ఇది ఒక రకమైన పిండ దానం.., అమెరికాలో ఈ దత్తత సేవలను అందించే అనేక సంస్థలు ఉన్నాయి.., కానీ చాలా కాలం నిల్వ ఉంచిన పిండాలను అంగీకరించవు… దీనికి ఒక కారణం… ఆ పిండాలను పాత పద్ధతుల్లో నిల్వ చేసి ఉంటారు, అలాగే సక్సెస్ రేటు తక్కువ అనే భావన…

చాలా సంస్థలు ఆమె ఆలోచనను తోసిపుచ్చాయి, కుదరదు అన్నాయి… అప్పుడు తనకు నైట్ లైట్ క్రిస్టియన్ అడాప్షన్స్ ఏజెన్సీచే నిర్వహించబడే స్నోఫ్లేక్స్ అనే కార్యక్రమం గురించి తెలిసింది… ఈ సంస్థ ఆమె పిండాల దత్తత ప్రక్రియ నిర్వహించడానికి అంగీకరించడానికి సిద్ధంగా ఉంది.., కానీ పిండాల ల్యాబ్ రికార్డులు కావాలంది…

అందుకే ఆర్చర్డ్ దశాబ్దాల క్రితం ఆమెకు చికిత్స చేసిన సంతానోత్పత్తి వైద్యుడికి ఫోన్ చేసింది… ఆ డాక్టర్, ఇప్పుడు 70 ఏళ్ల వయస్సులో ఉన్నాడు.., ఇంకా ఒరెగాన్లో ఒక క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు… ఆయన ఆర్చర్డ్ రికార్డులను తన బేస్మెంట్ నుంచి వెలికితీశాడు… వాటిలో కొన్ని చేతితో రాసినవి… అలా ఆమె పిండాలు 2022లో నైట్ లైట్ “మ్యాచింగ్ పూల్”లో చేరాయి…

మ్యాచింగ్ చేయడం…

‘‘ఎవరికి దత్తత ఇచ్చినా సరే, బిడ్డ దేశం దాటి పోకూడదు, పైగా క్రిస్టియన్ కుటుంబం అయి ఉండాలి’’ అని ఆర్చర్డ్ కోరిక… దాంతో మ్యాచింగ్ చేయడానికి కొంత సమయం పట్టింది… దత్తత ఆసక్తి ఉన్నవాళ్లు కూడా ఈ 30 ఏళ్ల పిండం మీద ఆసక్తి చూపలేదు… అపనమ్మకం… సక్సెస్ మీద, నాణ్యత మీద…

అయితే లిండ్సే, పియర్స్ జంట తమకు పిండం దత్తత కావాలని ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నారు… 35, 34 ఏళ్ల ఈ జంట ఏడు సంవత్సరాలుగా బిడ్డ కోసం ప్రయత్నించి, అనేకమంది వైద్యులను కలిసింది… చివరకు పిండం దత్తత మీద దృష్టి పడింది… రీజోయ్ ఫెర్టిలిటీ అనే IVF క్లినిక్లో నమోదు చేసుకున్నారు… ఏళ్లుగా నిల్వ చేయబడుతున్న పిండాలను డిస్పోజ్ చేయడం కోసమే డాక్టర్ గోర్డన్ ఆ క్లినిక్ నడుపుతున్నాడు…

ఆయన 2022లో ఇలాగే 30 ఏళ్ల క్రితం నిల్వ చేసిన పిండాన్ని ఓ జంటకు మ్యాచ్ చేస్తే, కవలలు పుట్టారు… గడ్డకట్టిన పిండాన్ని యాక్టివేట్ చేసి, ఓ శిశువును పుట్టించడం అంటే మాటలు కాదు అంటాడాయన… ఆ సవాళ్లకు తనెప్పుడూ రెడీయే…


IVF ప్రారంభ రోజుల్లో, నిల్వ కోసం ఉద్దేశించిన పిండాలను నెమ్మదిగా స్తంభింపజేసేవారు… ఈ సాంకేతికత పిండాల ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గిస్తుంది… కానీ నెమ్మదిగా స్తంభింపజేయడం వల్ల హానికరమైన మంచు స్ఫటికాలు ఏర్పడవచ్చు కాబట్టి.., 2000లలో క్లినిక్లు విట్రిఫికేషన్ అనే సాంకేతికతకు మారాయి… ఇందులో పిండాలను స్ట్రాస్ అని పిలిచే సన్నని ప్లాస్టిక్ ట్యూబులలో ఉంచి, ద్రవ నైట్రోజన్ ట్యాంకులలోకి ఉంచుతారు. ఇది పిండాలను వేగంగా స్తంభింపజేసి, గాజులాంటి స్థితికి మారుస్తుంది…


పిండాలను తర్వాత ట్యాంకుల నుంచి తీసి, వేగంగా— రెండు సెకన్లలోపు— వెచ్చని “థావ్ మీడియా”లోకి ముంచడం ద్వారా కరిగించవచ్చు.. కానీ పాత పద్ధతిలో నెమ్మదిగా స్తంభింపజేసిన పిండాలను కరిగించడం మరింత క్లిష్టమైనది… పిండాలను ఎలా సంరక్షించారు, దేనిలో నిల్వ చేశారు అనే దానిపై ఆధారపడి అవసరమైన కరిగించే పద్ధతి మారుతుంది… కొన్ని పరికరాలను స్టోరేజ్ ట్యాంకు లోపల తెరవాలి. దీనికి ద్రవ నైట్రోజన్లో ఫోర్సెప్స్, డైమండ్ బ్లేడ్ ఉన్న కత్తులు, ఇతర సాధనాలను ఉపయోగించాల్సి ఉంటుంది…

ఎలాగోలా తిప్పలు పడి ఆ మూడు పిండాలనూ బయటికి తీశారు… మూడు పిండాలలో ఒకటి పెరగడం ఆగిపోయింది… మిగిలిన రెండింటిని నవంబర్ 14న లిండ్సే గర్భంలోకి బదిలీ చేశారు… వాటిలో ఒకటి ఆరోగ్యంగా పెరగసాగింది…

ఇప్పుడు బిడ్డ పుట్టింది… ఆ పిండాన్ని దత్తత ఇచ్చిన ఆర్చర్డ్ చాలా సంబురపడిపోతోంది… అచ్చం వాడు నా కూతురిలాగే ఉన్నాడు… తోబుట్టువులు… నాకు మరో బిడ్డ పుడితే బాగుండునని కోరుకున్నాను, అదిలా నెరవేరింది అంటోంది… తన జెనెటిక్ కొడుకును చూడటానికి, ఎత్తుకుని ముద్దాడటానికి ఆమె బయలుదేరింది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!
  • ఊరికే రావు జాతీయ అవార్డులు… ఎక్కడైనా సరే లెక్కలుంటాయండీ…
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…
  • ‘‘నాకు ఇండియాతో అనుబంధం ఉంది… హైదరాబాద్‌లో వర్క్ హేపీ…’’
  • మీకు తెలుసా..? ఇండియాలో ఫస్ట్ మొబైల్ కాల్ ఎప్పుడు, ఎవరు, ఎవరికి..?!
  • ఈ ట్రంపరి వేషాలతో… నాటి జార్జి ఫెర్నాండెజ్ మళ్లీ గుర్తొస్తున్నాడు…
  • ఆహా… కడుపు పండిన ఓ కొత్త కథ…! 30 ఏళ్ల పిండం ప్రాణం పోసుకుంది..!!
  • హవ్వ… KCR పార్టీ ఫిరాయింపులు, రాజకీయ నైతికతలపై మాట్లాడడమా..?!
  • ట్రంపు దుర్బుద్ది, ఆంక్షల విషం వెనుక ‘అణువార్ హెడ్స్’… పార్ట్-3…
  • పాకిస్థాన్‌లోని ఆ అణు వార్‌హెడ్స్ అమెరికావే… ఎందుకంటే..? (పార్ట్-2)

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions