Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హక్..! దశాబ్దాలనాటి ఆ షాబానో కేసు ఈ సినిమా కథకు నేపథ్యం..!

November 10, 2025 by M S R

.

( రమణ కొంటికర్ల ) .…. ఇమ్రాన్ హష్మీ, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన హక్ ఇప్పుడు మళ్లీ ఒక్కసారి 45 ఏళ్ల క్రితం జరిగిన షాబానో కేసును తిరిగి స్ఫురణకు తెచ్చింది…

ఈ కోర్ట్ డ్రామా ప్రేక్షకుల నుంచి మన్ననలందుకుంటుండగా… విమర్శకుల నుంచి కూడా మెప్పు పొందుతుండటంతో.. షా బానో నిజజీవిత కథ మళ్లీ ఒకసారి చర్చల్లోకొచ్చింది. హక్ సినిమాకు షా బానో త్రిబుల్ తలాక్ కేసే ప్రేరణ…

Ads

ఇంతకీ ఏంటా కేసు..?

స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న న్యాయ, సామాజిక కేసుగా షా బానో జీవితంలో జరిగిన ఉదంతాన్ని చెప్పుకుంటారు. మహిళల హక్కులు, లౌకికవాదం, మతం ఇలాంటి అంశాలపై ఒక సమగ్రమైన చర్చకు తెరలేపింది.

సరిగ్గా 1978లో ఈ కథ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన 62 ఏళ్ల ముస్లిం మహిళ షా బానోకు, తన భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ 40 ఏళ్ల వివాహనంతరం త్రిబుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చాడు. ఎలాంటి ఆర్థిక సాయమందించకుండా, పిల్లల పోషణ అనే బాధ్యతను కూడా పట్టించుకోకుండా భార్యను జస్ట్ త్రిబుల్ తలాక్ అనే విధానంతో వదిలిపెట్టడంతో షా బానో… 125 సీఆర్పీసీ కింద కోర్టులో పిటిషన్ వేసింది. ఈ చట్టం ఏ మతానికి చెందిన మహిళైనా భర్త నుంచి విడాకులు పొందితే స్వయం ఉపాధి పొందలేని స్థితిలో భర్త నుంచి పోషణ పొందే హక్కును కల్పిస్తుంది.

షా బానో కింది కోర్టులో వేసిన కేసు చివరకు, 1985లో.. అంటే కేసు వేసిన ఏడేళ్ల తర్వాత సుప్రీం వరకు చేరింది. సుప్రీంలో షా బానో కేసు గెల్చింది. షా బానోకు విడాకులిచ్చిన భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ భరణం చెల్లించాలని తీర్పు వచ్చింది. ఆ హక్కు షా బానోకు ఉందని సుప్రీం కోర్ట్ ప్రకటించింది.

సుప్రీం ఇచ్చిన తీర్పు మత ఛాందసవాదాన్ని నమ్ముకునేవాళ్లకు ఒక చెంపపెట్టులా మారింది. వ్యక్తిగత కట్టుబాట్లు, మతపరమైన చట్టాలకన్నా కూడా లౌకిక చట్టందే పైచేయి అని నిరూపించింది. ముఖ్యంగా మహిళా సమానత్వం విషయంలో ఒక చర్చకు తెరలేపింది. అంతేకాదు, భారతీయ ముస్లిం మహిళల హక్కులను నిలబెట్టిన ఓ మైలురాయిగా కూడా షా బానో కేసు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

అదే సమయంలో మతపరమైన చట్టాలకు కట్టుబడిన సంప్రదాయ ముస్లిం వర్గాల్లో మాత్రం ఈ తీర్పు పెద్ద చిచ్చే రేపింది. సుప్రీం తీర్పును కూడా వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ వ్యక్తిగత, మతపరమైన చట్టాల్లో జోక్యం చేసుకోవడాన్ని కొన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండించాయి.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి!

దాంతో సహజంగానే రాజకీయ ఒత్తిడి కూడా పెరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1986లో ముస్లిం మహిళల కోసం ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవోర్స్ అనే చట్టాన్ని ఆమోదించింది. ఆ చట్టం అంతకుముందు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును బలహీనపర్చేదిగా ఉండటంతో అది రాజకీయ దుమారానికి దారితీసింది. ఇద్దత్ కాలం వరకే.. అంటే, విడాకులిచ్చిన తర్వాత సుమారు కేవలం మూడు నెలల వరకే.. భర్త, భార్య బాధ్యతను చూసేలా పరిమితం చేసింది కాంగ్రెస్ ఆమోదించిన ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవోర్స్ చట్టం.

కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టు.. కాంగ్రెస్ చట్టసభల్లో ఆమోదించిన చట్టంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై వచ్చిన ఒత్తిడిని మించి మళ్లీ సవాళ్లను ఎదుర్కోవాల్సిన వచ్చింది కాంగ్రెస్. చాలామంది మహిళా హక్కుల విషయంలో వెనకుడుగు నిర్ణయంగా.. ఓట్ బ్యాంక్ రాజకీయాలకు లొంగిన నిర్ణయంగా కాంగ్రెస్ పార్టీని, నాటి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.

అయినా, షా బానో కేసు మహిళా సాధికారిత, లౌకికత, వ్యక్తిగత చట్ట సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చలకు కారణమైంది. ఎంతలా అంటే 2017లో సుప్రీం కోర్ట్ ఇన్ స్టంట్ త్రిబుల్ తలాక్ ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడానికి ఒక పునాదిలా నిల్చింది షా బానో కేసు. అంతేకాదు, భారత్ వంటి దేశంలో మత స్వేచ్ఛ, సంవిధాన సమానత్వం, న్యాయం వంటివాటి మధ్య సమతుల్యతను సాధించేందుకు జరిగిన పోరాటంగా.. ఒక నిర్ణాయక ఘట్టంగా చరిత్రలో నిల్చిపోయింది.

దాన్నే హక్ సినిమాకు ప్రేరణగా, కోర్ట్ డ్రామాగా అంతే ఆసక్తిగా మల్చడంతో సినిమా పాజిటివ్ రివ్యూస్ ను అందుకోవడంతో పాటు, మళ్లీ షా బానో కేసు కూడా చర్చల్లోకొచ్చింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాది కవితాగానం కాదు… కాలజ్ఞానం… అందెశ్రీ అంతరంగం ఇదీ…
  • హక్..! దశాబ్దాలనాటి ఆ షాబానో కేసు ఈ సినిమా కథకు నేపథ్యం..!
  • బాడీ షేమింగ్..! ఫిలిమ్ జర్నలిస్టులు ఎక్కడైనా అదే తిక్క ధోరణి..!!
  • అందెశ్రీ..! ప్రజా కవి, సహజ కవి, ప్రకృతి కవి… మాయమైపోయాడు..!!
  • శారద పాత్ర ఉంటే చాలు… పరుచూరి బ్రదర్స్ కలాలకు పదును…
  • వయోలినిస్ట్ సుడిగాలి సుధీర్… ఆసక్తికరంగా ఓ టీవీ షో ప్రోమో…
  • రోత కూతలు… చిల్లర వ్యాఖ్యానాలు… వీడెవడ్రా బాబూ..?!
  • రోజూ 2 లక్షల మందికి వండి వడ్డించగల అత్యంతాధునిక వంటశాల
  • బండి సంజయ్ సెలుపుతున్నడు… సునీత, కేటీయార్ గ్రేట్ విలనీ అట..!!
  • మన న్యాయవ్యవస్థలో న్యాయం ఓ ఎండమావి… ఈ నివేదిక చెప్పేదిదే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions