సోషల్ మీడియా మూవీ రివ్యూయర్లకు ఓ దుర్వార్త… అంటే తక్షణం ఇదేదో అమల్లోకి వచ్చి, అందరి కలాలకు సంకెళ్లు వేస్తుందని కాదు… కానీ క్రమేపీ అడ్డదిడ్డం పెయిడ్, నెగెటివ్ ధోరణికి బ్రేక్స్ మాత్రం పడే సూచనలున్నయ్… ఇది తొలి మెట్టు… ఏమిటీ అంటారా..?
కేరళ హైకోర్టు సోషల్ మీడియా మూవీ రివ్యూలపై అడ్వొకేట్ శ్యామ్ పద్మన్‌ను అమికస్ క్యూరీగా నియమించింది… (ఈమధ్య ఈటీవీలో బుల్లెట్ భాస్కర్ కావచ్చు, ఒక స్కిట్‌లో ఓ మాటంటాడు.,. ఒరేయ్, సినిమా మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ కూడా పూర్తి గాకుండానే రివ్యూ పోస్ట్ చేశారేమిట్రా అని…)
నిజమే… మీడియా రివ్యూల ఇంపాక్ట్ ఉంటుందని గ్రహించి, కొన్నాళ్లు వేదికలపై మొత్తుకున్నారు దర్శకులు, నిర్మాతలు… తరువాత దానికి విరుగుడు కనిపెట్టి, తామే పెయిడ్ రివ్యూలు రాయించడం మొదలెట్టారు… (ఆమధ్య విష్వక్సేన్ ఓ యూట్యూబర్‌తో పెట్రోల్ క్యాన్ ఎపిసోడ్ చేయించాడు గుర్తుందా..?) మరోవైపు కావాలని రాసే నెగెటివ్ రివ్యూలు సరేసరి… (తన గామి సినిమాపై కావాలనే నెగెటివ్ రివ్యూలు, రేటింగులతో ఐఎండీబీ రేటింగ్స్‌ను టార్గెట్ చేశారని కూడా విష్వక్సేన్ ఆరోపణ)… ఇక యూట్యూబుల్లో ఆ థంబ్ నెయిల్స్, ఆ రివ్యూలు మరో అరాచకం… (సరే, సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు చెప్పినట్టు రివ్యూలు ఒక సినిమా గెలుపోటములను ప్రభావితం చేయలేవు…)
Ads
కాకపోతే ఓ సమస్య ఉంది… ఇప్పుడు సినిమాలన్నీ వారం వ్యవధిలో డబ్బును వాపస్ తీసుకోవాలనే ప్రణాళికతో విడుదలవుతున్నయ్… ఎక్కువ థియేటర్లు, ఆ థియేటర్ల సిండికేట్ల ఆటలు, నాటకాలు, అంతా పెద్ద దందా… అదో మాఫియా… ఈ స్థితిలో ప్రాథమికంగానే నెగెటివ్ రివ్యూలు వస్తే, ప్రేక్షకుడు ఓటీటీల్లో చూడొచ్చులే అని థియేటర్‌ను అవాయిడ్ చేస్తున్నాడు… ఈ నేపథ్యంలో ఓ వార్త చదవండి…
అమికస్ క్యూరీ దాకా వచ్చాం కదా… ఆయన కోర్టుకు సబ్మిట్ చేసిన ఓ రిపోర్టులో ఏమంటున్నాడు అంటే..? ‘‘సినిమా విడుదలయ్యాక కనీసం 48 గంటల వెయిటింగ్ పీరియడ్ ఇవ్వాలి… ఈ కూలింగ్ పీరియడ్ ఎలా అమలు చేయాలో పోలీసులు ప్లాన్ చేయాలి… సినిమా మీద ప్రేక్షకులే సొంతంగా ఓ అభిప్రాయాన్ని క్రియేట్ చేసుకునే వ్యవధి ఇవ్వాలి… ‘రివ్యూ బాంబింగ్’ (భలే పదం వాడుతున్నది కేరళ ఇండస్ట్రీ) అరికట్టడానికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఓ పోర్టల్ క్రియేట్ చేసి, కంప్లయింట్స్ స్వీకరించాలి, యాక్షన్ వెంటనే ఉండాలి…’’
‘‘ప్రజల సినిమా వీక్షణంపై సోషల్ మీడియా ప్రభావం ఖచ్చితంగా ఉంటోంది… అయితే సినిమాల ప్రమోషన్ లేదంటే హానిచేయడం… ఈ రివ్యూల్ని కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా ఓ నియంత్రణ పద్ధతి అవసరం… జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అభిప్రాయాల్ని నియంత్రించాలని 2022- Prevention of Misleading Advertisements and Endorsements for Misleading Advertisements అమలు చేయాలని Central Consumer Protection Authority కూడా చెబుతోంది… BIS రివ్యూలకు కూడా పాటించబడాలి..’’ ఇదీ ఆయన రిపోర్ట్ సారాంశం… కోర్టు అంతిమంగా ఏమంటుందో చూడాలి… (BIS అనేది రివ్యూలకు ఎలా వర్తిస్తుందో ఏమిటో మరి…)
ఈ కేసు ఎందుకొచ్చిందీ అంటే..? ‘Aromalinte Adyathe Pranayam’ అనే సినిమా దర్శకుడు మూవీ రిలీజయ్యాక వారం రోజులు పాటు వ్లాగర్స్, సైట్స్ వంటి ఏ సోషల్ మీడియా ప్లేయరైనా రివ్యూ రాయకుండా నియంత్రించాలని కోర్టుకు ఎక్కాడు… కనీసం సినిమాను కూడా చూడకుండానే దురుద్దేశపూర్వక సమీక్షలు వెలువరిస్తున్నాయని తన ఆరోపణ… అవి నిర్మాతలను మానసిక క్షోభకు, ఆర్థిక కష్టాలకు కారణమవుతున్నాయని అంటాడు…
2023 నవంబరులో జస్టిస్ రామచంద్రన్ ‘‘రివ్యూల ఉద్దేశాలు వేరు, అవి destroy లేదా extort కోసం కాదు… సంస్థలు ఉండవు, అక్రెడిటేషన్లు ఉండవు, గైడ్ లైన్స్ ఉండవు, మరి ఇదెలా..?’’ అని అభిప్రాయపడ్డారు… ఇక్కడ రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛ అనే ఇష్యూ వస్తుంది… సినిమా ఒక సరుకు, ఒక ఉత్పత్తి… వినియోగదారుడిగా తన అభిప్రాయాన్ని, సమీక్షను, క్వాలిటీ విశ్లేషణను జనంతో పంచుకోవడాన్ని ఎలా నిరోధించగలరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది… ఆ స్వేచ్ఛకూ పరిమితులు ఉంటాయంటారు జడ్జి గారు… ఏమో, చివరిగా ఈ ‘రివ్యూ బాంబింగ్’ మీద అంతిమ తీర్పు ఏమిస్తారో చూడాలి…
Share this Article