థంబ్ నెయిల్ జర్నలిజం… ప్రెస్ కౌన్సిళ్లు, ప్రెస్ అకాడమీలు, ఐటీ యాక్టులు ఎట్సెట్రా ఏమీ వర్తంచకుండా… ఏది తోస్తే అది వీడియో తీసేసి జనంలోకి వదిలే జర్నలిస్టులు కాని యూట్యూబర్లకు ఓ దుర్వార్త… గతంలో బోలెడుమంది సెలబ్రిటీలు కూడా మొత్తుకునీ మొత్తుకునీ ఏమీ చేయలేక వాళ్లే వదిలేసుకున్నారు కదా… మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఎవడికీ ఏమీ చెప్పాల్సిన పనిలేదు, మాకేమీ కాదు అనే ధీమాతో ఉంటారు కదా…
ఇకపై కుదరకపోవచ్చు… ఎవరికైనా తిక్క లేస్తే ఇదుగో ఈ తమిళనాడు హైకోర్టు తీర్పును ప్రామాణికంగా చేసుకుని విచారణకు లాగే సిట్యుయేషన్ రావచ్చు… మద్రాస్ హైకోర్టు తమిళనాడులోని సేవాభారతి ట్రస్టు మీద దురుద్దేశాలతో కథనాల్ని ప్రసారం చేసినందుకు గాను నాతికన్ అలియాస్ సురేందర్ అనే యూట్యూబర్‌ను ఏకంగా 50 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది… సచ్చింది గొర్రె…
జరిగింది ఏమిటీ అంటే… సురేందర్ 2020లో ఇద్దరు క్రైస్తవుల కస్టడీ మరణం ఇష్యూలో ట్రస్టును ఇరికించి ఓ వీడియో రూపొందించి వదిలాడు… అసలే కస్టడీ మరణాలకు సంబంధించి ఇప్పటికే ప్రజానీకం ఆందోళనలు చేస్తుంటే.., ఎలాంటి సత్యాన్వేషణ లేకుండా ఇలాంటి తప్పుడు ఆరోపణలను ప్రచారం చేసి, ట్రస్టును ప్రజల దృష్టిలో చెడుగా చిత్రీకరించారని జస్టిస్ ఎన్ సతీష్ కుమార్ మార్చి 6 నాటి ఉత్తర్వులో పేర్కొన్నారు… దుర్మార్గపు ఉద్దేశం, ఇందులో స్పష్టమైన పరువు నష్టం తప్ప మరొకటి లేదన్నారు…
Ads
భావ ప్రకటన స్వేచ్ఛను సాకుగా చూపి, ఇతరుల గోప్యతకు భంగం కలిగించే విధంగా ఇంటర్వ్యూలు చేయరాదని.., ఇతరుల ప్రతిష్టను పాడు చేసేందుకు యూట్యూబర్లు, సోషల్ మీడియాకు చట్టం అటువంటి సంపూర్ణ లైసెన్స్ ఇవ్వదని సింగిల్ జడ్జి బెంచ్ పేర్కొంది… ఇలాంటి కథనాలు ప్రజలను బ్లాక్ మెయిల్ చేసే సాధనాలుగా మారాయని, అమాయకులు లక్ష్యంగా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చెలామణి అవుతున్నప్పుడు కళ్లు మూసుకోలేమని కోర్టు ఉద్ఘాటించింది…
ఇలాంటివి మొగ్గదశలోనే తుంచేయబడాలి, ఇలాంటివి ఎంటర్‌టెయిన్ చేయకూడదు… ఇలాంటివి ఇలాగే కొనసాగితే ఇక అంతం ఉండదు… ప్రతి బ్లాక్ మెయిలర్ ఇక తప్పుడు, అనవసరమైన వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా ఇతరులను బ్లాక్ మెయిల్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ దుర్వినియోగం చేసే అవకాశముంది అని కోర్టు పేర్కొంది…
చెన్నైలోని సేవా భారతి ట్రస్టీ రాబు మనోహర్ వేసిన సివిల్ దావా ఇది… ట్రస్ట్‌కు వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే లేదా అవమానకరమైన పోస్ట్ ఏదీ చేయకుండా యూట్యూబర్‌ను శాశ్వతంగా నిరోధించే ఆదేశాలు కావాలని పిటిషనర్ కోరాడు… అంతేకాదు, కోటి రూపాయల పరిహారం, బహిరంగ క్షమాపణ డిమాండ్ చేశాడు…
ట్రస్ట్ వేసిన కేసు సారాంశం ఏమిటంటే…, ఇది పేదలకు సేవను అందించడంలో నిమగ్నమైన ఒక ఛారిటబుల్ ట్రస్ట్.., సమాజంలో చాలా మంచి పేరు కలిగి ఉంది, కానీ, 2020లో, కరుప్పర్ దేశం అనే బ్యానర్‌తో, యూట్యూబర్ పూర్తిగా అబద్ధమైన, నిరాధారమైన ఆరోపణలతో కథనాన్ని ప్రసారం చేశాడు… ట్రస్ట్‌కు ఆర్‌ఎస్‌ఎస్ మద్దతిస్తున్నట్లు, క్రైస్తవ మతాన్ని నిర్మూలించాలనుకుంటున్నట్లు కూడా సదరు యూట్యూబర్ ఆ వీడియోలో ఆరోపించాడని ట్రస్ట్ పేర్కొంది… హైకోర్టు సమన్లు జారీ చేసినా సదరు యూట్యూబర్ ఖాతరు చేయక, హాజరు కాకపోవడంతో కోర్టు ఎక్స్ పార్టీ తీర్పు వెలువరించింది…
ఏతావాతా తేలేదేమిటయ్యా అంటే… మాకు ఏ చట్టాలూ వర్తించవు, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు, శిక్షించలేరు అనే తప్పుడు భ్రమల్లో ఉంటే… తక్షణం వదులుకోవాలని ఈ కథనం నీతి..! అవునూ, దిక్కుమాలిన వీడియోల్ని అప్‌లోడ్ చేసే యూట్యూబ్‌కు ఎందుకు మినహాయింపు..?! ఎవడేది అప్‌లోడ్ చేసినా సరే అన్నట్టుగా ఉన్న యూట్యూబ్ పద్ధతిని కదా అసలు కంట్రోల్ చేయాల్సింది..!!
Share this Article