.
సైకాలజిస్ట్ గా ఉండటం ఎంత ఇష్టమో, క్లయింట్ల కన్నీటి కథలు వినడం అంత కష్టం. కొందరు తమ బాధలు పంచుకుంటుంటే కన్నీరు ఉబికి వస్తుంటుంది. కానీ సైకాలజిస్ట్ గా నేను ఏడిస్తే, అది క్లయింట్ ను మరింత ఆవేదనకు గురిచేస్తుంది. కాబట్టి బాధను గుండెల్లోనే బిగబట్టి, కన్నీటిని ఆపుకుని వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. అలాగే వింటాను.
కొన్ని ఆవేదనాభరితమైన కేసులు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఒక కేస్ పంచుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నా. కానీ కౌన్సెలింగ్ నడిచేటప్పుడు రాస్తే అది క్లయింట్ మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి వెంటనే పంచుకోలేను. అందుకే కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన చాలాకాలం తర్వాతే ఇక్కడ రాస్తుంటా. అలా నా మనసును కదిలించిన ఒక కథ ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నా.
Ads
ఏడాది కిందట లహరి (పేరు మార్చాను) అనే 18 ఏళ్ల అమ్మాయి కౌన్సెలింగ్ కోసం నా ఆఫీసుకు వచ్చింది. నిజానికి తను రాలేదు, తన బాధను చూడలేక తన పిన్ని తీసుకొచ్చింది. లహరి వయసు చిన్నదైనా, సమస్యలు మాత్రం జీవితమంత పెద్దవని ఆమెను చూస్తేనే తెలుస్తోంది. ఆమె కళ్ళలోని భయం, మనసులోని బాధ బాడీ లాంగ్వేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కౌన్సెలింగ్ లో కేవలం క్లయింట్ చెప్పే మాటలు మాత్రమే వింటే సరిపోదు, వారి హావభావాలు, ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ లో మాటల పాత్ర కేవలం 7 శాతం మాత్రమే, 37 శాతం మాట్లాడే తీరుది అయితే 55 శాతం బాడీ లాంగ్వేజ్ ది. ‘‘క్లయింట్ నీ ముందు కూర్చుని ఉండగా, అతని హిస్టరీ నీకెందుకు? అతన్ని పరిశీలించు, అన్నీ తెలుస్తాయి’’ అంటాడు గెస్టాల్ట్ థెరపీ వ్యవస్థాపకుడు ఫ్రిట్జ్ పెరల్స్. అలాగే క్లయింట్ మాట్లాడే మొదటి మాటలు, చాలా విషయాలు చెప్తాయంటాడు.
లహరి నాతో మాట్లాడేందుకు తడబడుతోంది. కొంచెం ధైర్యం చెప్పాక, కాస్త ఊపిరి పీల్చుకుని, ఆ కళ్లలోని భయాన్ని మాటల్లోకి మార్చి చెప్పడం మొదలు పెట్టింది. అప్పుడు కూడా తల దించుకునే ఉంది. నాతో నేరుగా కళ్లలోకి చూసి మాట్లాడలేకపోతోంది.
“నాన్న కొడతాడు, ఎందుకు కొడతాడో నాకు తెలియదు. అమ్మ కూడా కొడుతుంది. అసలు వాళ్లకు నామీద ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు. నువ్వు పుట్టాకే నా జీవితం ఇంత దరిద్రంగా మారింది అని తిడతాడు నాన్న. నేను పుట్టడమే ఒక తప్పు అయినట్లు అనిపిస్తుంది. అమ్మ కూడా తన బాధ అంతా నాపై పడేస్తుంది. నేనేం తప్పు చేశాను? నన్నెందుకిలా తిడుతున్నారు? అనే ప్రశ్న నాకు నిద్ర లేకుండా చేస్తుంది’’ అని చెప్తోంది లహరి. ఆమె కళ్లల్లో నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిని ఆపుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం కూడా.
ఆమె ఆవేదన వినగానే నా గుండె బాధతో నిండిపోయింది. పిల్లల మీద తల్లిదండ్రులు చూపించే ప్రేమ కంటే కోపం ఎక్కువగా ఉందంటే, ఆ పిల్లల గుండెల్లో ఎంతటి నిస్సహాయత ఉంటుంది? ఎంతటి ఒంటరితనం గూడుకట్టుకుంటుంది?
“నేను ఎప్పుడు కొట్టించుకుంటానో నాకు తెలియదు. నన్ను కొట్టడానికి సమయం, సందర్భం ఉండవు. నేను అప్పుడే నిద్ర లేచి ఉండొచ్చు లేదా మధ్యాహ్నం కాలేజీ నుంచి ఇంటికి వచ్చి ఉండవచ్చు, రాత్రి చదువుకుంటూ ఉండొచ్చు. నాన్న చెయ్యి ఎప్పుడు నామీద పడుతుందో నాకు తెలియదు. నా మొహం చూస్తేనే తిట్లు. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. బాత్ రూమ్ లోకో, ఇంటిపైకో వెళ్లి ఏడుస్తాను’’ అని చెప్తోంది లహరి. అప్పుడిక ఆమె కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. కాసేపు ఆమెను అలాగే ఏడ్వనిచ్చాను. ఆ తర్వాత తాగడానికి నీళ్లిచ్చి, ఓదార్చాను.
అమ్మానాన్నల మాటలు, చేతలే పిల్లల హృదయాలను మలుస్తాయి. కానీ అవే మాటలు గాయాలుగా మారితే, ఆ గాయాలు జీవితాంతం మిగిలిపోతాయి. లహరి కూడా అటువంటి బలమైన గాయాల్ని మనసులో దాచుకుంది.
“నన్ను ఎవరూ ప్రేమించరు సర్. స్నేహితులు కూడా అర్థం చేసుకోరు. నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడినా వెంటనే మా నాన్న చెక్ చేస్తాడు. ఒక్కోసారి నేను పడుకున్నాక నా ఫోన్ తీసుకుని చెక్ చేస్తాడు. ఎప్పుడైనా ఎవరైనా క్లాస్మేట్ తో మాట్లాడుతూ కనిపిస్తే చాలు, ఎవడే వాడు, అప్పుడే మొదలుపెట్టావా? అంటూ అవమానకరంగా మాట్లాడతాడు. చచ్చిపోవాలనిపిస్తుంది’’ అంటూ గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదనను పంచుకుంటోంది లహరి.
ఆమె మాటలతో నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ మాటలు ఎందరో అమ్మాయిల జీవితాల్ని ప్రతిబింబిస్తున్నాయి. మన సమాజంలో ఎంతో మంది అమ్మానాన్నలు తమ పిల్లల ప్రవర్తనకు కారణాన్ని వెతకకుండా ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. పిల్లల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం కంటే, వారి చర్యలను తప్పుడు కోణంలో చూసి అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు, కట్టడి చేస్తున్నారు, శిక్షిస్తున్నారు.
‘‘నీ మొహం చూస్తేనే దరిద్రమే. నువ్వు పుట్టాకే నా బిజినెస్ మొత్తం నాశనమయ్యింది. నా జీవితం సంకనాకి పోయింది. శనిదానిలా పొద్దున్నే ఎదురుపడతావెందుకే’’ అని బాదేస్తాడు నాన్న. ఆయన్ను ఏమీ అనలేక, ఆయన తిట్టను భరించలేక తన కోపాన్ని కూడా అమ్మ నామీదే చూపిస్తుంది’’ అని ఆవేదనతో చెప్పింది లహరి.
చిన్నప్పటి నుంచీ వింటున్న ఈ తిట్లను భరించలేక, ఎవరితో చెప్పుకోవాలో తెలియక లహరి ఊబిలాంటి నిశ్శబ్దంలో కూరుకుపోయింది. అమ్మానాన్నల తిట్టన్నీ నిజమని, తన పుట్టుకే దరిద్రమని నమ్మడం మొదలుపెట్టింది. పెరట్లో ఉండినా, రైల్వే స్టేషన్ కూర్చున్నా, స్నేహితుల ఇంటికి వెళ్ళినా, ఎక్కడా తాను సురక్షితంగా ఉందని అనిపించలేదు.
ఒకసారి తండ్రి బెల్టుతో కొట్టినప్పుడు, ఆమె చర్మం చీలి రక్తం చిందింది. ఆ గాట్లకు నూనె రాస్తూ, తల్లి ఏడ్చింది. కానీ ఆ గాయాల వల్ల నాశనమైన లహరి ఆత్మగౌరవాన్ని ఎవరు చూస్తారు? ఏ అబ్బాయితోనైనా మాట్లాడితే, లం… అని తిట్టే తిట్ల వల్ల గాయపడిన ఆమె మనసుకు ఎవరు మందు రాస్తారు.
ఈ సమస్యలన్నింటి మధ్య చదువుపై ధ్యాస నిలిచేది కాదు. దాంతో పేరెంట్స్ కోరుకున్న స్థాయిలో స్కోర్ చేయలేకపోయేది. దాంతో మరిన్ని తిట్లు. మొద్దు ముండా ఎలా పుట్టావే మా కడుపున అంటూ.
నాన్న మాటలు, తల్లి గాయాలు, చుట్టాల అవమానాలు… ఇవన్నీ కలిసి ఆమెను ఆత్మహత్య ఆలోచనలకు నెట్టాయి. ఒకసారి బ్లేడుతో చేయి కోసుకుంది. ఎవడి కోసం కోసుకున్నావే? అంటూ కొట్టాడు నాన్న.
లహరి చెప్పేది విన్నాక, మానసికంగా ఎంత నలిగిపోతోందో అర్థమవుతోంది. కుటుంబమున్నా, కుటుంబ సభ్యులున్నా… మానసికంగా దూరమైన ఇలాంటి పిల్లలు ఎక్కడికి పోతారు. ఎవరితో తమ బాధను పంచుకుంటారు. ఒక్క నమ్మకమైన మాట కోసం, రవ్వంత దయకోసం, ఓదార్చే భుజం కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఫ్రెండ్ దొరికారు లహరికి.. రమ్య, గీతిక, రవి, ఆనంద్.
ఒకసారి నాన్న విపరీతంగా కొట్టినప్పుడు, ఆ బాధను, అవమానాన్ని భరించలేక ఫ్రెండ్స్ కు ఫోన్ చేసింది. దగ్గరగా ఉండే ఆనంద్ వచ్చి వీధి చివర ఉన్న బేకరీలో కూర్చోబెట్టి ఓదార్చాడు. ఆ విషయం ఎవరో చూసి లహరి తండ్రికి చెప్పాడు. అంతే, ఎవడే వాడు? అప్పుడే మొదలుపెట్టావా? అంటూ చావబాదాడు.
తండ్రి తనను అనుమానించడం తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగింది. స్పృహలేకుండా పడిపోవడం చూసి హాస్పిటల్లో చేర్పించారు. స్పృహ వచ్చాక మళ్లీ తిట్టడం మొదలుపెట్టారు. అప్పుడే ఆమెను పరామర్శించేందుకు తన పిన్ని వెళ్లింది. అక్కడి వాతావరణం అర్థమై, కొన్నాళ్లు తనతో ఉంటుందని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆమె అడగ్గా, అడగ్గా… ఏడుస్తూ తన బాధను చెప్పుకుంది. లహరి మనసుకైన గాయాన్ని మాన్పడం తనవల్ల కాదని ఆమె కౌన్సెలింగ్ కు తీసుకువచ్చింది.
ఇదంతా చదివి లహరి పేరెంట్స్ చదువురాని వాళ్లో, చదువులేని వాళ్లో అనుకోకండి. లహరి తండ్రి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసి, బాగా డబ్బు సంపాదించి, ఇండియాకు తిరిగి వచ్చి వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో బాగుంది. లహరి పుట్టాక నష్టాల్లో పడింది. చాలా కష్టాలు, అవమానాలు పడాల్సి వచ్చింది. రెండో కూతురు పుట్టాక లాభాల బాట పట్టింది. దాంతో లహరి పుట్టుక వల్లనే దరిద్రం పట్టుకుందని, రెండో కూతురు అదృష్టాన్ని తెచ్చిందని ఆయన బలంగా నమ్మాడు. అందుకే అనుక్షణం వివక్ష చూపించేవాడు. ఇది లహరిని మరింత బాధపెట్టేది.
లహరి తల్లి లెక్చరర్. ఆమె కూడా అనుక్షణం భర్తనుంచి అవమానాలు ఎదుర్కొనేది, భరించేది. భరించలేని క్షణాల్లో తన కోపాన్ని పిల్లలపై, ముఖ్యంగా లహరిపై చూపించేది. ఎందుకంటే, రెండో కూతుర్ని పల్లెత్తు మాటన్నా భర్త ఊరుకోడు.
అంత చదువుకున్న పేరెంట్స్ కూడా ఇలా ప్రవర్తించారనే విషయం నాకు మరింత బాధ కలిగించింది. తల్లిదండ్రులంటే కేవలం పిల్లల్ని కనడం, ఆశ్రయం కల్పించడం మాత్రమే కాదు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ప్రదర్శించాల్సిన పాత్ర. ఆ విషయం తెలియకపోతే లహరి పేరెంట్స్ లానే తయారవుతారు.
లహరి కథ నన్ను ఆసాంతం కలచి వేసింది. పేరెంట్స్ మాటలు, ప్రవర్తన పిల్లల మనసుపై ఎంత బలమైన ప్రభావాన్ని చూపుతాయో, అది సరిగా లేకపోతే ఎంత బలమైన గాయాలు చేస్తాయో ఒక సైకాలజిస్టుగా నాకు బాగా తెలుసు. అందుకే, ఒక మనిషిగా, ఒక తండ్రిగా, ఒక సైకాలజిస్ట్‌గా నా బాధ్యతని మరింత గుర్తు చేసుకున్నాను.
లహరికి మూడు నెలల పాటు కౌన్సెలింగ్ ఇచ్చి ఆమెను మానసికంగా ధృఢంగా తయారు చేయగలిగాను. లహరి తల్లిని కూడా పిలిపించి మాట్లాడాను. ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభకు కూడా కౌన్సెలింగ్ చేశాను. పిన్ని, బాబాయిల అండతో లహరి ముందడుగు వేసేలా మార్చగలిగాను. ఇప్పుడు లహరి హైదరాబాద్ లో ఆనందంగా ఇంజినీరింగ్ చదువుతోంది.
లహరి లాంటి పిల్లల కథ మనకు ఒక గుణపాఠం. పిల్లలపై శారీరక, మానసిక దాడులు ఎంత మానసిక నొప్పికి దారితీస్తాయో అర్థం చేసుకోవాలి. పిల్లలకు ప్రేమతో కూడిన సురక్షితమైన వాతావరణం అవసరం. వాళ్లు తమ బాధలను పంచుకునే స్వేచ్ఛ అనివార్యం. అమ్మానాన్నలుగా మనం పిల్లలను గెలిపించే జ్ఞానం కావాలి. ప్రేమ, క్షమ, సహనమే పిల్లలను సరైన మార్గంలో నడపగలవు.
మొదట్లో ఎంత బాధ కలిగించిందో, చివరకు అంత తృప్తిని ఇచ్చిన కేస్ ఇది. అందుకే అందరితో పంచుకోవాలనిపించింది.
Share this Article