తెలుగులో పాడతా తీయగా గానీ, హిందీలో ఇండియన్ ఐడల్ గానీ, అప్పట్లో సూపర్ సింగర్ గానీ ప్రేక్షకులను రంజింపచేశాయి అంటే… రకరకాల కారణాలు ఏమైనా ఉండవచ్చుగాక… కానీ పాటల ఎంపిక అత్యంత ప్రధానం… గాయకుల గానపాటవాన్ని పరీక్షించాలంటే అన్నిరకాల పాటల్నీ పాడించాలి… ఒక్క మెలొడీ పాడితే, ఒక్క ఫోక్ పాడితే, ఒక్క క్లాసిక్ పాడితే సరిపోదు… దీనికి ఆయా షోల నిర్వాహకులు చేయాల్సింది ఏమిటంటే… సరైన పాటల ఎంపిక…
ఆ పాటలు గాయకుడికి పరీక్ష పెట్టాలి, ప్రేక్షకుడికి వీనులవిందు కావాలి… సరే, ఎలాగూ ఈటీవీలో స్వరాభిషేకం, పాడతా తీయగా షోలను బీభత్సంగా భ్రష్టుపట్టించేసి, బాలు ఆత్మను క్షోభపెడుతున్నారు… దాన్నలా వదిలేస్తే… జీటీవీలో సరిగమప అని స్టార్ట్ చేశారు కొత్తగా… అంతకు ముందు సీజన్ సరిగమప ఫ్లాప్… కానీ ఆ టీవీవాళ్లు ఏమైనా గుణపాఠాలు నేర్చుకున్నారా అంటే, అదేమీ కనిపించడం లేదు…
అప్పట్లో ప్రదీప్ జోకులు, ఇప్పుడు శ్రీముఖి ఓవరాక్షన్ కూడా విసుగెత్తించేవే… జడ్జిలు అంటే ఆహా ఓహో అని పొగడటం కోసం కాదు… ఆ పాట ఎలా పాడబడిందో విశ్లేషించగలగాలి… వీలైతే ఆ పాట నేపథ్యాన్ని చెప్పగలగాలి… కోటి కొంతవరకు పర్లేదు గానీ, స్మిత, అనంత శ్రీరాంలకు పాత పాటల నేపథ్యాలు ఏం తెలుసు..? శైలజ కాస్త బెటరే… అప్పట్లో చంద్రబోసే ఎక్కువ మాట్లాడుతాడు అనే విమర్శ ఉండగా, అనంతుడు చంద్రబోస్ తాత అయిపోయాడు… రేవంత్, సాకేత్ కూడా తమ చేష్టలతో చికాకుపెడుతున్నారు…
Ads
సింగర్స్ సెలక్షన్ బాగానే ఉంది… కానీ పాటల ఎంపికే పెద్ద దరిద్రం… ఒక ఉదాహరణ చెప్పుకుందాం… తాజాగా జీటీవీలో ప్రోమో వస్తోంది… ఒక ఫిమేల్, ఒక మేల్ గాయకులు అపరిచితుడు సినిమాలోని రండక రండక పాట పాడుతున్నారు… (ఇక్కడ శ్రీముఖి చెత్త యాంకరింగ్ కనిపించింది…) ఇప్పటివరకు తెలుగులో వచ్చిన టాప్ చెత్త పాటల్ని ఎంపిక చేస్తే టాప్ 30లో ఈ పాట కూడా ఉంటుందేమో బహుశా… గుర్తుంది కదా… కొండా కాకి కొండేదానా, గుండిగ లాంటి గుండేదానా, అయ్యారేటు పళ్లదానా, మట్టగిడస కళ్లదానా… ఇక అక్కడ ఆపేశాడు రచయిత ఎవరో గానీ… థాంక్స్… (ఆ సినిమాలోని పాటలన్నీ అంతే…
నోటికొచ్చిన పదాల్ని ఆ ట్యూన్‌లో ఇరికించడమే సాహిత్యం… పైగా అదొక పిచ్చి ట్యూన్… ఏ కోణం నుంచి చూసినా ఓ సింగర్స్ టాలెంట్ టెస్టుకు ఏమాత్రం పనికిరాని సాంగ్… మరి దేన్ని ఎందుకు ఎంపిక చేసినట్టు..? పైగా ఒక సినిమాను తీసుకుని, అందులోని పాటలు పాడిస్తే అది స్పెషల్ ఎపిసోడట… హేమిటో… గత సీజన్ సరిగమప విజేత యశస్వి కూడా మాస్, బీట్ పాటల జోలికి పోలేదు…
ఒక గాయకుడికి పరీక్ష అంటే… గొంతులోని మాధుర్యమే కాదు, ఉచ్ఛారణ, బ్రీత్ కంట్రోల్, స్వరజ్ఞానం వంటి చాలా అంశాల్ని పరిశీలించాలి… అది జరగాలంటే రకరకాల పాటల్ని జాగ్రత్తగా ఎంపిక చేయాలి… అప్పుడే ప్రోగ్రామ్ రంజింపచేయగలదు, పాడతా తీయగా హిట్ అయ్యిందంటే కారణం, రకరకాల వయస్సుల వాళ్లతో కూడా అన్నిరకాల పాటల్ని పాడించాడు బాలు… తప్పొప్పుల్ని చెప్పేవాడు… పాటల నేపథ్యాన్ని వివరించేవాడు… కొన్నిసార్లు పాటల కంటెంటు మీద కూడా విశ్లేషణలు సాగించేవాడు… మరి సరిగమప చూసే క్రియేటివ్ టీంకు ఈ బేసిక్స్ కూడా తెలియవా..?! లేక కావాలనే చేస్తున్నారా..?! హేమిటో… మరీ కింగ్ సినిమాలో సంగీత బ్రహ్మానందాలన్నీ ఒకేచోట చేరినట్టు కనిపిస్తోంది…!!
Share this Article