Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బస్ జర్నీలో బడా చోర్… ఓ సినిమాటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ…

November 17, 2022 by M S R

Gottimukkala Kamalakar……   బస్సు జడ్చర్ల మునావర్ హోటల్ దగ్గర ఆగింది. “టిఫిన్, మీల్స్, రోటీ, టీ, టాయిలెట్ అన్నీ కానియ్యొచ్చు. బస్సరగంటాగుతుంది. దిగాల్సార్.. దిగాల..! మళ్లీ అనంతపురం జంక్షను దాకా ఆగదు. దిగాల్దిగాల..!” అంటూ కేకేస్తూ తన డోర్లోంచి దిగాడు డ్రైవరు.

బస్సులో ప్యాసింజర్లు ఒక్కొక్కరే తోసుకుంటున్నట్టు దిగసాగారు. నేనింట్లోనే సుష్టుగా తినేసా. బయటి తిండి జనరల్ గా తినను. రేపెలాగూ బెంగుళూరులో తప్పదు. ఓ రెండు నిమిషాలు అలాగే కూర్చుని జనం దిగే హడావిడి అయిపోయాక రెస్ట్ రూం వాడదామని చివరిగా దిగాను.

అక్కడ ఇంకా ఓ నాలుగు బస్సులు పార్క్ చేసున్నాయి. కాస్త దూరంగా పురుషులు, స్త్రీలు అని వేర్వేరుగా టాయిలెట్ బోర్డులు కనిపించాయి. UREN:FREE; TOILAT:3RUPIS అని రాసుంది. అక్కడి మనిషికి చిటికెనవేలు చూపిస్తూ వెళ్ళి పని చూసుకుని తిరిగొచ్చి సిగరెట్ అంటించి ఓ దమ్ము లాగి చుట్టూ చూశాను.

Ads

తిరుపతికి వెళ్లే కావేరీ ట్రావెల్స్ బస్సు స్టార్ట్ అయి వెళ్లిపోయింది. పిల్లలు బిస్కట్లూ, కూల్ డ్రింకుల కోసం ఏడుస్తున్నారు; పెద్దలు టీలూ, కాఫీలూ, టిఫిన్లూ, భోజనాలను రేప్పొద్దుటికి భూమి ఉండదు అన్నంత ఆబగా తినేస్తున్నారు. అక్కడి బిచ్చగాళ్లు ఎవరూ తిండి తీసుకోకుండా కేవలం డబ్బులు మాత్రమే అడుక్కుంటున్నారు.

శుక్లపక్ష చతుర్దశి కావడంతో ఆ కంగాళీ కూడా వెన్నెల్లో అందంగానే కనిపిస్తోంది. అది చూస్తూ రేపు బెంగుళూరులో దొరికే ఆనందాన్ని ఓ సారి తల్చుకున్నాను. హైదరాబాద్ లో బయల్దేరినప్పటి అనుమానం, ఆందోళనలు ఇప్పుడు లేవు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా..!

సిగరెట్ పూర్తయ్యాక హోటల్ కౌంటర్ దగ్గరికి వెళ్లి ఒక టీ టోకెన్ తీసుకున్నాను. టీ గ్లాసును చేతికందుకుని మెల్లగా తాగుతుంటే మా బస్సు డ్రైవరు తన సీట్లోకి వెళ్ళి కూర్చుని హారన్ మోగించాడు. నా తోటి ఫ్రయాణికులందరూ కొత్త ఖైదీ సినిమాలో కార్తి బిర్యానీ తిన్నట్టు ఆబగా తినేసి బస్సెక్కేసారు. నేను కూడా మెల్లగా బస్ దగ్గరికి వెళ్లి ఎక్కేసాను.

హఠాత్తుగా బస్సు వెనక నుండి కేకలు మొదలయ్యాయి. ” నా డబ్బులు, నా డబ్బులు కనిపించడం లేదు..!” అంటూ అరుపులూ, గోలా మొదలైంది.

ముందువాళ్లు వెనక్కీ, వెనకవాళ్లు ముందుకీ చూసాము. పదమూడో నంబరు సీటు మనిషి గోల పెడుతున్నాడు. అతని పక్కసీటతను “ఎంత పోయిందండీ..!” అంటే “రెండు లక్షలు సార్..! రెండు లక్షలు. రెండువేల రూపాయల నోట్లకట్ట…! నా కొడుకు ఆర్కిటెక్చర్ కాలేజీ ఫీజు కోసం తీసుకెళుతున్నా..! డ్రైవర్.. బస్సాపు..! అందరినీ చెక్ చేయాలి..!” అంటూ ఏడుపు మొదలెట్టాడా చెట్టంత మనిషి.

నాది డ్రైవర్ వెనకసీటే..! వెంటనే డ్రైవర్ని బస్సు కదలకూడదని చెప్పాను. తను సరే అంటూ సీట్లోంచి లేచాడు. బస్సంతా అసెంబ్లీలా గోలగోలగా తయారైంది. విషయం కనుక్కుంటే, ఆ డబ్బులు పోగొట్టుకున్నాయన బెంగుళూరులో కొడుకు బీఆర్క్ సెకండియర్ ఫీజు కట్టడానికి వెళుతున్నాడు. రెండు లక్షలు వైటు; రెండు బ్లాకు. మొదటి రెండు లక్షలకు చెక్కు తీసాడు. మిగిలిన రెండు లక్షలకి ఇక్కడ బొక్కడిపోయింది. పెళ్లాం పుస్తెల్ని ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి తెచ్చాడట. అతని ఆక్రోశం పట్ఠే పరిస్థితి లేదు.

అందరి బ్యాగుల్నీ కూలంకషంగా చెక్ చేయాలని నిర్ణయానికొచ్చి పొలీసులకు ఫోన్ చేసాం. పోలీసులొచ్చి చెకింగ్ మొదలెట్టారు. నేను తెల్లవారేసరికల్లా బెంగుళూరులో ఉండాలి. నేను తెల్లవారుజామున నాలుగ్గంటలకల్లా ఉంటాననుకున్నా. లేకపోతే ఈ ట్రిప్పు అనవసరం. సుబ్బరంగా వెనక్కి వెళ్లడం ఉత్తమం. తీరా చూస్తే ఇక్కడే రాత్రి పదకొండయ్యింది.

పదిహేడో నంబరు సీటు మనిషి కంగారు పడుతున్నాడు. అతనేదో చెప్పబోతుంటే ఆ గోలలో ఎవరూ వినే పరిస్థితి లేదు. బ్యాగులూ, జేబులూ వెదుకుతూ అతని చేతిసంచీ తీసుకుని చూసేసరికి అందులో డబ్బులున్నాయి. రెండువేల రూపాయల కట్ట పాపంలా పరుచుకుని ఉంది. అతడు నోరు తెరిచి ఏదో చెప్పబోయేలోపలే “ఫఠ్”మంటూ మూతి మీద కొట్టాడు పోలీసు. ఆ ముసలివాడి పళ్లు నాలుగు కదిలిపోయాయి. కాలర్ పట్టుకుని బస్సుమధ్యకు ఈడ్చుకొచ్చారు.

అలస్యమైందన్న కోపమో, దొంగ దొరికాడన్న ఆనందమో, వాళ్లు నిజాయితీపరులని చూయించే అవకాశమో ఒక్కొక్కరూ అతని చితకబాదసాగారు. అంతమంది కొడుతున్న అన్ని దెబ్బలకు పాపం చచ్చిపోయేటట్టున్నాడు. డబ్బులు దొరికిన మనిషి కన్నా మిగతావాళ్లే ఎక్కువ రెచ్చిపోతున్నారు.

ఒక పోలీస్ “కేస్ పెడతారా..?” అని అడిగితే, “వద్దండీ..! నా సొమ్ము దొరికింది చాలు..!” అంటూ ఆ పోలీసులకు కొంత నగదు సంతోషంగా ఇచ్చాడు తన డబ్బులు దొరికినతను.

కింద అచేతనంగా పడి ఉన్న మనిషిని బస్సు నుండి కిందికి తోసేసి పోలీసులు వెళ్ళిపోయారు. నాకు ఆలస్యం అవడం వల్ల బెంగుళూరు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. అందుకని ఆ బస్సు ప్రయాణం చిరాకనిపించింది. డ్రైవరుకు విషయం చెప్పి నేనూ దిగేసాను. ఆ తర్వాత రెండు నిమిషాలకు బస్సు కర్నూలు వైపు వెళ్ళి పోయింది.

నేను పాన్ డబ్బా దగ్గరికి వెళ్లి ఇంకో సిగరెట్ కొనుక్కుని ముట్టించి ఆ వ్యక్తి పడి ఉన్న వైపు చూసాను. బోర్లా పడిఉన్నాడతను. చొక్కా చిరిగి పోయింది. వళ్లంతా డోక్కుపోయింది. పాపం వళ్లంతా రక్తపు మరకలు. దాదాపు అచేతనంగా పడి ఉన్నాడు. నాకు జాలేసింది.

ఇరవై రూపాయలు ఇచ్చి ఓ చల్లటి నీళ్ల సీసా అదే పాన్ డబ్బాలో కొని అతని దగ్గరికి వెళ్లి, వెల్లకిలా తిప్పి కొన్ని నీళ్లు మొహం మీద చల్లి మరి కొన్ని తాగించాను. ఆ మాత్రం సాయానికే అతని దుఃఖం కట్టలు తెగింది. ” న్యాను దొంగను కానన్నా. మా బిడ్డా, దాని పెనివిటీ అనంతపురంల బూవి తీసుకుండారు. కొంచెం లెక్క తగ్గిందని ఫోంజేస్తే హైదరాబాదుల మా రెడ్డిని అడిగి తీసుకపోతాండ..!” అంటూ బావురుమన్నాడు.

“నీమాటనెవరు నమ్ముతారన్నా..? ఎవడు మంచోడో, ఎవడు దొంగనాకొడుకో..? ఎవురికి దెల్సూ..?? ఈ సొమ్ము తీస్కో. ఇంటికిబో..!” అంటూ అతనికి నా జేబులోంచి ఒక రెండువేల రూపాయల నోటు ఇచ్చాను. అతను రెండుచేతులూ జోడించి దండం పెట్టాడు. నేను తిరిగి హైదరాబాద్ వెళ్లడానికి రోడ్డుదాటి ఈల వేసుకుంటూ అటువైపు వెళ్లసాగాను….

****

ఫర్వాలేదు. వచ్చేవారం బెంగుళూరెళ్లి పేకాడుకోవడానికి ప్యాంటు జేబులో ఇంకా లక్షా తొంభైఎ నిమిది వేలున్నాయి…. #గొట్టిముక్కలకమలాకర్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions