.
బద్మాషులు… ఎవరు..? ఈ సినిమా పేరు బద్మాషులు… చూస్తుంటే ఓ చిరాకు… తెలంగాణ అనగానే తాగుబోతులు, తాగడమే సంస్కృతి అన్నట్టుగా పదే పదే సినిమాల్లో చిత్రీకరిస్తున్నారు…
అక్కడికి ఏ రాష్ట్రమూ తాగనట్టు..! వేల కోట్ల మద్యం స్కాములు, లక్షల మందికి కాలేయ వ్యాధులు ఎలా వచ్చాయి..? పైగా మమ్మల్ని గెలిపిస్తే మంచి నాణ్యమైన బ్రాండ్ల మందు అందుబాటులోకి తెస్తామనీ, సమంజసమైన ధరలకే అమ్మిస్తామనీ ఎన్నికల వాగ్దానాలు… మరివన్నీ ఏమిటో…
Ads
గతంలో తెలంగాణ అనగానే రౌడీలు, కమెడియన్లుగా చిత్రించేవాళ్లు… ఏదో ఓ వంకరభాషను తెలంగాణ యాసగా చూపించేవాళ్లు, పలికించేవాళ్లు… తెలంగాణ అంటేనే వాళ్లకు ఓ రకమైన ద్వేషం, అసహ్యం, వివక్ష… అన్నీనూ…
అన్నీ చూశాం, తెలంగాణ ఉద్యమ తీవ్రత వెనుక ప్రధాన కారణాల్లో తెలంగాణ సంస్కృతి మీద వివక్ష, ఏవగింపు కూడా ఒకటి… తెలంగాణ నేల మీద బతుకుతూ, ఈ వనరులు అనుభవిస్తూ, దోపిడీ చేస్తూ, తెలంగాణ భాషను, సంస్కృతిని, పండుగలను వెకిలి చేయడం మీద తెలంగాణవాసి ఆగ్రహం…
ఒకడేమో మా నాన్న వచ్చి తెలంగాణ వాళ్లను ఉదయమే లేవడం అలవాటు చేశాడంటాడు… మరొకడేమో మా మామ వచ్చాక తెలంగాణ వాళ్లు అన్నం తినడం ప్రారంభించారంటాడు… వాళ్లు జొన్నన్నం, గొడ్డుకారంతో బతికిన రోజుల్లోనే తెలంగాణలో దమ్ బిర్యానీలు ఘుమఘుమలాడాయని తెలియక కాదు, అదొక ఈసడింపు, అదొక వెక్కిరంపు…
ఎయిర్‌పోర్టు, సొంత విమాన సంస్థ, సొంత పవర్ జనరేషన్, సొంత రైల్వే, సొంత కరెన్సీ, అద్భుతమైన భవనాలు, రోడ్లు… చివరకు తెలంగాణను కలిపేసుకుని, తెలంగాణ పదాన్నే నిషేధించేదాకా అదోరకం అణిచివేత… అక్కడి నుంచి బయటపడ్డామని అనుకునేలోపు…
తెలంగాణ పాట కావాలిప్పుడు, ఆట కావాలిప్పుడు, తెలంగాణ నేపథ్యం కావాలిప్పుడు… ఎందుకంటే అవే ట్రెండింగ్… తెలంగాణ మార్కెట్ కావాలి, కానీ మళ్లీ మళ్లీ అదే దిక్కుమాలిన విషం… తెలంగాణ అనగానే తాగుబోతులు అన్నట్టుగా చిత్రీకరణ..,
బద్మాషులు అనే ఓ సినిమా వచ్చింది… ఇద్దరు కథానాయకులు… ఒకడు టైలర్… మరొకడు బార్బర్… తెల్లారిలేస్తే తాగడమే పని అన్నట్టు చూపించారు… ఒకడేమో తన కస్టమర్ల బట్టలను అమ్ముకుని తాగుతుంటాడు… మరొకడేమో సగం సగం షేవింగ్ చేసి బారుకు వెళ్లి తాగేస్తుంటాడు… ఇది కామెడీ అట, ఇది తెలంగాణ గ్రామీణ జీవిత చిత్రీకరణ అట…
ఏమైనా అంటే, సినిమాను సినిమాగా చూడాలి అంటారు… ఈ దిక్కుమాలినతనం క్రియేటివిటీనా..? పైపైన చూస్తే ఏవో తాగుబోతు పాత్రలు కదానిపిస్తుంది… కానీ రీసెంటుగా వచ్చిన మరో రెండు పెద్ద సినిమాల్లోనూ ఇదే తంతు… తెలంగాణ అంటేనే తాగితందనాలు అన్నట్టు చూపించడం..!
తాగడానికి డబ్బుల్లేక స్కూళ్లో ఏదో వైర్ దొంగిలించి, పోలీసులకు చిక్కుతారు… స్టేషన్ పాలవుతారు, అక్కడా పోలీసుల పేరు చెప్పి, డబ్బులు వసూలు చేసి, ఆ డబ్బుతో తాగుతుంటారు… మొత్తం కథంతా తాగడమే… తాగడం చుట్టే…
ఓ ఘననిర్మాత వేదిక మీద మావోళ్లకు తెల్లకల్లు తప్ప మరేమీ పట్టదు అంటాడు… కక్క ముక్క తప్ప తెలంగాణ వాడికి మరేమీ పట్టదా..? తెలంగాణ అంటేనే ఓ ధిక్కారం, ఓ పోరాటం, ఓ నిక్కచ్చితనం, ఓ ముక్కుసూటితనం, ఓ భోళాతనం ప్లస్ ఆత్మహత్యలు, కన్నీళ్లు, బతుకు వెతలు… అడుగుకో కథ… ఇవెందుకు కనిపించవు తెలుగు సినిమాల్లో…!! అలా కనిపించనివ్వనితనమే బద్మాషీతనం..!! (ఇది సదరు సినిమా రివ్యూ కాదు… మన సినిమా వెళ్లే బాట మీద తెలంగాణ కోణంలో విమర్శ, అభిప్రాయం…)
Share this Article