సమంత… తెలుగులో ఒంటి చేత్తో సినిమాను మోయగల నటి… వుమెన్ సెంట్రిక్ ఎమోషనల్ సినిమాలే కాదు, అవసరమైతే యశోద ఫైట్లు, ఊ అంటావా ఊఊ అంటావా వంటి ఐటమ్ సాంగ్స్… ఆమె ఏ పాత్రలోకైనా దూరగలదు… ఇప్పుడు ఓ చారిత్రక పాత్ర శకుంతల… ట్రెయిలర్ చూస్తుంటే సమంత ఆ పాత్రలో బాగుంది… దుష్యంతుడు తొలిసారిగా ఆమెను చూసినప్పుడు మాత్రం డల్‌గా, ఏదోలా కనిపించింది… తరువాత సీన్లలో మాత్రం సమంతకే సాధ్యమేమో అన్నట్టుగా గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది…
నిజానికి గుణశేఖర్‌కు సెట్టింగుల పిచ్చి… ఇప్పుడు గ్రాఫిక్స్ సహకారం వచ్చేసిందిగా… ఇంకేం..? బ్రహ్మాండంగా వాడుకున్నాడు… కాకపోతే బాహుబలి ప్రభావం బాగా ఉన్నట్టుంది తనపై… సేమ్, మాహిష్మతి రాజ్యం వంటి దుష్యంతుడి నగరాన్ని సృష్టించాడు… సమంత తొలిసారి కనిపించినప్పుడు తమన్నా ఒంటిమీదలాగే రంగురంగుల సీతాకోకచిలుకలు ఎగురుతూ ఉంటాయి… అంతేకాదు, ఓ యుద్ధాన్ని కూడా క్రియేటివ్‌గా సినిమాలో అమర్చినట్టున్నాడు… ఆ సీన్లలో బాహుబలి ఛాయలే కనిపిస్తున్నాయి… ట్రెయిలర్‌లోనే ఇలా ఉందంటే ఇక సినిమా మొత్తమ్మీద బాహుబలి ముద్ర ఇంకెంత ఉందో… మంచి క్రియేటివిటీ ఉన్న దర్శకుడికి ఇదేం బలహీనత..? (కాళిదాసు భ్రమరాలు అని రాశాడు గానీ సీతాకోక చిలుకలు అనలేదోయ్ శేఖరం…)
ట్రెయిలర్ చూసి సినిమా నాణ్యతను నిర్దేశించలేం… కానీ సినిమా పోకడల్ని మాత్రం పట్టిస్తుంది… సినిమా గ్రాండియర్‌గా కనిపిస్తోంది… సమంత పాత్రే బాగా హైలైట్ కావడానికి దుష్యంతుడి పాత్రలో ఓ అనామక హీరోను కావాలనే తీసుకున్నట్టున్నాడు గుణశేఖర్… కానీ దేవ్ మోహన్ అందంగా బాగున్నాడు… కేరళకు చెందిన ఈ నటుడు ఒక ఏడాది మిస్టర్ ఇండియా పోటీల్లో ఫైనలిస్టు… గుణశేఖర్ ఏమనుకున్నాడో ఏమో తెలియదు గానీ… హీరోయిన్ సమంతకన్నా తనే బాగున్నాడు…
Ads
సినిమాలో అల్లు అర్జున్ బిడ్డ అర్హ ఓ సింహం మీద కూర్చుని భరత యువరాజుగా వస్తుంటుంది… బాగుంది… ఎటొచ్చీ పాన్ ఇండియా సినిమా అనేసరికి గుణశేఖర్ గందరగోళానికి గురైనట్టున్నాడు… మన తెలుగులోనే ఎంచక్కా సినిమా తీసి, తరువాత మిగతా భాషల్లోకి డబ్ చేస్తే సరిపోతుంది… బాహుబలి గానీ, ఆర్ఆర్ఆర్ గానీ అంతే… కానీ హిందీలో రాసుకుని, తెలుగులోకి మాటలు డబ్ చేస్తే ఘోరంగా ఉంటుంది… గుణశేఖర్ ఆ తప్పే చేసినట్టున్నాడు… ట్రెయిలర్ చూస్తుంటే అదే అనిపించింది… ఆ రాజులు, సెట్టింగులు, వాళ్ల ఆహార్యం గట్రా…
దీన్ని పాన్ ఇండియా అనబడే అయిదు భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు… కానీ రాధేశ్యామ్ సినిమాలో చేసినట్టు ఇక్కడా హిందీలో డైలాగ్స్ రాసుకుని, తెలుగులోకి అనువదించినట్టుగా కొంచెం కృత్రిమత్వం గోచరిస్తోంది… మరీ దుష్యంతుడి నోటి నుంచి ‘పర్యావసానాలు’ అనే పదం, సమంత పలికిన కురువంసం పదం కూడా చికాకు పుట్టించింది… అసలు సినిమాలో ఇంకెంత భయపెడతారో ఇలాంటి షాకుంతలం వంటి పదాలతో… దుర్వాసుడిగా మోహన్‌బాబు, ముని కన్యకల్లాగా అదితి బాలన్, అనన్య కనిపిస్తున్నారు… సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో రాజీపడనట్టు కనిపిస్తోంది… ఎందుకింత ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే… ఫస్ట్ సీన్ నుంచే డిష్యూం డిష్యూం యాక్షన్, మాస్ పేరిట చెత్తను ప్రదర్శించే సినిమాలకన్నా చాలా బెటర్ కదా…!!
Share this Article