.
Rochish Mon
చూడడం తెలిసిన కె. బాలచందర్ … ప్రముఖ చలనచిత్ర దర్శకుడు కె. బాలచందర్ జయంతి ఇవాళ. బాలచందర్ దక్షిణ భారతదేశ సినిమాల్లో తమ ముద్రను బలంగా, ప్రబలంగా నమోదు చేసిన దర్శకుడు.
రజనీకాంత్ సూపర్ స్టార్ అవుతారన్న సన్నివేశాన్ని ఎంతో ముందే చూసిన దర్శకుడు బాలచందర్. కమల్ హాసన్‌లో గొప్ప నటుడు ఉన్నాడన్న విషయాన్ని కమల్ హాసన్ కన్నా ముందే చూశారు. చిరంజీవిలో ఉన్న ప్రత్యేకతనూ, ప్రతిభను, జయప్రదలో ఉన్న గొప్పనటిని అందరికన్నా ముందే చూశారు. నాగేష్ (నగేష్ కాదు) ప్రతిభను విపులంగా చూసి వెలికి తెచ్చారు.
Ads
కొత్త తరహా సినిమాలను సాహసంతో తీసి విజయవంతమై దక్షిణాదిలో దర్శకుడు అన్న స్థానానికి విలువను పెంచారు బాలచందర్. అప్పటికే తెలుగు, తమిళ్ష్, కన్నడం, మలయాళం రంగాల్లో గొప్ప సినిమా దర్శకులున్నారు. వాళ్ల సరసన బాలచందర్ తన ముద్రను గాఢంగానే వేశారు.
మధ్యతరగతి ప్రేక్షకుల్ని లక్ష్యంగా చేసుకుని వాళ్లకు సంబంధించిన ఇతివృత్తాలతో సినిమాలు తీసి రాణించారు బాలచందర్. తన సినిమాల్లోని సంభాషణల్ని, పాత్రల్ని, పాటల్ని, సినిమా ముగింపుల్ని సమాజంలో పెద్ద ఎత్తున చర్చనీయం చేశారు బాలచందర్.
అవళ్ ఒరు తొడర్ కదై (తెలుగులో అంతులేని కథ) సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమా ఆడదనుకున్నారు. నటుడు చారుహాసన్ ఈ సినిమా విషయమై నాకు ఒక వాస్తవాన్ని చెప్పారు.
- అది: అప్పటి తమిళ్ష్‌నాడు ముఖ్యమంత్రి ఎమ్.జీ.ఆర్ తనకు బాగా దగ్గరైన దర్శకుడు ప.నీలకణ్డన్‌ను ఆ సినిమాపై నివేదిక అడిగారట. అందుకు నీలకణ్డన్ “సినిమా ఆడదు వృథా అయిపోతుంది” అని చెప్పారట. విన్న ఎమ్.జీ. రామచంద్రన్ నవ్వి “పిచ్చోడా, ఇది సూపర్ హిట్ అవుతుంది” అని అన్నారట. అదే అయింది. అంతులేని కథ ఒక విజయగాథ అయింది.
తనకు సంబంధించినంత వరకూ ఎమ్.జీ.ఆర్. నాణ్యమైన సినిమాల కన్నా జనరంజమైన సినిమాలకే అతి ప్రాధాన్యతను ఇచ్చారు. అలాంటి ఎమ్.జీ.ఆర్. బాలచందర్, మహేంద్రన్ వంటి గొప్ప దర్శకులను ముందుగా పసిగట్టి వాళ్లకు తాను వెన్నుదన్నై నడిపించారు. బాలచందర్ రచయితగా పరిచయమైంది దెయ్‌వత్తాయ్ అన్న ఎమ్. జీ. ఆర్. సినిమాతోనే.
1964లో రచయితగా సినిమాలోకి వచ్చారు బాలచందర్. అంతకు ముందు నాటక రచయితగా పేరు పొందారు. AGలో accountantగా పనిచేశారు. దర్శకుడుగా ఉన్నత స్థాయికి చేరుకున్న చాల కాలం వరకూ కూడా ఆయన ఉద్యోగాన్ని వదులుకోలేదు.
ఎమ్.జీ. ఆర్., సి(శి)వాజీ గణేస(శ)న్ వంటి పెద్ద నటులతో తాననుకున్నది చెయ్యలేనని చిన్నవాళ్లతో, కొత్తవాళ్లతో సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు బాలచందర్.
బాలచందర్‌కు పాటల విషయంలో చాల గొప్ప దృక్పథం ఉండేది. ఆయన తన సినిమాల్లో గొప్ప సంగీతాన్ని చేయించుకునే వారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఎమ్.ఎస్. విశ్వనాద(థ)న్ చేత కొత్త పంథా పాటల్ని చేయించారు. బాలచందర్ వల్ల విశ్వనాదన్ లోంచి మరో విశిష్టమైన పరిణామం బయటకు వచ్చింది. బాలచందర్‌కు మహోన్నతమైన సంగీతం చేశారు విశ్వనాదన్.
ఇళైయరాజా సంచలనం సృష్టిస్తున్న సమయంలో బాలచందర్ విశ్వనాదన్ సంగీతంలో నినైత్తాలే ఇనిక్కుమ్ అన్న పూర్తి సంగీత ప్రధానమైన సినిమా (తెలుగులో అందమైన అనుభవం) తీశారు. కణ్ణదాసన్‌తో ఉన్నతమైన సాహిత్యాన్ని రాయించుకున్నారు. నిమిషాల్లో పాట రాయగల కణ్ణదాసన్ “దెయ్‌వమ్ తన్ద వీడు…” (తెలుగులో “దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి…” పాట) పాట రాయడానికి మూడు రోజులు తీసుకున్నారు. అలాంటి సందర్భాన్ని సృష్టించారు బాలచందర్.
ఎ.ఆర్.రహ్మాన్ సంచలన సంగీత దర్శకుడవుతాడన్న దాన్నీ ముందే చూడగలిగారు బాలచందర్. రహ్మాన్ తొలి సినిమా రోజా నిర్మాత బాలచందరే. అందులో “చిన్ని, చిన్ని ఆశ…” పాట సూపర్ హిట్ అవుతుందని అందరికన్నా ముందే తెలుసుకున్నది ఆయనే.
బాలచందర్ ఆకలిరాజ్యం సినిమాలో ఒక హిందీ పాట ఉంది. అది: “తుహి రాజా మే హున్ రానీ / ఫిర్ భీ నహీ హే బాత్ పురానీ…” ఈ పాటకు ఒక పూర్వరంగం ఉంది. మద్రాసులో ఒక కార్యక్రమంలో పీ.బీ. శ్రీనివాస్ ఉర్దూ గజ్‌రా (గజల్ కాదు) పాడారు. ఆ కార్యక్రమానికి బాలచందర్ వచ్చారు. పీ.బీ. శ్రీనివాస్ ఆ గజ్‌రా పాడడం అయిపోయాక…
బాలచందర్ వచ్చి “చాలా బాగా పాడారు” అన్నారట. మళ్లీ కాసెపయ్యాక పీ.బీ. ఎస్. దగ్గరకు వచ్చి “చాలా బాగా పాడారు” అని అన్నారట. ఇలా 7, 8 సార్లు జరిగింది ఆ రోజు. మరుసటి రోజు పీ.బీ.ఎస్.కు ఫోన్ చేసి ఆ ఆకలి రాజ్యం హిందీ పాట రాయించుకున్నారు. అంటే ఆ కార్యక్రమంలో గజ్‌రాను విన్నాక ఈ పాటను బాలచందర్ అలోచన చేశారన్న మాట. ఇలా మరికొన్ని సందర్భాలూ ఉన్నాయి. మామూలుగా సంగీత దర్శకులు, గేయ రచయితలకూ మధ్య జరిగే దాన్ని “కన్నె పిల్లవని కన్నులున్నవని…” పాటగా తీశారు బాలచందర్.
బాలచందర్ మంచి సంభాషణల రచయిత. మన ఆత్రేయపై, గణేశ్ పాత్రోపై కూడా బాలచందర్ ప్రభావం పడిందంటే బాలచందర్ సంభాషణల పదను (పదును) ఏమిటో తెలుసుకోవచ్చు.
బాలచందర్‌కు మన కె. విశ్వనాథ్ అంటే విశేషమైన అభిమానముండేది. అదీ శంకరాభరణం సినిమాకు ముందే. శంకరాభరణం తరువాత కె. విశ్వనాథ్ గొప్ప వారుగా పరిగణనలోకి రావడం చరిత్ర. బాలచందర్‌కు
అంతకు ముందే విశ్వనాథ్ గొప్ప వారని తెలిసింది. బాలచందర్ ‘చూడడం’ తెలిసిన సినిమా దర్శకుడు.
విశ్వనాథ్ ఓ సీత కథ సినిమాను బాలచందర్ మూన్ఱు ముడిచ్చు సినిమాగా తమిళ్ష్‌లో చేశారు. ఆ సినిమాతోనే రజనీకాంత్ నటుడుగా నిలబడ్డారు. ఆ సినిమాలోనే నటి శ్రీదేవి నాయికగా పరిచయం అయింది. ఒక సందర్భంలో కె. విశ్వనాథ్ ను మొత్తం తెలుగు సినిమాకు ప్రతినిధి అని అభివర్ణించారు బాలచందర్.
ఎంతో ఉంది బాలచందర్ గురించి చెప్పడానికి. ప్రస్తుతానికి ఇంతే చెప్పగలుగుతున్నాను. అలవాటైన దానికి అతీతమైన ఆలోచనతో, ఆచరణతో ఒక అగ్రశ్రేణి చలనచిత్ర దర్శకుడుగా చరిత్ర అయ్యారు కె. బాలచందర్… రోచిష్మాన్ 9444012279
Share this Article