అనేక కోణాల్లో బలగం సినిమాకు తెలుగు సినిమాలకు సంబంధించి ఓ విశిష్ట స్థానం ఉంది… మూస ఇమేజీ కథలతో హీరోల కాళ్ల మీద పడి దొర్లుతున్న తెలుగు సినిమాను చెవులు పట్టుకుని కథాప్రాధాన్యం దగ్గరకు లాక్కువచ్చాడు దర్శకుడు వేణు… ఆ సినిమాను అనేక ఊళ్లలో ఫ్రీగా ప్రదర్శించారు, బోలెడు గ్లోబల్ అవార్డులు కూడా వచ్చాయి అనే అంశాలు ఎలా ఉన్నా… ఓ భిన్నమైన కథను, సమాజానికి ఉపయుక్తమైన అంశాలతో చిత్రీకరించిన వేణు పలుకోణాల్లో అభినందనీయుడు…
వెకిలితనం, వెగటుతనం, అసహజం, అశ్లీలం వంటి దుర్వాసనలేమీ లేకుండా ఒరిజినాలిటీని నమ్ముకుని వేణు ఓ సాహసం చేశాడు… తెలుగు ప్రేక్షకులు మనసారా ఆశీర్వదించారు… తదుపరి సినిమాలో తనదైన మార్క్ ఉంటుందా..? రొటీన్ తెలుగు అవలక్షణాలతో సావాసం చేస్తాడా అనేది వదిలేస్తే… ఇంతకీ టీవీ ప్రేక్షకులు ఏమన్నారు..? ఎలాగూ ఓటీటీ ఫిగర్స్ బయటికి రావు… ఓటీటీ ప్లాట్ ఫాం వాడు ఏదైనా చెబితే నమ్మాలి… కానీ టీవీక్షణాలకు సంబంధించి కనీసం రేటింగ్స్ ఉంటాయి కదా… పోలికకు, అంచనాకు…
ఊరూరా ఉచిత ప్రదర్శనలు జరిగాయి… థియేటర్లలోనూ మంచి వసూళ్లు సాధించింది… ఓటీటీలో కూడా చూశారు… ఐనా టీవీల్లో ఎవరు చూస్తారు అనే ప్రశ్న ఒకటి తలెత్తింది… పైగా ఎంత స్టార్ హీరో అయినా, ఎంత పెద్ద సినిమా అయినా ఈమధ్య టీవీల్లో ఎవడూ చూడటం లేదు… అందుకే దారుణమైన రేటింగ్స్ వస్తున్నయ్… రాబోయే రోజుల్లో ఇకపై శాటిలైట్ హక్కులకు అంత పెద్దగా ధరలు పలకకపోవచ్చు, టీవీ చానెళ్లు చేతులు, మూతులు కాల్చుకుంటున్నాయి అనే పరిస్థితి ఉంది కదా…
Ads
బలగం దాన్ని కూడా మార్చేసింది… హైదరాబాద్ బార్క్ కేటగిరీలో ఏకంగా 11.98 రేటింగ్స్ సాధించింది… ఓవరాల్ రేటింగ్స్ 15 వరకూ వచ్చి ఉండవచ్చు… ఈసారి అన్ని టీవీ ప్రోగ్రాముల్లోనూ బలగం సినిమాయే నంబర్ వన్… ఆల్ చానెల్స్ టాప్ 30 జాబితాలో దీనిదే అగ్రస్థానం… అంటే, ఓటీటీ, ఫ్రీ షోలు, థియేటర్లలో చాలామంది చూసేసినా సరే, మళ్లీ టీవీలో చూడటానికి ప్రేక్షకుడు ఇష్టపడ్డాడు అని అర్థం… గుడ్… సరైన సినిమాకు సరైన స్పందన…
సినిమా మళ్లీ టీవీ ప్రేక్షకులను టీవీల ముందు కట్టేయడం ఒక విశేషం కాగా… ఈరోజుకూ సినిమా థియేటర్లలో అక్కడక్కడా ఆడుతూనే ఉంది… దీని నిర్మాణవ్యయం, టోటల్ వసూళ్ల లెక్కలు ఎలా ఉన్నా… ఈమధ్యకాలంలో ఇంతటి ప్రజాదరణ పొందిన చిన్న సినిమా మరొకటి లేదు… అదీ అభినందనీయం…!!
Share this Article