బలగం… ఈ సినిమా దిల్ రాజుది కాదు… ప్రియదర్శిది కాదు… ఇంకెవరిదీ కాదు… దర్శకుడు జబర్దస్త్ వేణుది… పాటల రచయిత కాసర్ల శ్యాంది… సంగీత దర్శకుడు భీమ్స్‌ది… జబర్దస్త్ వేణుకు టేస్ట్ ఉంది… తను ఇన్నాళ్లూ ఓ కమెడియన్ మాత్రమే… ఓ ఆర్టిస్టు మాత్రమే… కానీ తనలో ఆలోచించగల, ఆలోచింపచేయగల దర్శకుడు కూడా ఉన్నాడని ప్రదర్శించుకున్నాడు… అందుకు వేణుకు అభినందనలు… కాంతర వంటి కథయితే వేణు ఇంకా చెలరేగేవాడేమో… ఒక చావు చుట్టూ ఇలాంటి కథను ఇంత బలంగా అల్లిన తీరు బాగుంది…
ఏదో పిచ్చి కామెడీ సినిమాయో, యాక్షన్ సినిమాయో చుట్టేయలేదు… తన ప్రాంతపు ఆత్మను బలంగా వెండి తెర మీద చూపించాడు… ఈరోజుకూ ఆంధ్ర ప్రాంత సినిమా యాక్టర్లు, మాటల రచయితలు గట్రా తెలంగాణ భాషను, సంస్కృతిని ఖూనీ చేస్తూనే ఉన్నా దశలో… వెక్కిరిస్తున్న దుర్దినాల్లో… వేణు అచ్చమైన తెలంగాణతనాన్ని చూపించాడు… అసలు చావును పండుగలా చేసుకోవడం ఏమిటి అనుకుంటారేమో, తెలంగాణకు చావైనా, పెళ్లయినా ఒకటే…
బలగం సినిమాలో కథ కూడా ఓ చావు చుట్టూ తిరుగుతుంది… కాష్టం దగ్గర పెట్టిన తిండిని ఒక్క కాకీ ముట్టకపోవడం ఏమిటో, దాన్ని ఏ శకునంగా భావిస్తారో చెప్పడం గతంలో కూడా ఒకటీరెండు (ఉదాహరణకు తితి) సినిమాల్లో ఉన్నదే… గడ్డం సతీష్ అనే రచయిత కూడా ఇదే పాయింట్ చుట్టూ ఓ కథ అల్లాడు… వాటిని కాపీ కొట్టాడా, స్పూర్తిగా తీసుకున్నాడా, కాకతాళీయమా తెలియదు గానీ వేణు ఓ ఎమోషనల్ కథను రాసుకున్నాడు… అయితే సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే… స్లో పేస్‌లో నడుస్తుంది కథనం… అంతే…
Ads
ఓ మామూలు కమర్షియల్ సినిమాను మాత్రమే చూడగల ప్రేక్షకులు ఈ సినిమాకు వెళ్లనక్కర్లేదు… మీకు నచ్చదు… ఇది పిచ్చి కమర్షియల్ లక్షణాలు అనబడే తలతిక్క ధోరణులకు దూరంగా ఉన్న సినిమా… ఇందులో ఓ చావు, చావు తరువాత కలిసిపోయే బంధాలు, ఆ బంధాలు చుట్టూ పంచాయితీలు, అప్పుల తిప్పలు అన్నీ ఉంటయ్… ఐటమ్ సాంగ్స్, దిక్కుమాలిన ఫైట్లు, నెత్తిమాసిన స్టెప్పులు, ఇమేజీ చెత్తా బిల్డప్పులు ఏమీ ఉండవు… అందుకని వేణును అభినందించాలి…
సినిమా కథకు తగ్గట్టు… ఆ ఎమోషన్స్‌కు తగ్గట్టు శ్యాం మంచి పాటలు రాశాడు… భీమ్స్ సిసిరోలియో కథకు తగ్గ సంగీతాన్ని ఇచ్చాడు… కాకపోతే సినిమా చూసేవాడికి స్లో నెరేషన్ ఓపికగా తట్టుకోవాలి… సినిమా ఫస్టాఫ్, సెకండాఫ్ సంగతేమో గానీ క్లైమాక్సులో వేణు తనలోని అసలైన దర్శకుడిని ఆవిష్కరించాడు… కామెడీ చేసుకునే వేణేనా అనిపిస్తుంది… ఎమోషన్ ఉంది, దాని చుట్టూ అల్లిన కామెడీ కూడా ఉంది… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ తెలంగాణ పల్లెలో చావుకు పోయినట్టుంటది సినిమా…
దిల్ రాజు, శ్యాం, భీమ్స్, వేణు, ప్రియదర్శి ఎట్సెట్రా అందరూ తెలంగాణ వాళ్లే కాబట్టి తెలంగాణ మట్టి పరిమళాన్ని దేహమంతా అద్దుకున్నవాళ్లే కాబట్టి ఓ పర్‌ఫెక్ట్ తెలంగాణ సినిమాలాగా వచ్చింది… అలాగని వేరే ప్రాంతీయులు చూడొద్దని కాదు, ఎమోషన్ ప్రతి మనిషిదీ కదా… వందల కోట్లతో థియేటర్ నిండా పచ్చటి నెత్తురు పారించే బడా హంతక దర్శకులు ఖచ్చితంగా చూడదగిన సినిమా తీశావు వేణూ…
సాయిలుగా ప్రియదర్శి, కొమురయ్యగా సుధాకర్‌రెడ్డి బాగా నటించారు… మిగతా వాళ్లంతా వోకే… వాళ్ల పాత్రలకున్న ప్రాధాన్యం అంతే… అసలు జీవితంలో నిజమైన బలగం (ఫ్రెండ్స్, రిలేషన్స్ సర్కిల్) అంటే ఏమిటి..? పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు వెళ్లకపోయినా సరే, చావు దగ్గరికి మాత్రం వెళ్లాలి… వీడ్కోలు పలకాలి… అప్పుడే ఆత్మ పట్టుకున్న కాకి అన్నాన్ని ముడుతుంది… ముట్టలేదంటే మరణించిన వ్యక్తి ఏదో అసంతృప్తితో ఉన్నట్టు… అదేమిటో తెలియాలంటే సినిమా చూడాలి… అబ్బో, ఈ ఏడుపు సినిమాను ఎవడు చూస్తాడు అంటారా..? మీ టేస్ట్ మీ ఇష్టం… దెబ్బకు పదిమందినీ నరికేసే, హీరోయిన్లతో వెకిలి స్టెప్పులు వేసే స్టార్ మాస్ హీరో ఆ పక్క థియేటర్‌లోనే ఉంటుంది, వెళ్లండి…!!
Share this Article