ఆ డైలాగులు జగన్ మీదేనా..? ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డిలో పొలిటికల్ దాడికి దిగాడా..? ఇదీ ఇప్పుడు చర్చ… ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో పెరుగుతున్న హీట్ సెగ బాలయ్యను, బాలయ్య సినిమాల్ని కూడా తాకుతోందా..? మొన్నటికిమొన్న తన అన్‌స్టాపబుల్ ఓటీటీ షోలో గుడివాడ ప్రస్తావన రాగానే బాలయ్య కావాలనే కొన్ని డైలాగులు వదిలాడు… తగలాల్సిన వాళ్లకు తగిలిందో అనే డౌట్ కూడా వచ్చిందేమో, ఎందుకిలా అంటున్నానో తెలుసు కదా అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు… (కొంపదీసి లోకేష్ రేప్పొద్దున ఎన్నికల్లో ఆ ఏరియాలో పోటీచేస్తున్నాడా..?)
వీరసింహారెడ్డి బాలయ్య కొత్త సినిమా… బాలయ్య సినిమా అంటేనే టైటిల్‌లో సింహం పేరొచ్చేలా జాగ్రత్తపడతాడు… సింహ, నరసింహారెడ్డి ఎట్సెట్రా… తనను నటసింహం అని పిలుస్తారు కదా… మరి ఇలా పొలిటికల్ దాడికి దిగాలనుకుంటే ఈ సింహం స్ట్రెయిట్‌గానే కామెంట్స్ పాస్ చేయొచ్చు కదా, డొంకతిరుగుడు డైలాగులు దేనికి అనేది కొందరి ప్రశ్న…
Ads
ప్రత్యేకించి ‘‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు, మార్చలేరు…’’ అంటాడు బాలయ్య ఓచోట… ‘‘పదవి చూసుకుని నీకు పొగరేమో, కానీ బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ…’’ అని మరో డైలాగు కూడా ట్రెయిలర్‌లో ఉంది… బాలయ్య మార్క్ డైలాగులు ఇంకా చాలా వినిపిస్తున్నాయి… కానీ ఈ రెండు డైలాగులకు కాస్త పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉంది… ఐతే ఇవి సినిమాలో ఉంటాయో లేదో తెలియదు… ఎందుకంటే..?
ఈ సినిమాతోపాటు ఇదే సంక్రాంతికి మరో సినిమా వస్తోంది… దాని పేరు వాల్తేరు వీరయ్య… అందులో చిరంజీవి హీరో… దాని ట్రెయిలర్లలో చిరంజీవి మార్క్ ఫోజులు, స్టెప్పులు తప్ప పొలిటికల్ డైలాగులేమీ లేవు… కానీ ఈమధ్య తను తమ్ముడు పవన్ కల్యాణ్ పేరును పదే పదే కలవరిస్తున్నాడు… పవన్ కల్యాణ్ అంటే జగన్‌కు మంట… సహజంగానే పొలిటికల్ ప్రత్యర్థి కాబట్టి… పవన్ కల్యాణ్ కూడా దానికి తగినట్టే గోకుతూ ఉంటాడు… సో, ఇటు బాలయ్య, అటు చిరంజీవి ఇద్దరూ జగన్‌కు రాజకీయ ప్రత్యర్థులే… కాకపోతే బాలయ్య ప్రత్యక్షం, బాబు వియ్యంకుడిగా, టీడీపీ ఎమ్మెల్యేగా… చిరంజీవి పరోక్షం, పవన్ కల్యాణ్ సోదరుడిగా…
ఆ రెండూ తీస్తున్న మైత్రీ మూవీస్ వాళ్లు జగన్‌తో గోక్కోవడానికి సిద్ధపడతారా అనేది ఓ క్వశ్చన్… సదరు నిర్మాతల సామాజికవర్గం గట్రా పరిశీలిస్తే… జగన్ గనుక కాస్త కన్నుతెరిస్తే వాళ్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు… దానికీ మైత్రీ మూవీస్ సిద్ధమేనా..? పొలిటికల్, బ్యూరోక్రటిక్, సినిమా సర్కిళ్లలో ఇదీ మథనంలో ఉన్న ప్రశ్న… సరే, అసలు ఈ పేరు- చరిత్ర డైలాగులు ఏమిటి అంటారా..?
ఆమధ్య జగన్ ఎన్టీయార్ ఆరోగ్య వర్శిటీ పేరులో నుంచి ఎన్టీయార్ పేరును కత్తిరించిపారేసి, వైఎస్ పేరు పెట్టాడు కదా… అదేమంటే వైఎస్ డాక్టర్ కాబట్టి ఆయన పేరు పెట్టామని ఓ వింత సాకు చెప్పుకున్నయ్ ప్రభుత్వ, పార్టీ వర్గాలు… ఇప్పుడు ఇక్కడ ఆ చర్చలోకి వెళ్లే పనిలేదు కానీ ‘‘సంతకాలు చేస్తే పేర్లు మారుస్తారు, కానీ చరిత్ర మార్చలేరు’’ అనే డైలాగ్ సరిగ్గా ఆ రాజకీయ నిర్ణయానికి కౌంటర్‌గా పనికొస్తుంది… కానీ అదేదో ఈ సింహం స్ట్రెయిట్‌గానే విసుర్లకు సాహసించవచ్చు కదా… ఈ సింహానికి ఆ సాహసం ఏమైందబ్బా..?! అవునూ, ఆ మైలురాయి మీద పులిచర్ల అని కనిపిస్తోంది… పులివెందులకు పరోక్షనామమా అది..?!
Share this Article