“కానీ చెంప దెబ్బలు తిన్నవాడు ఆ దైవాంశ సంభూతుడి చేతి స్పర్శ వలన తమకంతో ఉబ్బితబ్బిపోయానంటున్నాడు… ప్రజల (అ)జ్ఞానం రోజు రోజుకూ ఘటోత్కచులవారు చెప్పినట్లు ద్విగుణం బహుళం అవుతోంది. ఇంత దిగజారుడు సంస్కారాన్ని కూడా జీర్ణించుకొని, దానికొక ఆత్మీయ స్థాయి కల్పిస్తున్న ప్రజల దౌర్భాగ్యాన్ని తలుచుకొంటే ఎంతమంది పప్పూరి రామాచార్యులు, విద్వాన్ విశ్వంలు, తరిమెల నాగిరెడ్లు, సింగమనేని నారాయణలు ఆ గడ్డ మీద పుడితే ఏం లాభం?”………. దంచు దంచు.. ఇంకా దంచు అన్న శీర్షికతో ’ముచ్చట‘లో పబ్లిష్ అయిన ఆర్టికల్ కు ఒక రాయలసీమ పెద్దాయన స్పందన ఇది… ఆయన వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్. రాయలసీమ సాహిత్యాన్ని ఇష్టంగా నాలుగు దశాబ్దాలుగా చదువుతున్నవాడు. ఇంత లోతుగా కాకపోయినా హిందూపురం నుండి అనేక మంది మిత్రులు దాదాపుగా ఇలాగే స్పందించారు.
చెంప దెబ్బలు తినడం తన పూర్వ జన్మల పుణ్య విశేష ఫలమని, కోట్ల మందిలో ఒకరికో, ఇద్దరికో తప్ప ఇలాంటి బుగ్గలకు బూరెలు పూచే చెంపదెబ్బల వరం దొరకదని ఆ అబ్బాయి చేత ఒక పరవశ స్పందన వీడియో రిలీజ్ చేయించారట. ఆ అబ్బాయి బలవంతంగా చెప్పి ఉండవచ్చు. నిజంగానే తన అదృష్టానికి తానే మురిసిపోయి ఇష్టంగా చెప్పి ఉండవచ్చు. ఇప్పుడంటే హిందూపూర్ తనను తాను మరచిపోయి పరాయిదయిపోయింది కానీ- కల్లూరు సుబ్బారావును కన్న ఊరు. మహాత్మా గాంధీ ఆయనకు జైలు విద్యార్థి అని బిరుదు ఇచ్చాడు. ఆయన్ను అరెస్ట్ చేసి బళ్లారి జైలుకు తీసుకెళుతుంటే కల్లూరు నుండి గుర్రబ్బండిలో హిందూపురం రైల్వే స్టేషన్ కు భార్య వచ్చేవరకు రైలును కదలనివ్వకుండా పట్టాలపై అడ్డంగా పడుకుని పౌరుషాగ్నిని చాటుకున్న ఊరు. నీలం సంజీవ రెడ్డి, ఎన్ టిఆర్ లాంటి వారికి పోటీ చేయడానికి అవకాశం కల్పించిన ఊరు. కన్నడ- తెలుగు భాషా సంస్కృతుల కలగలుపులకు అలవాలమయిన ఊరు. లేపాక్షి విజయనగర వైభవోజ్వల మంటపాల పాదుల్లో తీగసాగి పూసిన పద్య సాహితీ గంధాలను తనువంతా అద్దుకున్న ఊరు. పరాయి ప్రాతినిధ్యం మోజులో తన నాయకత్వాన్ని తానే తగ్గించుకుని- నాయకుడు లేని ఊరుగా దిక్కులు చూస్తున్న ఊరు.
Ads
సైకో ఫాన్స్, వీర సైకో ఏసి లు ఎంతగా పరవశించి సమర్థన వీడియోలు పెడుతున్నా- తగిలే చెంపదెబ్బలకు మించి హిందూపురం మనసుకు ఇంకేవో గాయాలయ్యాయి. గాయలవుతున్నాయి. అవి బండబారిన గుండెలకు వినిపించవు. కనిపించవు. అర్థం కావు. ఒక వి వి గిరి, ఒక రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, ఒక కల్లూరు హోదాలు మరచి సంగీత సాహిత్యాలు మాట్లాడుకున్న హిందూపురం వేదికలు ఇప్పుడు మౌనంగా రోదిస్తున్నాయి. హిందూపురం చెంపల మీద కనిపించని కన్నీటి చారికలను చూడగలిగే నాయకుడెప్పుడు పుడతాడో? పుడతాడో లేదో? ఏమో!……… By… – పమిడికాల్వ మధుసూదన్
Share this Article