Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాదేదీ హైజాక్‌కు అతీతం… పాక్ ఆర్మీ మీద సర్‌ప్రయిజ్ అటాక్..!!

March 13, 2025 by M S R

.

బైకులు, కార్ల దొంగతనాలు; బస్సును మాయం చేయడాలు; ఆకాశంలో లోహ విహంగమైన విమానాన్ని హైజాక్ చేసి మేఘాల్లోనే దారి మళ్ళించుకోవడాలు…చూసి చూసీ…విని వినీ విసుగెత్తిపోయాం.

చరిత్రలో పట్టాల మీద రైళ్ళు నడుస్తున్నప్పటినుండి రైలు హైజాక్ అయ్యిందో! లేదో! తెలియదు కానీ…పాకిస్థాన్లో బలూచిస్థాన్ వేర్పాటువాదులు ఆ రికార్డును నెలకొల్పారు. రైలు పట్టాల మీదే వెళ్ళాలి కాబట్టి హైజాక్ చేయడం కుదరదు అని ఇన్ని దశాబ్దాలుగా ఎవరూ ప్రయత్నించలేదు.

Ads

కాలమెప్పుడూ కదులుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి. రైలు హైజాక్ ఇంత సులభమా! అరెరే! ఇన్నేళ్ళుగా కష్టమనుకుని ప్రయత్నించలేదే! అని ప్రపంచవ్యాప్త సంఘ విద్రోహక శక్తులు సిగ్గుపడేలా, అసూయపడేలా, తలదించుకునేలా బలూచిస్థాన్ వేర్పాటువాదులు ఎన్నెన్నో కొత్త పాఠాలు నేర్పారు!

గుండె బలహీనంగా ఉన్నవారు ఈ వార్త చదివి రైలెక్కితే… ప్రతివాడిలో హైజాకర్ ను పోల్చుకోలేక… ప్రయాణమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తుంది.

ఇంతకూ బలూచిస్థాన్ వేర్పాటువాదుల రైలు హైజాక్ సన్నివేశం ప్రపంచ ప్రఖ్యాత సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాల హిచ్ కాక్ స్టోరీలా నరాలు తెగే ఉత్కంఠతో ఏమీ లేదు. They came; They saw; They conqured ( వారు వచ్చారు; చూశారు; స్వాధీనం చేసుకున్నారు) అన్నంత సింపుల్ గా జరిగింది!

ప్రశాంత వాతావరణంలో సున్నితంగా జరిగిన ఈ హైజాక్ లో ప్రయాణికులను, ప్రధానంగా సైనికులను బందీలుగా పట్టుకుని… జైళ్ళలో ఉన్న తమవారిని విడిపించుకోవడానికి డిమాండ్లేవో పెట్టినట్లున్నారు. పాకిస్థాన్ సైనికులు, భద్రతాదళాలకు చెందిన ముప్పయ్ మందిని బోగీల్లోనే చంపేశారని తొలి వార్త.

33 మంది బలూచిస్థాన్ మిలిటంట్లనే భద్రతాదళాలు మట్టుబెట్టాయని, అందరినీ విడిపించారని కడపటి వార్త. 48 గంటల్లోగా జైళ్ళలో ఉన్న తమవారిని బేషరతుగా విడుదల చేయకపోతే బందీలుగా ఉన్న సైనికులు, భద్రతా బలగాల్లో ఒక్కొక్కరినీ చంపేస్తామని బెదిరిస్తున్నారు. 100 మంది సైనికుల్ని చంపేశామని, ఇంకో 150 మంది తమ బందీలుగా ఉన్నారని మిలిటెంట్లు చెబుతున్నారు.

రైల్లో ఉన్న జనంలో సగానికి పైగా సైనికులు, పోలీసులే ఉండగా బలూచిస్థాన్ వేర్పాటువాదుల గుంపు పట్టాలను పేల్చి…రైలును హైజాక్ చేసి…కొందరిని చంపి…మిగిలినవారినందరినీ బందీలుగా పట్టుకుని… డిమాండ్ల రాయబార గీతాలు పాడడం విచిత్రంగా ఉంది. పాక్ సైన్యం కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టిందట.

“ఎవడైనా కసిగా కొడతాడు; కోపంగా కొడతాడు…వీడేమిట్రా! ఇటుక ఇటుక పేర్చినట్లు…తీగకు అంటు కట్టినట్లు చాలా పద్ధతిగా కొట్టాడు?” అని అతడు సినిమాలో విలన్ పాత్ర చేత చెప్పిస్తాడు త్రివిక్రమ్. అలా- “ఎవరైనా పాకిస్థాన్ లో బాంబులేసుకుంటారు; తుపాకులతో కాల్చుకుంటారు; ఆత్మాహుతి దళాలతో చంపుకుంటారు; మనుషులను కిడ్నాప్ చేసి డిమాండ్లు సాధించుకుంటారు…వీళ్ళేమిట్రా! ఇలా పద్ధతిగా పట్టాలు ఊడబెరికి…రైలు హైజాక్ చేశారు?” అని ఆశ్చర్యపోయేలా చేశారు!

కొస మెరుపు:-

“హైజాక్” కు తెలుగు మాటే ఇంతవరకూ పుట్టలేదు. “దారి మళ్ళించడం” లాంటి దగ్గరి మాట ఉన్నా…అది హైజాక్ కు సమానార్థకం కాదు. అదేమిటి సార్! తెలుగులో మాటలేకపోతే ఎలా? అని ఒక భాషాశాస్త్ర పండితుడిని అడిగాను.

“మనకు హైజాక్ అలవాటు లేదు. దాంతో మాట అవసరం రాలేదు… పుట్టలేదు”- అన్నారు నవ్వుతూ. “కిడ్నాప్”కు మాత్రం సరైన తెలుగు పదం ఉందా? “బలవంతంగా ఎత్తుకెళ్ళి నిర్బంధించడం”; “అడ్డగించడం” అని అంటారు కానీ… అది సమానార్థకం ఎలా అవుతుంది? అని నన్ను నిరుత్తరుడిని చేశారు!

ప్రపంచం తలకిందులయ్యే ఇలాంటి హైజాక్, కిడ్నాప్ లకు దేశభాషలందు లెస్స అయిన తెలుగులో మాటలు లేకపోవుటయా!
హతవిధీ!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions