అమెరికా… ఓ కార్గో నౌక ఢీకొట్టి బాల్టిమోర్ బ్రిడ్జి పేక మేడలా కూలిపోయిన దృశ్యం చూశాం కదా టీవీల్లో… ఆ దుర్ఘటనలో బ్రిడ్జి మీద ప్రయాణించేవాళ్లు, నౌకలో ఉన్నవాళ్లు కలిసి ఎందరు ప్రాణాలు కోల్పోయారు..? ఇదే కదా అందరి మెదళ్లలో మెదులుతున్న ఆందోళన…
ఎవరూ లేరు… సమయానికి మేరీలాండ్ రవాణా శాఖ అప్రమత్తం కావడంతోపాటు ప్రమాదం జరిగింది అర్ధరాత్రి కాబట్టి భారీ ప్రాణనష్టం నివారింపబడినట్టయింది… ఈ విషయాన్ని అమెరికా ప్రెసిడెంట్ జో బైడన్ స్వయంగా వెల్లడించాడు… అంతేకాదు, ఆ నౌకలోని భారతీయ సిబ్బంది సమయానికి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడంతో భారీ నష్టం తప్పిందని పేర్కొన్నాడు…
‘పవర్ సిస్టం బ్రేకయి మొత్తం నౌక మా అదుపు తప్పింది’ అని ఆ సిబ్బంది లోకల్ అథారిటీస్‌కు ఎస్ఓఎస్ పంపించింది… వెంటనే అధికారులు అప్రమత్తమై, ముందుగానే బ్రిడ్జి మీద రాకపోకల్ని నిలిపివేశారు… కాసేపటికే నౌక ఆ బ్రిడ్జిలో కీలకమైన ఓ స్థంభాన్ని ఢీకొని, దాని ప్రభావంతో మొత్తం బ్రిడ్జి కూలిపోయింది… ఢీకొన్న వెంటనే అక్కడికి వెళ్లిన అధికారులు నౌకలో సిబ్బందిని కూడా రక్షించారు… ఆ బ్రిడ్జి మీద ఏవో మైనర్ రిపేర్లు చేస్తున్న ఆరుగురు టెక్నీషియన్స్ మాత్రం మిస్సింగ్…
Ads
సింగపూర్ జెండాతో ఉన్న ఈ రవాణా నౌక (డాలి) బాల్టిమోర్ పోర్టు నుంచి శ్రీలంకకు బయల్దేరింది… అందులో సిబ్బంది మొత్తం ఇండియన్స్… ఫ్రాన్సిస్ స్కాట్ బ్రిడ్జిలోని ఆ ముఖ్యమైన స్తంభాన్ని ఢీకొట్టిన సెకన్లలోనే 50 అడుగుల లోతున్న నీళ్లలో మొత్తం కూలిపోయింది… కూలిన తరువాత దృశ్యాల డ్రోన్ వీడియో ఇదుగో…
ఢీకొనడానికి ముందు నౌకలో రెండుమూడుసార్లు చీకటి అలుముకున్న సీన్లు, పొగ సీసీటీవీ ఫుటేజీలో గమనించారు… ప్రమాద సమయంలో 22 మంది సిబ్బంది ఉన్నారు అందులో… మిస్సయిన ఆరుగురు మాత్రం ఆ సమయంలో బ్రిడ్జి మీద గుంతలను పూడ్చే పనిలో ఉన్నారు… ఇప్పుడు వారి ఆచూకీ ఇంకా దొరకలేదు…
(Bridge in 2014 Photo)
మొత్తం బ్రిడ్జి పునర్నిర్మాణం ఖర్చు ఫెడరల్ ప్రభుత్వమే భరిస్తుందని బైడన్ ప్రకటించాడు… నౌక ఆపరేటర్ నుంచి క్లెయిమ్ చేసుకోవాలి కదానే ప్రశ్నకు ‘అదంతా తరువాత చూసుకోవచ్చు, ముందైతే పునర్నిర్మించి వెంటనే ఓపెన్ చేయాల్సి ఉంది’ అని బదులిచ్చాడు ఆయన… ప్రస్తుతం పోర్టును మూసేశారు… ట్రాఫిక్ డైవర్ట్ చేశారు… ఇది ఇంపార్టెంట్ బ్రిడ్జి కాబట్టి, ఆ శిథిలాలు రాకపోకలకు అడ్డుంగా ఉన్నందువల్ల ఈ ప్రభావం ట్రాఫిక్ మీద, పోర్టు షిప్పింగ్, లోడింగ్ వ్యవహారాల మీద చాన్నాళ్లు ఉండబోతుంది…
Share this Article