Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సరే, సరే… మీ చావు మిమ్మల్ని చావనివ్వం… చావు మిషన్‌పై నిషేధం…

July 24, 2024 by M S R

“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి”

పుట్టిన వారికి మరణం తప్పదు. మరణించినవారికి మళ్లీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం దిగులుపడవద్దు.

భగవద్గీతలో ఈ శ్లోకం చాలా ఫేమస్. చావు పందిట్లో సౌండ్ బాక్స్ లో ఘంటసాల పాడిన భగవద్గీతను మొదట ఎవరు వాడారోకానీ…ఆ క్షణం నుండి భగవద్గీత ఆత్మలకు, అంతరాత్మలకు, దశదిన కర్మలకు, శవ యాత్రలకు, సంతాప సభలకు, సామూహిక శోక సభలకు మాత్రమే పరిమితమైపోయింది. అర్జున విషాదయోగం అని ఒక అధ్యాయానికి పేరు ఉండడంతో భగవద్గీత విషాదానికి సంకేతంగా మరికొందరు భావించారు.

Ads

నిజానికి మొత్తం భగవద్గీత కర్తవ్య బోధ. పనులు చేయకుండా తప్పించుకునే పలాయనవాదులకు కర్రుకాల్చి భగవంతుడు పెట్టిన వాత. ఎనభై ఏళ్లు దాటి కాటికి కాళ్లు చాచినవారికి తప్ప మిగతావారికి భగవద్గీత అంటరానిది కావడానికి రకరకాల కారణాలు. ఆ చర్చ ఇప్పుడు అనవసరం.

అనాయాసేన మరణం;
వినా దైన్యేన జీవనం – అని సుఖమయిన చావు కోసం; ఒకరు జాలిపడేలా జీవితం ఉండకుండా ఉండడం కోసమే గుడికి వెళ్లినప్పుడు భగవంతుడిని ప్రార్థించాలని ఒక ప్రమాణం . ఇలా అడగడానికి మొదట ధైర్యం కావాలి ; తరువాత అమాయకత్వమో, అజ్ఞానమో అయినా ఉండి ఉండాలి.

వాడుక మాటల్లో చావు గురించి ఎన్ని ఎగతాళి మాటలు అయినా ఉండవచ్చు.
కానీ చావు ఎగతాళి కాదు.
చావు- చచ్చేంత సీరియస్.

చచ్చేప్పుడు నొప్పి తెలియకుండా, హాయిగా చనిపోవడానికి ఆస్ట్రేలియాలో ఆధునిక యంత్రాన్ని కనుక్కున్నారు. అయితే చావుకు ఎవరూ ముహూర్తం పెట్టుకోరు. అలా పెట్టుకున్నారంటే అది ఆత్మహత్య. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఆత్మహత్యాయత్నం హత్యాయత్నంతో సమానమయిన నేరమే. మనలాగే మిగతా దేశాల్లో కూడా ఆత్మహత్య నేరం. చేయకూడని పాపం.

హత్యలు, ఆత్మహత్యలు నేరాలే. కానీ…ఆగట్లేదు కదా? రకరకాల కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారికి చివరి క్షణాలు హాయిగా, ప్రశాంతంగా గడవడానికి తమ ఆధునిక ఆత్మహత్యా యంత్రం అద్భుతంగా పనికివస్తుందని దీని తయారీదారులు చావు కబురు చల్లగా బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

ఒక గ్లాస్ క్యాప్సూల్ లా ఉండే ఈ చేంబర్లోకి కూర్చుని…పైన గ్లాస్ డోర్ బిగించుకుని…స్విచ్ ఆన్ చేసుకుంటే చాలట… హాయిగా చస్తారట.

ఉరితాడు, సీలింగ్ ఫ్యాన్, విషం, రైలు పట్టాలు, బావులు ఓల్డ్ ఫ్యాషన్. గ్లాస్ క్యాప్సూల్ లేటెస్ట్ ఫ్యాషన్.

ఆత్మహత్య కూడా టెక్నికల్ గా బాగా అప్ డేట్ అయ్యింది.
“విష్ యూ ప్లెజెంట్ సూసైడ్!” అని విషెస్ కూడా చెప్తారో ఏం పాడో!

ఇలాంటి ఆత్మహత్యా యంత్రాలు, పరికరాలు, ఈ ప్రక్రియలను న్యాయవ్యవస్థలు అంగీకరించవు. కొన్ని దేశాల్లో ఐచ్చిక మరణాన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే అనుమతిస్తారు.

మనిషి మనుగడలో అడుగడుగునా యంత్రమే.
చివరికి…
“మరణాన్ని ఎంజాయ్ చేస్తూ చావడానికి మా కరెంటు పెట్టెనే వాడండి…
మన్నికకు మన్నిక…
సుఖమయిన చావు గ్యారెంటీ”-
అని వాణిజ్య ప్రకటనలు కూడా మొదలయ్యాయి!

సందర్భం:-

స్విట్జర్లాండ్ లో కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించే ఇలాంటి క్యాప్సూల్ పెట్టెను తయారు చేశారు. ప్రయోగాత్మకంగా పరీక్షించి…మార్కెట్లో విడుదల చేశారు. ఈ క్యాప్సూల్లో కూర్చున్నవారు బటన్ నొక్కిన ముప్పయ్ సెకెన్లలో ఆక్సిజన్ ఒక శాతానికి పడిపోయి రెప్పపాటులో చనిపోతారట.

అందమైన మంచు కొండలతో అంతర్జాతీయ టూరిస్టులను ఆకర్షించే స్విట్జర్లాండ్ లో ఈ ఆత్మహత్య క్యాప్సూల్ గొడవేమిటి? చేసినవాడికి బుద్ధి లేకపోయినా…దీన్ని అనుమతించినవారికయినా బుద్ధి ఉండక్కర్లేదా? అని జనంలో వ్యతిరేకత వచ్చేసరికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఈ సూసైడ్ క్యాప్సూల్ ను నిషేధించింది… – పమిడికాల్వ మధుసూదన్   9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions