.
నిన్న ఎక్కడో మాట్లాడుతూ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయుడు ఇట్లనియె… ‘‘కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు బాగా సన్నిహిత నేత ఒకాయనకు బీదర్‌లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ కలదు, అందు దొంగ నోట్లు ముద్రించెదరు…
ఆ నోట్లనే తెచ్చి గత ఎన్నికల్లో వోటర్లకు బీఆర్ఎస్ నాయకులు పంచిరి… ఆ ప్రెస్సు మీద దాడి చేయడానికి వెళ్లే పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చినారు… సిద్దిపేటలో ఎస్పీగా పనిచేసిన ఒకాయన నాకు స్వయంగా ఈ నిజం వెల్లడించెను…’’
Ads
ఎస్, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు, విమర్శలు… ఒక కేంద్ర మంత్రి నుంచి ఇలాంటి అడ్డదిడ్డం విమర్శల్ని ఎక్స్‌పెక్ట్ చేయలేం… బండి సంజయ్ ఇంకా కరీంనగర్ గల్లీ లీడర్‌ను అనుకుంటే ఇక ఎవరేం అనగలరు..? మహాశయా… తమరిప్పుడు ఈ దేశ ప్రభుత్వంలో అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు… గమనించగలరు…
సరే, నిజంగానే కేసీయార్‌కు దొంగ నోట్ల ప్రెస్ ఉందనీ, ఆ నకిలీ నోట్లే వోటర్లకు పంచారు అనుకుందాం, కాసేపు డిబేట్ కోసం… ఈరోజుకూ ఒక్క వోటర్ కూడా ఇదుగో బీఆర్ఎస్ వాళ్లిచ్చిన దొంగ నోటు అని బయటికి రాలేదేం..? నీదాకా అవసరం లేదు, ఆ విమర్శలు గనుక వస్తే కేసీయార్‌ను బుక్ చేయడానికి రేవంత్ రెడ్డి తక్షణం రెడీ అయిపోయేవాడు కదా…
పోనీ, కర్నాటకలో కూడా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా… కేసీయార్ పోరాడేది కాంగ్రెస్ పార్టీతోనే కదా… మరి అక్కడి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది..? తెలంగాణ పోలీసులు అక్కడికి వెళ్లి ఆ ప్రెస్ మీద యాక్షన్ ఎలా తీసుకుంటారు..? కేసీయార్‌కు చెప్పకుండా వాళ్లెలా వెళ్తారు..? ఏదో ఒకటి అనేస్తే సరి అనుకుంటే ఎలా సంజయుడా..?
వోకే, కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్నది మోడీ ప్రభుత్వమే కదా… అంటే మీరే కదా… మరి ఎప్పుడైతే దొంగ నోట్ల సమాచారం వచ్చిందో… కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే కేంద్రమే రంగంలోకి దిగొచ్చు కదా… మీరు ఆమేరకు బీజేపీ హైకమాండ్‌ను అలర్ట్ చేసి, రంగంలోకి దింపాలి కదా…
నకిలీ కరెన్సీ అనేది ఒక రాష్ట్రానికి చేటు కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థకే చేటు… మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు అలర్ట్ చేయలేదు..? వోకే, ఎన్నికలయ్యాక ఎవరో ఎస్పీ చెప్పారనే అనుకుందాం… తర్వాతైనా తన నుంచి అసలు నిజాలు రాబట్టాలి కదా… పైగా తమరే ఇప్పుడు హోం మంత్రి… తమరి బాధ్యతల్లో ఇదీ ఒకటి కాదా…
ఆ ప్రెస్ బయటిపెట్టి, అటు కర్నాటక కాంగ్రెస్‌ను, ఇటు తెలంగాణ బీఆర్ఎస్‌ను జనం ముందు దోషులుగా నిలబెట్టొచ్చు కదా… హేమిటో… కేటీయార్ రేషన్ బియ్యం తలంబ్రాలు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో, తమరి దొంగ నోట్ల విమర్శలూ సేమ్ సేమ్…!! బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కునే విధానం ఇది మాత్రం కాదు..!!
బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ దీనిపై స్పందిస్తూ సంజయ్‌కు గనుక నిజాయితీ ఉంటే ఈడీ, ఎన్ఐఏ, సీబీఐలకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరాడు… బండి సంజయుడా రెడీయా..?!
ఇది ఏ సంవత్సరంలోనిదో తెలియదు గానీ… అప్పట్లో సిద్దిపేట ధర్నాలో వీహెచ్ దొంగనోట్ల మంత్రి అని కేసీయార్‌ను నిందిస్తున్న క్లిప్పింగ్ ఇది… దీన్ని బీజేపీ కేడర్ మళ్లీ సర్క్యులేషన్‌లోకి తీసుకొస్తోంది…!!
Share this Article