ఏమన్నాడు బండి సంజయ్..? ‘‘ఏపీలో ఒక మతం రాజ్యమేలుతుంది… బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలి… దుబ్బాక, గ్రేటర్ ఫలితాలే తిరుపతిలో పునరావృతం అవుతాయి… వైసీపీ రెండే కొండలు అంటుంది… ఏడుకొండల వాడా గోవిందా అనేది బీజేపీ సిద్ధాంతం… తిరుపతి ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది… వైసీపీ ప్రభుత్వం మూటామూల్లె సర్దుకునేలా తరిమికొడతాం… ఏపీ దేవాదాయ శాఖ పూర్తి ప్రక్షాళన అవసరం… హిందువుల కానుకల్ని కూడా ఈ ప్రభుత్వం దారిమళ్లిస్తోంది… ఏపీ బీజేపీ కేడర్ సహనాన్ని చేతకానితనంగా భావించొద్దు’’
ఇదేకదా… వైసీపీ మీద ఈ స్థాయి అటాక్ ఈమధ్యలో చంద్రబాబుకు కూడా చేతకాలేదు… అరె, ఏమిటీ మాటలు..? ఇలా మతాల నడుమ చిచ్చు పెట్టే ఆ భాష ఏమిటి అని ఆశ్చర్యపోకండి… మరీ ఎక్కువ మాట్లాడితే అదే తిరుపతిలో పాతబస్తీ ఉంటే చూపండి, అక్కడే ఓ గుడి చూసుకుని దీక్ష స్టార్ట్ చేస్తాడు… కమాన్, జగన్, బైబిల్తో వచ్చి ప్రమాణం చేస్తావా అని సవాల్ చేస్తాడు… అది తెలివి లేక కాదు… తనకు తెలిసిన తెలివి అదే… సూటిగా తలపడటమే…
(ఇది నమస్తే తెలంగాణ ఆమధ్య కసికసిగా అచ్చేసిన కార్టూన్… ఇప్పుడు సెట్ రైట్ అయిపోయింది గానీ ఆమధ్య టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మొత్తం మంటలే కదా…)
Ads
బండి సంజయ్ వ్యాఖ్యలు అనాలోచితం కావు… తన తీరే అంత… సూటిగా వెళ్లి, మతాల నడుమ ఓ అగ్గిపుల్ల గీస్తాడు… అటువైపా ఇటువైపా వచ్చేయ్ అంటాడు… సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు బాగా సర్క్యులేట్ అయ్యేకొద్దీ ఇక వైసీపీ సోషల్ మీడియా నుంచి రివర్స్ అటాక్ స్టార్టయింది… సహజమే… కానీ వైసీపీ-బీజేపీ రిలేషన్స్ బాగానే ఉన్నాయి కదా… మా సోము వీర్రాజు ఎప్పుడూ ఇలా మాట్లాడడు కదా, అసలు ఇదేం దాడి అనుకుని మొదట్లో కాస్త విస్తుపోయినా… తరువాత తేరుకుని ఉల్టా దాడి మొదలుపెట్టారు…
నిజం… బండి సంజయ్ కోరుకున్నది అదే… ముందు కెలకాలి… ఓ చర్చ స్టార్ట్ కావాలి… అదే జరిగింది… జగన్ ప్రభుత్వం వచ్చాక చాపకింద నీరులా క్రిస్టియానిటీ పెరుగుతోంది అని చెప్పీచెప్పనట్టు ఏపీ బీజేపీ నేతలు సణుగుడు స్థాయి విమర్శలు చేసేవాళ్లు… ఛల్ హట్, ఇదేందిర భయ్, వేస్తే బౌన్సర్లే వేయాలి అన్నట్టుగా… బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అని బాంబు వేశాడు…
అది పేలుతుందా.,.? తోకపటాకులాగా తుస్సుమంటుందా తనకు అనవసరం… బైబిల్ పార్టీ అనే ముద్ర వేయడం, అది జనంలోకి పోవడం సంజయ్ కోరుకున్నది… వైసీపీ నుంచి తిట్లపర్వం ఉంటుందని తెలియనివాడు కాదు కదా… ఫాఫం, చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేడు… అందుకే ఇంకా తేరుకోలేదు… అసలు తిరుపతిలో బీజేపీకి ఏం రిజల్ట్ వస్తుందనేది పక్కన పెట్టండి… అక్కడ పోరాటం ఎజెండా మతమే అని కుండబద్ధలు కొట్టాడు సంజయ్… అక్కడ సంజయ్ సామాజికవర్గం వోట్లు ఎక్కువ, బీజేపీ-జనసేన సరిగ్గా ఫైట్ చేస్తే గ్రేటర్ ఎన్నిక స్థాయిలో టీడీపీని పక్కకు నెట్టేసి, టఫ్ ఫైట్ ఇవ్వాలనేది పార్టీ ప్లాన్…
అసలే రాష్ట్రవ్యాప్తంగా గుళ్లల్లో విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి… ఇప్పటికీ జగన్ ప్రభుత్వం నుంచి కఠిన కార్యాచరణ లేదు… సో, ఉండీలేనట్టు, పోరాటం చేసీచేయనట్టుగా నప్పతట్ల వేషం పనికిరాదని చెబుతున్నాడు… ఎన్నికల ఎజెండాను ఫిక్స్ చేస్తున్నాడు సంజయ్… మరో మైండ్ గేమ్ ఏమిటంటే… తెలుగుదేశం మీద ఒక్క మాట మాట్లాడకపోవడం… అది ప్రేమ కాదు… అసలు తెలుగుదేశం అనే పార్టీ బరిలో బలంగా లేదనీ, ఆ పార్టీ గురించి మాట్లాడటమే వేస్ట్ అనేది స్ట్రాటజీ…! ఫాపం, వైసీపీని తిట్టినందుకు ఆనందపడాలో, అసలు తమను గుర్తించనందుకు బాధపడాలో తెలియడం లేదు పచ్చకేడర్కు..!!
Share this Article