.
కేంద్ర మంత్రి బండి సంజయ్ దూకుడు పెంచాడు… మొన్నామధ్య కేటీయార్ తనపై పరువునష్టం కేసు వేశాడు కదా… దాని తరువాత బండి విమర్శల దాడి పెరిగింది… 109 కేసులు పడ్డయ్ నామీద, పోరాటమే నా స్టయిల్ అన్నట్టుగా తాజాగా ఓ ఆరోపణతో మళ్లీ గోకాడు కేటీయార్‌ను…
అసలే కవిత ‘ఇంటి’ర్నల్ దాడితో తలనొప్పి పెరిగిపోగా… ఇప్పుడు ఈ బండి దాడి తోడయింది..! బీజేపీ-బీఆర్ఎస్ విలీనం-పొత్తు-సయోధ్య-అవగాహన వార్తలు ఎన్ని వస్తున్నా సరే, బండి సంజయ్ ‘నథింగ్ డూయింగ్’ ఫైట్ ఫైటే అన్నట్టుగా సాగిపోతున్న తీరు ఆసక్తికరం…
Ads
తాజాగా తను కేటీయార్ తిరిగే కారు మీద ఆరోపణ చేశాడు… ఇదుగో ఇలా…
‘‘కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా?
లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో ట్విట్టర్ టిల్లు ఎందుకు తిరుగుతున్నాడు?
ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి?
మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా?
పేమెంట్లు బినామీ పేర్లతోనా? నకిలీ ఆదాయమా? లేక మనీలాండరింగ్ ద్వారానా?
ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు కాదా?
వాస్తవాలు బయటకు రావాలి – సంబంధిత శాఖలు ఇన్వెస్టిగేట్ చేయాలి.
సంజయ్ సాబ్, ఇదేనా ఆ కారు..?
తను నేరాలు- శిక్షలకు సంబంధించిన కేంద్ర మంత్రి కదా… నేరుగా సమగ్ర దర్యాప్తు కోరుతూ డీఆర్ఐకు కూడా ఫిర్యాదు చేయొచ్చు… ఐనా అక్కడ కేసు దర్యాప్తులోనే ఉంది కూడా…
ఏమోలెండి… కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా ఇప్పటికీ దానిమీద కదలిక లేదు… పైగా ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇస్తారంటున్నారు… ఇవి సరే… ఇంతకీ ఈ లగ్జరీ కార్ల స్కామ్ ఏమిటి..?
13 మే 2025… పీఐబీ (అహ్మదాబాద్) వార్త ఏమిటంటే…?
‘‘నిఘా వర్గాల సమాచారం ప్రకారం…, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది… ఈ ముఠా ఖరీదైన లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నట్లు DRI గుర్తించింది… కస్టమ్స్ డ్యూటీని ఎగవేయడానికి, ఈ ముఠా దిగుమతి చేసుకునే కార్ల విలువను 50% వరకు తక్కువ చేసి చూపుతోంది…
ఈ మోసపూరిత కార్యకలాపాల్లో భాగంగా, ఈ కార్లను ముందుగా అమెరికా/జపాన్ నుండి దుబాయ్/శ్రీలంకకు రవాణా చేస్తారు… అక్కడ, ఈ కార్లను ఎడమ చేతి డ్రైవ్ (LHD) నుండి కుడి చేతి డ్రైవ్ (RHD)గా మార్చడంతో పాటు, ఇతర మార్పులు కూడా చేస్తారు… ఆ తర్వాత, నకిలీ పత్రాలను ఉపయోగించి వాటి వాస్తవ విలువను తక్కువగా చూపుతూ భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటున్నారు…
ఈ అక్రమ దిగుమతులపై DRI జరిపిన దర్యాప్తులో, హమ్మర్ EV, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, లింకన్ నావిగేటర్ వంటి 30కి పైగా లగ్జరీ కార్లను ఈ పద్ధతిలో దిగుమతి చేసుకున్నట్లు తేలింది… ఈ అక్రమ దిగుమతులకు సంబంధించిన వ్యక్తులు హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో ఉన్నట్లు DRI గుర్తించింది. ఇప్పటివరకు అంచనా వేసిన సుంకం ఎగవేత రూ. 25 కోట్లకి పైగా ఉంది…
ఈ ఆర్థిక నేరంలో భాగమైన అతిపెద్ద దిగుమతిదారులలో ఒకరిని DRI హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. ఈ వ్యక్తి 8 లగ్జరీ కార్లను దిగుమతి చేసుకోగా, వాటి ద్వారా రూ. 7 కోట్లకు పైగా కస్టమ్స్ డ్యూటీ ఎగవేసినట్లు గుర్తించారు… అహ్మదాబాద్‌లోని CJM కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది… అక్రమంగా దిగుమతి చేసుకున్న ఈ కార్ల అసలు యజమానులు, ఇతర దిగుమతిదారులపైనా DRI నిఘా పెట్టింది…’’
Share this Article