చెంగావి రంగు చీరె కట్టుకున్న చిన్నది, దానీ జిమ్మ దియ్య అందమంతా చీరెలోనె ఉన్నది … తెలుగు నాట కుర్రకారును ఉర్రూతలూగించిన పాట . దసరా బుల్లోడులో పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ పాటలాగే ఇదీ సూపర్ హిట్టయింది . అసలే ఆ చీరె కట్టింది వాణిశ్రీ, ఆపై సూపర్ హిట్ పాట… పక్కన అక్కినేని, ఇంకేం, మోత మోగిపోయింది… ఆ గోల్డ్ స్పాట్ రంగు ఆడవారికి అప్పట్లో ఎంత ఇష్టం అయిపోయిందంటే ఆ రంగు చీరె కొనని మహిళ లేదు అప్పట్లో . ప్రపంచం చెంగావి రంగు మయమైంది… చీరెలు , ఓణీలు ఇరగ అమ్మాం మా బట్టల షాపోళ్ళం . అందమంతా చీరెలోనె ఉన్నది అనే మాటలు బాగానే విమర్శలకు గురయ్యాయి .
వాణిశ్రీ -ANR జోడీ జైత్రయాత్రలో మరో ఘట్టం 1973 లో వచ్చిన ఈ బంగారు బాబు సినిమా . 12 కేంద్రాలలో వంద రోజులు , విజయవాడలో సిల్వర్ జూబిలీ ఆడింది . నిర్మాత , దర్శకుడు రాజేంద్రప్రసాదుకు కనక వర్షం కురిసింది … కధ , స్క్రీన్ ప్లే కూడా ఆయనదే . బాగా మసాలా దట్టించి తీసారు . ఎక్కడా బోర్ లేకుండా , పాటలు మాటలు సన్నివేశాలు పరుగులు తీస్తాయి …
ముఖ్యంగా కె వి మహదేవన్ సంగీతం . ఆత్రేయ పాటలు . ఈ సినిమాకు గుండె కాయ . శ్రీరామచంద్రా నారాయణా, ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా , తగిలిందయ్యో తగిలింది , ఏడడుగుల సంబంధం , ఏమనుకున్నావు నన్నేమనుకున్నావు , కన్నయ్య లాంటి అన్నయ్య పాటలు చాలా శ్రావ్యంగా ఉండటమే కాకుండా వీర హిట్టయ్యాయి .
Ads
ఈ సినిమాలో వాణిశ్రీ సినిమా ఏక్టర్ కావటాన్ని దర్శకుడు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు . శివాజీ గణేశన్ని , రాజేష్ ఖన్నాని , శోభన్ బాబుని చూపించి ప్రేక్షకులకు హుషారు కలిగించారు .
SVR , జయంతి , జగ్గయ్య , నాగభూషణం , రాజబాబు , రమాప్రభ , సూరేకాంతం , రమణారెడ్డి , పద్మనాభం ప్రభృతులు నటించారు . అవుట్ డోర్ లొకేషన్లు చాలా బాగుంటాయి . ఎన్ని సార్లు చూసానో ! కాలేజి రోజుల్లో థియేటర్లో , ఈ మధ్య కాలంలో టివిలో . యూట్యూబులో ఉంది . చూడని వారుంటే అర్జెంటుగా చూసేయండి . Entertaining , musical feast . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు….. (డోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Balasubrahmanyam Bhinnuri యాడ్ చేసిన సమాచారం ఏమిటంటే… ‘‘ఈ కథ రాజేంద్రప్రసాద్‌ది కాదు.. 1967లో బెంగాలీలో నాయికా సంగ్బాద్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాను రాజేశ్‌ఖన్నా హీరోగా అజ్‌నబీగా తీశారు. అదే సినిమాను తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా సుమతి ఎన్ సుందరిగా తీశారు. దాని ఆధారంగా తెలుగులో కొన్ని మార్పులు చేసి బంగారుబాబుగా తీశారు. వీటన్నింటికీ మూలం హాలీవుడ్‌లో వచ్చిన రోమన్ హలీడే.. దాంతో పాటు ఇట్ హేవన్‌డ్ వన్ నైట్ సినిమా.. దాన్నే హిందీలో చోరీ చోరీగా తీశారు. బెంగాలీలో ఉత్తమ్‌కుమార్, అర్చనా భౌమిక్ హీరో హీరోయిన్లు….’’
Share this Article